– ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
– అవినీతి ఆరోపణలే కారణం
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శులు వద్ద అవినీతికి పాల్పడటం, విచ్చలవిడిగా విందులు వినోదాలలో పాల్గొన్నారన్న ఆరోపణలతో నవతెలంగాణలో వచ్చిన కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ ఎంపీడీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంవత్సరాలుగా హుస్నాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, ఇజీఎస్ పనులలో అవినీతికి పాల్పడ్డాడని నవతెలంగాణలో కథనాలు రాగ ఈనెల 3న జెడ్పి సీఈవో రమేష్, డిఆర్డిఓ పిడి జయదేవ్ ఆర్య ఇటీవల విచారణ జరిపారు.
విచారణ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కు సమర్పించగా పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎంపీడీవోను సస్పెండ్ చేశారు. మండల అభివృద్ధి అధికారిగా మండలంలోని సమస్యలను, అభివృద్ధిలో భాగస్వామ్యం కావలసిన ఎంపీడీవో అవినీతిని పాల్పడటం ఇటీవల మండలంలో చర్చనీయాంశమైంది. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎంపీడీవో సస్పెండ్ కావడం పట్ల హుస్నాబాద్ మండల ప్రజలతోపాటు పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఎంపిడిఓపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లాస్థాయి ఉన్నత అధికారులకు కృతజ్ఞతలు చెప్తున్నారు. కాగా ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి సస్పెండ్ కావడంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఎంపీఓ రమేష్ కు పూర్తి స్థాయి బాధ్యతలను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి ఎంపీడీవోగా రమేష్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఎట్టకేలకు అవినీతి ఎంపిడిఓపై వేటుపడటం మండలంలో చర్చ నియాంశమైంది.