కాస్తులో ఉన్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-గూడూరు
పోడు భూముల సమస్యను పరిష్కరించి కాస్తులో ఉన్న ప్రతి రైతుకూ హక్కు పత్రాలు అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగయ్య అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో పార్టీ జిల్లా నాయకులు జనగం వీరస్వామి అధ్యక్షతన పోడు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు చేస్తున్న పోడు భూములకు ప్రభుత్వాలు హక్కులు కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా తరతరాల నుంచి సాగు చేస్తున్న రైతులకు ఎలాంటి హక్కులు లేకపోవడం వల్ల పోడు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ మండలాలైనా కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల్లో ఎంతోమంది అర్హులైన రైతులకు నేటికీ హక్కు పత్రాలు లేదని తెలిపారు. దాంతో ప్రభుత్వాల నుంచి అందాల్సిన రైతుబంధు, రైతు భీమా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీలు అందడం లేదని అన్నారు.
పట్టాదారు పాసుబుక్కులు లేనందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పండించిన పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కాస్తులో ఉన్న రైతులందరికీ హక్కు పత్రాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోడు రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం 18మందితో పోడు భూముల సాధన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా జనగం వీరస్వామిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, గూడూరు, కొత్తగూడ, గంగారం నాయకులు నక్క సైదులు, లక్ష్మయ్య, రామటెంకి రామచంద్రయ్య, జనగాం సురేష్, రమేషు, భాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, ప్రశాంత్, మల్లేష్, చంటి, సుమలత, వెంకన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.