మాజీ మంత్రి హరీశ్ రావు
యూసఫ్‌గూడ డివిజన్‌లో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్‌గూడ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో కలిసి పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా, ప్రజలకు బాకీ పడ్డ కార్డులను పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిపోయిందని, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. మరో 20 నెలలు గడువు ఇచ్చినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చటం వారికి చేతకాదని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని, ఆ పార్టీ వారు ఇచ్చే డబ్బులు తీసుకుని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సూచించారు. ఉప ఎన్నిక ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు మూడుసార్లు మాగంటి గోపీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ఆయన చేసిన అభివృద్ధి ప్రజలు మరిచిపోరని, ఉపఎన్నికలో మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారని, ఓటర్లపై తనకు నమ్మకం ఉందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, స్థానిక నాయకులు భారీగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు.