సంప్రదాయవాదంతో ఉన్మాదం
నల్లజాతీయులు, విదేశీయులపై దాడులు
హత్యలకు దారి తీస్తున్న పరిస్థితులు
భారతీయులూ బాధితులే
ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత నుంచి తీవ్రం
వాషింగ్టన్ : అమెరికాలో జాత్యహంకారం ఆందోళన కలిగిస్తున్నది. ఇది అక్కడి నల్లజాతీయులు, ఇతర ప్రజలు, విదేశీయులను గందరగోళ పరిస్థితిలోకి నెట్టేస్తున్నది. యూఎస్‌లో జాతి ద్వేషాన్ని నరనరాన నింపుకున్న మితవాద శక్తుల దాడులకు వీరు బలవుతున్నారు. మితవాద శక్తులు, నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలకు ప్రభావితులవుతున్న కొందరు ఇలాంటి దారుణమైన చర్యలకు దిగుతున్నారు. ఇందుకు అమెరికాలో ఉన్న గన్‌కల్చర్ కూడా తోడై అది హత్యల వరకూ దారి తీస్తున్నది. ఇటీవల ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నదని మేధావులు, విశ్లేషకులు చెప్తున్నారు.
జాతి ఆధారంగా జరిగే దాడులు, చూపే ద్వేషం, అసమానతలు వంటివి యూఎస్‌లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అక్కడి నల్లజాతీయులు, శ్వేతజాతీయేతరులకు ఇవి పెద్ద సమస్యలుగానే పరిణమించాయి. ఎన్‌ఏఏసీపీ ప్రకారం.. 65 శాతం మంది నల్ల జాతీయులు ఇలాంటి దాడులకు టార్గెట్‌గా ఉన్నారు. అలాగే దాదాపు 35 శాతం మంది లాటినో, ఆసియా వ్యక్తులు తమ జాతి కారణంగా లక్ష్యంగా మారినట్టు భావించారు. ఇక అమెరికా జైళ్లలో మగ్గుతున్న తెల్లజాతి అమెరికన్ల కంటే నల్లజాతి అమెరికన్లే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావటం గమనార్హం.
వివక్షతతో ఆర్థిక అంతరాలు : యూఎస్ ఆర్థికవేత్తలు
అమెరికాలోని పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్‌లోని 1422 మందిపై 2021లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. యూఎస్‌లో తెల్ల, నల్లజాతీయుల మధ్య ఆర్థిక ఫలితాల్లో వ్యత్యాసాలు అధికంగా ఉన్నాయని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీనికి నల్లజాతీయుల పట్ల కొనసాగుతూ వస్తున్న వివక్షత ప్రమాణాలే కారణమని వివరించారు. 2024లో యూఎస్‌లో జాతి న్యాయం ఒక ముఖ్యమైన మానవ హక్కుల సమస్యగా మిగిలిపోయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొన్నది. ”దాదాపు 60 ఏండ్ల క్రితం అన్ని రకాల జాతి వివక్ష నిర్మూలనపై అంతర్జాతీయ కన్వెన్షన్‌ను యూఎస్ ఆమోదించింది. కానీ దాని నిబంధనల అమలును మాత్రం చాలా తక్కువ చేసింది” అని వివరించింది.
ప్రజలపై జాతి అసమానతల ప్రభావం
జాతి న్యాయం, అసమానతల సమస్య నల్లజాతీయులు, తెగలు, ఇతర ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల విషయంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వీరి జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నది. ఈ జాతి ప్రజలను మానసికంగా కుంగదీస్తున్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకటం అతి కష్టంగా మారుతున్నది. ఫలితంగా ఆదాయ అంతరాలు తీవ్రమవుతున్నాయి. జాతి ద్వేషం, అన్యాయం, అసమానతలు వీరిపై దాడులను తీవ్రం చేస్తున్నాయి. వారి విలువైన ప్రాణాలను కోల్పోయేలా చేస్తున్నాయి.
పని చేయని మోడీ దౌత్యం
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు భారత దౌత్య సంబంధాలు చాలా మెరుగుపడ్డాయని బీజేపీ, దాని అనుకూల మీడియా ప్రచారం చేస్తుంటాయి. కానీ ఈ దేశాల్లోనే భారతీయులకు రక్షణ లేకుండా పోతున్నది. ఆస్ట్రేలియాలో భారత వలసదారుల సంఖ్య పెరిగిపోయిందని అక్కడి మితవాద శక్తులు కొన్ని రోజుల క్రితం ర్యాలీలు, నిరసనలకు దిగిన విషయం విదితమే. ఇక అమెరికాలో ట్రంప్ పాలనలోనైతే ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యమయ్యాయి. అక్కడి మితవాద శక్తులు మరో ముందడుగేసి.. అక్కడి విదేశీయుల ప్రాణాలనూ బలిగొంటుండటం ఆందోళనకరం.
ట్రంప్ పాలనలో అధికం
ఈ జాతి ద్వేషానికి భారతీయులు కూడా బాధితులుగా మిగులుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్.. ఒకప్పటి జర్మన్ నియంత హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని మేధావులు చెప్తున్నారు. నాజీ భావజాలాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంప్రదాయవాదంతో అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని వివరిస్తున్నారు. ఆయన అధ్యక్ష పీఠంపై కూర్చున్న మొదటి దఫాతో పాటు ప్రస్తుతం కూడా ఇలాంటి జాత్యహంకార దాడులు అధికంగా నమోదయ్యాయని మేధావులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
యూఎస్‌లో జాతి విద్వేషం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES