నవతెలంగాణ–మల్హర్ రావు
స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో అనుకూలంగా ఉన్న స్థానాలు ఎక్కడ మారుతాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై హై కోర్టులో ఈ నెల 8న వాదనలు ఉండగా, మరుసటి రోజు నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంది. పరిషత్, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న వారిలో ఇదే చర్చ బంతి హైకోర్టులో ఉండడంతో ఏమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు..షెడ్యూల్ విడుదల.. హైకోర్టులో కేసు.. సుప్రీం కోర్టుకు సైతం కేసు వెళ్లనుందనే వార్తల నేపథ్యంలో రిజర్వేషన్లు మారుతాయా? అనే చర్చ అన్ని పార్టీల శ్రేణుల్లో సాగుతోంది. ఎక్కడ చూసినా.. ఏ ఇద్దరు కలిసినా.. ఫోన్లలో మాట్లాడుకున్నా ఇవే సంభాషణలు జరుగుతున్నాయి.ఇక పోటీ చేయాలనుకుంటున్న వారిలో ఈ అంశం ఉత్కంఠను రేపుతోంది. వ్యవహారం హైకోర్టులో ఉండడం, దీనిపై ఈ నెల 8న వాదనలు జరుగనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. పైగా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో అనే విషయమై ఆకా వహుల్లో ఆందోళన నెలకొనగా.. మరోవైపు మరుసటి రోజు నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టేందుకు యంత్రాంగం సిద్ధం అయ్యింది.దీంతో పరిణామాలు ఎలా మారుతాయోనని ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు పరేషాన్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతల్లో నిరాశ ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసి, గత పదేళ్లలో పలు కేసులు ఎదుర్కొన్నప్పటికీ తమకు పోటీ చేసే అవకాశాలు దక్కలేదని పలువురు అధికార పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఎంపీపీ స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎంపీటిసీ స్థానంలో పోటీ చేసేందుకు అనుకూలంగా రిజర్వేషన్లు దక్కకపోవడంతో ఆయా గ్రామాల కీలక నాయకులు నిట్టూరుస్తున్నారు. ఎంపీటీసీ స్థానం అనుకూలంగా వచ్చినప్పటికీ ఎంపీపీ పీఠంపై కూర్చునేందుకు అవకాశాలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద షెడ్యూల్ వచ్చినప్ప టికీ బంతి హైకోర్టులో ఉన్నందున ఎన్నికల వాతావరణంలో గతానికి భిన్నమైన ప్రత్యేకత నెలకొంది.