న్యూఢిల్లీ : లద్దాఖ్‌లో చెలరేగిన హింసకు కారకుడన్న ఆరోపణపై పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్ట్ చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో వాంగ్‌చుక్ పాకిస్తాన్‌లో జరిపిన పర్యటనపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. అలా పర్యటించడం నేరమని వారి అభిప్రాయం. అయితే వాంగ్‌చుక్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లారంటే…పాక్‌లోని ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన డాన్ గ్రూప్ ఓ సదస్సును ఏర్పాటు చేసి ఆయన్ని ఆహ్వానించింది. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై చర్చించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పులపై అవగాహన కలిగించడానికి డాన్ సంస్థ దక్షిణాసియా ప్రాజెక్టును చేపట్టింది.
వచ్చే ఏడాది కూడా మరో సదస్సును నిర్వహించి సంప్రదింపులను కొనసాగించాలని డాన్ యోచిస్తోంది. దక్షిణాసియాలోని దేశాలు వాతావరణ మార్పుల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌లో ఐరాస సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఇంద్రికా రట్వట్టే అధ్యక్షతన సదస్సులో జరిగిన చర్చలో వాంగ్‌చుక్ పాల్గొని ప్రసంగించారు. లద్దాఖ్‌లో ఐస్ టవర్స్ గురించి ఆయన మాట్లాడారు. అక్కడ వాంగ్‌చుక్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. పర్యావరణ కార్యకర్తగా మాత్రమే ఆయనను పరిచయం చేశారు. ఆయన రాజకీయ కార్యకలాపాలు లేదా నిరాహార దీక్షల గురించిన ప్రస్తావనే రాలేదు. ఇది వాతావరణ మార్పులకు సంబంధించిన సదస్సు మాత్రమేనని, వాంగ్‌చుక్ నిర్వహిస్తున్న ఇతర కార్యకలాపాలను చెప్పాల్సిన అవసరమేమీ లేదని నిర్వాహకులు తెలిపారు.
వాతావరణ సదస్సు కోసమే వాంగ్‌చుక్ పాక్ పర్యటన
- Advertisement -
- Advertisement -