అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిలో అక్టోబరు ఒకటవ తేదీ నుంచి మరోసారి ప్రభుత్వం ”మూత” పడింది. ప్రపంచమంతటా మీడియా సంస్థలు దీనిగురించి వార్తలిచ్చాయి, చర్చోపచర్చలు సాగిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వం పనిచేయటం ఆగిపోయిందా? ఇది పాక్షిక సత్యం మాత్రమే. అమెరికా మిలిటరీ, వివిధ దేశాల్లో కుట్రలు సాగించే సిఐఏ, గాజాలో మారణకాండ, అర్జెంటీనా నియంతకు ఆదరణ, ఉక్రెయిన్‌లో రష్యా వ్యతిరేక సాయం, అమెరికా పట్టణాల్లో మిలిటరీని దించటం వంటివేవీ ఆగిపోలేదు. నిలిచిపోయిందేమిటి? లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, రోగులకు వైద్యసేవలు, జనాలకు సంక్షేమ పథకాలు. ఇతర సేవలు మాత్రమే గతంలో ఇదే ట్రంప్ ఏలుబడిలో రికార్డు స్థాయిలో 35 రోజులు ప్రభుత్వం పనిచేయలేదు. అప్పుడు కూడా పైన చెప్పుకున్నవేవీ ఆగిపోలేదు, అన్నిరకాల దుర్మార్గాలూ కొనసాగాయి. ట్రంప్ కోరిన విధంగా లేదా పెద్దది, అందమైన బిల్లు పేరుతో ఆమోదించిన దాని మేరకు సంక్షేమ రంగాలకు కోతలను ఆమోదించేది లేదని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ భీష్మించుకోవటంతో అక్టోబరు ఒకటి నుంచి కొన్ని ప్రభుత్వ అవసరాలకు నిధులు తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. దాంతో ట్రంప్ చిందులు తొక్కుతున్నాడు.
డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పథకాలకు నిధుల కోత లేదా ఎత్తివేస్తానంటూ రంకెలు వేశాడు. అన్నీ డెమోక్రాట్లే చేశారంటూ ఉద్యోగులు, జనాలను రెచ్చగొట్టేందుకు గాను సిబ్బంది తొలగింపు చేయకతప్పదని, దానికి డెమోక్రాట్లదే బాధ్యత అవుతుందని, వారు కోరుకుంటున్న పథకాలను రద్దుచేస్తానంటూ బ్లాక్‌మెయిలుకు దిగాడు. జనాన్ని ఆకట్టు కొనేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన పన్నుల ద్వారా వచ్చే లక్ష కోట్ల డాలర్లను (నిజానికి అంత మొత్తం వస్తుందని ఎవరూ చెప్పటం లేదు, ఒకవేళ వచ్చినా ఆ మేరకు వినియోగదారులే తొంభైశాతం వరకు భరించాల్సి ఉంటుంది) కుటుంబానికి వెయ్యి నుంచి రెండువేల డాలర్ల వంతున అందరికీ పంపిణీ చేస్తానంటూ బిస్కెట్ వేశాడు. పార్లమెంటు ఉభయ సభల్లో రిపబ్లికన్లే మెజారిటీ అయినప్పటికీ సెనెట్‌లోని వంద మంది సభ్యుల్లో అరవై మంది అనుకూలంగా ఓటు వేస్తేనే ఖజానా నుంచి నిధులు తీసుకొనేందుకు వీలుకలుగుతుంది. అందువలన ఆ మేరకు డెమోక్రాట్లు మద్దతు ఇస్తేనే పని జరుగుతుంది. రెండుపార్టీల నుంచి అటూ ఇటూ కొందరు ఫిరాయించి ఓటు వేసినప్పటికీ 55-45 దగ్గర స్తంభన ఏర్పడింది. అందువలన మరో ఐదుగురు డెమోక్రాట్లను ఫిరాయించేట్లు చేస్తే ఇది తొలగిపోతుంది.
లేకుంటే ప్రజాప్రతినిధుల సభ మెజారిటీ తీర్మానం చేస్తే, అధ్యక్షుడు నిర్ణయం తీసుకుని నిధుల విడుదలకు సుగమం చేయాల్సి ఉంటుంది. అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి నిధులు కావాలన్న ట్రంప్ ప్రతిపాదనను 2018లో డెమోక్రాట్లు వ్యతిరేకించారు. రిపబ్లికన్లు అందమైన బిల్లుగానూ ప్రతిపక్షం అసహ్యకరమైనదిగా వర్ణించిన సంక్షేమ పథకాల కోతల ప్రతిపాదనల మీద ఇప్పుడు ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ మూతకు ట్రంప్ రెండోసారి అధికారానికి రావటంతోనే నాంది పలికాడు.ప్రాజెక్టు 2025 పేరుతో ఎన్నికలకు ముందే ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, సంక్షేమ పథకాలకు కోత, జనంపై భారాల మోతకు పూనుకున్నాడు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్‌ను రంగంలోకి దించి సామర్ధ్యం పెంపు ముసుగులో కొన్ని నెలల్లోనే మూడు లక్షల మంది వరకు ఇంటికి సాగనంపటం లేదా వారిచేతే బలవంతంగా రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే.బిడ్డపోయినా పురిటి కంపు పోలేదన్నట్లుగా ఎలన్‌మస్క్ లేకున్నా అతగాడి అజెండా అలాగే ఉంది.
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ట్రంప్ కోతలను సమర్ధిస్తే తమకు నష్టమేనని అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు ఆందోళన పడుతున్నారు. నవంబరులో మేయర్ ఎన్నిక జరిగే న్యూయార్క్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 18, డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎనిమిది బిలియన్ డాలర్ల హరిత ఇంథన ప్రాజెక్టు కేటాయింపు ఇప్పటికే పక్కన పెట్టారు. ట్రంప్ తమను వేధించటం గాక అమెరికన్ కుటుంబాలను బాధిస్తున్నాడంటూ డెమోక్రాట్లు ధ్వజమెత్తారు. ఏ విధంగా చూసినప్పటికీ ఇది యావత్ కార్మికవర్గం మీద దాడి తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం మూతపడింది గనుక గతంలో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకూ కాలం చెల్లినట్లే అని కొందరు అధికారులు చెప్పటం దానికి నిదర్శనం. నిజానికి మూతతో కార్మికవర్గానికి ఎలాంటి ప్రమేయమూ లేదు. తమ వేతనాల్లో ఎలాంటి కోత విధించటానికి వీల్లేదం టూ ఒప్పందాలను అమలు చేయాల్సిందేనని అనేక మంది కోర్టులకు వెళ్లేందుకు సన్నద్దమౌతున్నారు. ఈ మూతను ఎలా ముగిస్తారన్నది చూడాల్సి ఉంది. జనం మీద పెనుభారం మోపితే కార్మిక వర్గంలో ఇప్పటికే ఉన్న అసంతృప్తి మరింతగా పెరిగేందుకు, వీధుల్లోకి వచ్చేందుకు దారితీస్తే ట్రంప్‌దే బాధ్యత అవుతుంది.
అమెరికా కార్మికవర్గంపై దాడి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES