ఏర్పాట్లపై సమీక్షించిన నిర్వహణ కమిటీ
హైదరాబాద్ : నవంబర్ 3 నుంచి 6 వరకు జాతీయ సబ్ జూనియర్ జూడో చాంపియన్‌షిప్స్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరుగనున్న నాలుగు రోజుల ఈవెంట్ ఏర్పాట్లపై టోర్నమెంట్ నిర్వహణ కమిటీ ఆదివారం మత్స్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించింది. ‘తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోంది. మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అండర్-14 స్థాయిలో జరిగే ఈ టోర్నీకి ఏర్పాట్లు ఘనంగా చేయాలి. ఈ టోర్నమెంట్‌పై అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తతంగా ప్రచారం నిర్వహించాలి. రాష్ట్రంలో జూడో క్రీడకు ప్రాచుర్యం తీసుకురావాలని’ తెలంగాణ జూడో అసోసియేషన్ చైర్మెన్, ఫిషరీష్ కార్పోరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ అన్నారు. తెలంగాణ జూడో అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు కైలాష్ యాదవ్, అజిత్, రామ్ లక్ష్మణ్, జిల్లెల శ్రీనివాసరావు, దుపాకి సంతోష్ కుమార్, మేకల అభినవ్, సిహెచ్ రాము, ఇస్మాయిల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.