మణిపూర్ తరహాలోనే ఘర్షణలకు ఆజ్యం
అదానీకి 48 వేల ఎకరాల భూ కేటాయింపులు
శతాబ్దాలుగా ‘ఉన్ని’తోనే స్థానికులకు ఉపాధి
గొర్రెలు మేపే ప్రాంతాలన్నీ అదానీకి అప్పగింత
వాంగ్‌చుక్ అరెస్టు దానిలో భాగమే!
ప్రజల్ని భయపెట్టి, భూముల నుంచి వెళ్లగొట్టడమే మోడీ సర్కార్ లక్ష్యం
ఆర్టికల్ 370 రద్దు చేసి, జమ్మూకాశ్మీర్‌ను మూడు ముక్కలు చేసిన మోడీ సర్కార్ ఆ ప్రాంతానికి విముక్తి కల్పించామని ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని బూచిగా చూపి దేశభక్తి పేరుతో సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేసుకున్నారు. ఇక జమ్మూకాశ్మీర్ దశ మారిపోయిందంటూ పార్లమెంటులో కేంద్ర మంత్రివర్గం స్వోత్కర్ష చేసుకుంది. ప్రశ్నించిన వాళ్లపై దేశద్రోహులనే ముద్ర వేసి నోరెత్తకుండా కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇక్కడికి సీన్ కట్ చేస్తే… జమ్మూకాశ్మీర్ మూడు ముక్కల్లోని ఒక భాగమైన లడఖ్ ప్రాంతంలో మోడీ సర్కార్ అదానీకి చెందిన సోలార్ కంపెనీకి 48వేల ఎకరాల భూమిని కేటాయించింది. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడఖ్ ప్రాంత ప్రజలు శతాబ్దాలుగా ‘ఉన్ని’పై ఆధారపడి జీవిస్తున్నారు. గొర్రెల పెంపకం వారి జీవితంలో ఓ భాగం. ఇప్పుడు ఆ గొర్రెల్ని మేపుకొనే పచ్చిక బయళ్ల ప్రాంతాలన్నింటినీ అదానీకి ఇచ్చేశారు.
దీనితో స్థానిక ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. మణిపూర్‌లో కూడా అక్కడి కొండ ప్రాంతాల్లోని భూగర్భ ఖనిజాలను అదానీ కంపెనీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల నుంచి మణిపూర్ ట్రైబల్స్‌ను వెళ్లగొట్టేందుకు రెండేండ్లుగా ఆ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారు. వందలాది ప్రాణాలు తీసారు. అయినా అక్కడి ప్రజలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లడఖ్ పరిస్థితి కూడా అలాగే మారింది. అదానీకి కేటాయించిన భూముల నుంచి స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొట్టడమే లక్ష్యంగా మోడీ సర్కార్ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే పర్యావరణ ఉద్యమనేత వాంగ్‌చుక్‌ను అరెస్ట్ చేశారు. ఎలాంటి విచారణ లేకుండా కనీసం ఏడాదిపాటు అతన్ని జైలులో నిర్భంధించే సెక్షన్లన్నీ పెట్టారు. మరోవైపు పాకిస్తాన్ అనుకూలవాది అనే ముద్ర వేసేందుకూ ప్రయత్నిస్తున్నారు. అదానీకి భూ కేటాయింపుల విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించట్లేదు.
లేహ్ : ప్రకృతి సోయగాలకు నిలయమైన లడఖ్‌పై కార్పొరేట్ల కన్నుపడింది. కోట్లు గుమ్మరించే ప్రాజెక్టులు తమవాళ్లకు కట్టబెట్టడమే కాకుండా, వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి మరీ మోడీ సర్కార్ మెహర్బానీ చాటుకుంది. ఇటీవల లడఖ్ ముఖ్య పట్టణం లేహ్ లో హింసకు కారణమంటూ.. పర్యావరణవేత్తల్ని, అక్కడి జనాన్ని జైలుకు పంపిన విషయం తెలిసిందే. అసలు దీనివెనుక కథ ఏంటంటే… హిమాలయాల్లో లడఖ్ ప్రాంతం 60వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 1.34 లక్షల జనాభా ఉంది. ఇక్కడి ప్రజల జీవనాధారం ఉన్ని. గొర్రెల్ని పెంచి వాటి నుంచి తీసిన ఉన్నితో షాల్స్, స్వెట్టర్లు, కంబళ్లు వంటివి తయారు చేస్తారు. ఆ క్రయ విక్రయాలతో వచ్చిన డబ్బులతో కుటుంబాలు జీవిస్తున్నాయి. జమ్మూ కాశ్శీర్ విభజన తర్వాత కేంద్రంలోని మోడీ సర్కార్..లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి, అక్కడ తాము చెప్పిందే చేసే వారిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది.
ఫలితంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈసీఐ)తో అదానీకి చెందిన లడఖ్ అటానమస్‌హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఏహెచ్‌డీసీ) మధ్య ఒప్పందం జరిగింది. స్కైయాంగ్ ఛూ తాంగ్‌లో 48వేల ఎకరాల భూమిని కట్టబెట్టింది. 13 గిగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా అనుమతించింది. ఇందులో 9 గిగావాట్స్ సోలార్..4 గిగావాట్స్ విండ్ ఎనర్జీ ఉన్నాయి. లడఖ్ నుంచి హర్యానాలోని కైతాల్ వరకు 13 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని తరలించేలా డిజైన్ చేశారు. గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థను రూ.20,700 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందులో రూ.8,300 కోట్లకు కేంద్ర మద్దతు ఉంది. 2030 నాటికి 500 గిగావాట్ల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్థానికులకు తెలీకుండానే ఎంఓయూ
సోలార్ ప్రాజెక్టు వల్ల స్థానికుల జీవన విధానంపై పడే ప్రభావాలకు సంబంధించి ఆ ఎంఓయూలో ఒక్క వాక్యం కూడా లేదు. అసలు తమకు ఎలాంటి సమాచారం లేకుండా పైస్థాయిలో అంతా వారే రాసేసుకుని, అక్రమంగా భూముల్లో ఫెన్సింగ్‌లు వేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు వల్ల స్థానికులు ఉపాధి కోల్పోవడం సహా, అనేక విపత్తులు ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోలార్ ప్రాజెక్టు వల్ల ప్రభావిత ప్రాంతాలు
1.దెబ్రింగ్
2.సమద్..రాంక్‌చాన్
3.పాంగ్
4.ఖర్నాక్
మా బతుకులు చిన్నాభిన్నం : సోనమ్ థర్గిస్, స్థానిక గొర్రెల కాపరి
”మా కుటుంబంలో 11 మంది ఉన్నాం. ఇక్కడ కరెంట్ ప్రాజెక్టు వస్తుందంటా. మేం ఎక్కడికి పోవాలి. తరతరాల నుంచి గొర్రెలను మేపుకుంటూ..ఉన్ని తీయటమే మాకు తెలిసిన విద్య. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తు న్నాం. ఒకవేళ ఈ ప్రాజెక్టు కడితే మా బతుకులు చిన్నాభిన్న మె ౖపోతాయి. మా గొర్రెలు, పిల్లల్ని తీసుకుని ఎక్కడి వెళ్లాలి.
ఎస్‌ఈసీఐ ఏమంటుందంటే..
ఇక్కడ సోలార్ ప్రాజెక్టు కడితే స్థానికులకు యూనిట్ ధర 0.5 పైసలకు ఎల్‌ఏహెచ్‌డీసీకి ఇస్తామని ఎస్‌ఈసీ ఎర వేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలు ఇచ్చేందుకు రాష్ట్రం, కేంద్రం సిద్ధంగా లేవు. ఆ పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడమో, తిరస్కరించడమో చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో మరోవైపు నుంచి 713 కిలోమీటర్ల విస్తీర్ణంలో పాగ్ నుంచి కైథల్ మీదుగా హర్యానా వరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఐఎల్) భూగర్భ కేబుల్స్ ఏర్పాటు కోసం పైపుల్ని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం 300 ఎకరాల భూమిని పీజీసీఐఎల్, ఎల్‌ఏహెచ్‌డీసీకి కేటాయించింది.
వాంగ్‌చుక్‌ను కంట్రోల్ చేస్తే..
పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను అదుపుచేస్తే తమ సోలార్ ప్రాజెక్టుకు అడ్డంకులు ఉండవని కేంద్రం భావించింది. లెV్‌ాలో బీజేపీ కార్యాలయం దహనం వెనుక కూడా కాషాయశక్తులే ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేసి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించారు. అలా అరెస్టయిన వ్యక్తిని విచారణ లేకుండా 12 నెలలపాటు బంధించేలా చట్టం అనుమతిస్తుంది. కాషాయపెద్దలు కోరుకున్నదే అక్కడ జరుగుతోంది. ఇప్పటికే తమకు అడ్డొస్తున్నారనే కారణాలతో మావోయిస్టులు, ఉద్యమ కారులు, పర్యావరణవేత్తల్ని అక్రమంగా కాల్చి చంపడమో లేక విచారణేలేని కేసులు పెట్టి ఏండ్ల తరబడి జైలు పాలు చేయడమో చేస్తున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కేంద్రం చేసే ప్రతి పనివెనుకా అస్మదీయులకు మేలు చేసే ప్రణాళికలే ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.