జగ్గారెడ్డి సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భార్య నిర్మల
యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడొద్దు
దసరా పండగ ఉత్సవ వేదికపై కీలక వ్యాఖ్యలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మూడేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. దసరా పండుగ ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇంకో పదేండ్ల వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా మూడు సార్లు తనను గెలిపిస్తే నియోజక వర్గం కోసం ఏం చేయాలో అది చేశానన్నారు. ఐఐటీ హైదరాబాద్, ఇంటింటికి తాగునీరు, వ్యవసాయ యూనివర్శిటీ తీసుకు వచ్చానని అన్నారు. మూడేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సతీమణి, టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మల బరిలో ఉంటారని ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన చేర్యాల ఆంజనేయులు లాంటి వారికి కూడా అవకాశాలు రావాలన్నారు. పదేండ్ల తర్వాత మాత్రం తానే పోటీ చేస్తానని వెల్లడించారు. సంగా రెడ్డి అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. అలాగే, కూన సంతోష్ వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మెన్ అభ్యర్థి అని ఏదైనా అవసరం ఉంటే పనుల కోసం సంతోష్ ను కలవాలని పట్టణ ప్రజలకు సూచించారు.
యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడొద్దు
యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని జగ్గారెడ్డి సూచించారు. అతి వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులను క్షోభకు గురిచేయొద్దని తెలిపారు. తన కుమారుడు దత్తురెడ్డిని వేదికపైనే హెచ్చరించారు. వాహనంలో ప్రయాణించే సమయంలో 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పోవద్దని సూచించారు. తమ పిల్లలు ఇబ్బందులు పడుతుంటే తల్లిదండ్రులు మానసిక వ్యధను అనుభవిస్తారని అన్నారు.
తల్లిదండ్రులను పిల్లలు మంచిగా చూసుకోవాలని సూచించారు. కాగా, పట్టణంలోని రాంమందిర్ నుంచి అంబేద్కర్ మైదానం వరకు శ్రీరాముని విగ్రహాలను (చావా) ఊరేగింపుగా తీసుకువచ్చారు. జగ్గారెడ్డి భజన పాటలు ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అంబేద్కర్ క్రీడా మైదనంలో రావణాసుర వథ నిర్వహించి పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. గ్రౌండ్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES