కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో బాకీపడ్డ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలి : మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-సిద్దిపేట
‘ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ కార్డులోని పథకాలను.. అమలు చేయకుండా ప్రజలకు బాకీ పడింది. ఆ బాకీలను కార్డు రూపంలో ప్రచురించాం. అవి మనకు బ్రహ్మాస్త్రం.. వాటిని ఇంటింటికి పంపిణీ చేయాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారనీ, రేపు నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ బాకీ కార్డు పంపిణీ చేయాలని సూచించారు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ పడిందన్నారు. రైతుబంధు రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తామన్నారని.. కానీ ఇప్పటివరకు ఒక రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.
మహిళలకు ప్రకటించిన రూ.2500 పథకం ద్వారా రూ.44వేలు బాకీ పడ్డారన్నారు. అవి ఇచ్చిన తర్వాతే.. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలని తెలిపారు. అలాగే, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ అయిందన్నారు. పండుగ పూట కనీసం కరెంటు బుగ్గలు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంక బిందెల కోసం రేవంత్ రెడ్డి వేట పట్టిండు” అని అన్నారు. కంచె గచ్చిబౌలి, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌లో భూములు అమ్ముతా అని బయలుదేరిండని ఆరోపించారు. తమిళనాడులో అక్కడి గవర్నమెంట్ పొద్దున్న టిఫిన్ పెడుతుందని పొగిడిన సీఎం.. కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అధికారంలోకి వచ్చినంక ఎందుకు బంద్ పెట్టారని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకొని బీహార్ ఎన్నికలకు పంపడానికి పైసలు ఉన్నాయి గానీ.. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడానికి మాత్రం పైసలు లేవా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.