నవతెలంగాణ – వేములవాడ
ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో అమెరికా, సింగపూర్ మహానగరాలు తెలంగాణ సంస్కృతితో ముస్తాబయ్యాయి. వేములవాడ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానికులు, విదేశీయులు, ప్రవాసులు సమష్టిగా పాల్గొని వేడుకలను మరింత విశేషంగా మార్చారు.
అమెరికా ఆస్టిన్‌లో ఉత్సవాలు
ఆస్టిన్ హిందూ టెంపుల్ కమ్యూనిటీ పార్క్‌లో మహిళలు, చిన్నారులు, యువతులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. డిజే సప్పులు, బ్యాండ్ బాజాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమెరికా వాసులు కూడా భారతీయుల వెంట నిలిచి సాంప్రదాయ వేషధారణలో బతుకమ్మలో పాల్గొనడం విశేషం. “ఎన్నారైలతో పాటు స్థానికులు కూడ కలిసిన ఈ సంబరాలు చరిత్రాత్మకంగా నిలిచాయి” అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
సింగపూర్‌లో అంబరాన్నంటిన వేడుకలు
సింగపూర్ సంబవాంగ్ పార్క్‌లో 3,000 మందికి పైగా ప్రవాసులు బతుకమ్మ ఆడారు. ఆడపడుచులు అలంకరించిన బతుకమ్మలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. పాల్గొనేవారికి ప్రత్యేక బహుమతులు, పురస్కారాలు అందజేశారు. దాతలను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. “దశాబ్దంగా సింగపూర్‌లో బతుకమ్మకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇది తెలంగాణ సంస్కృతి ఘనతను చాటిచెబుతోంది” అని సొసైటీ సభ్యులు తెలిపారు. అమెరికా, సింగపూర్‌లలో జరిగిన ఈ ఉత్సవాలు ప్రవాస భారతీయులకే కాకుండా స్థానికులకు కూడా తెలంగాణ సంప్రదాయాల వైభవాన్ని పరిచయం చేశాయి.