సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
పార్టీ ఆధ్వర్యంలో భీం విగ్రహానికి నివాళ్ళు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసుల హక్కులకు రక్షణ కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కొమురం భీం చౌక్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. జల్ జంగల్ జమీన్ పోరాటం నిర్వహించి అమరులైన కొమరం భీమ్ ఆశయాలు నేటికీ నెరవేరలేదని అన్నారు. ఇప్పటికీ ఆదివాసులను తమ భూముల నుంచి, తమ ఊర్ల నుంచి వెళ్ళగొడుతున్నారని ఆరోపించారు. అటవీ శాఖ దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని అన్నారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని గ్రామాలలో రోడ్డు సౌకర్యం గాని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం గాని ఇతర అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తిగా అటవీ శాఖ వారు అడ్డుకుంటున్నారన్నారు. షెడ్యూల్లో ఉన్నటువంటి ఏరియాలో కూడా జనరల్ రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఆదివాసులను ప్రజాప్రతినిధులను రాకుండా అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఆదివాసుల హక్కుల కోసం సీపీఎం పార్టీ నిరంతరం పోరాటాలు నిర్వహించాలని దీక్షలకు పూనుకున్నారని అన్నారు.
సీజేఐ పైన దాడిని ఖండిస్తున్నాం
కొమరం భీమ్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం ఈ దేశంలో ఇంకా అమలు జరగడం లేదని అన్నారు. దానికి మంచి ఉదాహరణ సోమవారం సుప్రీంకోర్టు సిజేఐపైన జరిగిన దాడే అన్నారు. మతోన్మాది ఒక లాయరు బూటును సీజేఐ పైన విసరడం ఇది యావత్ భారతదేశం మీద జరిగినటువంటి దాడిగా మన పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిని పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో దళితులు ఒక అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించడమేంటి అనేటటువంటి కుట్ర తోటి, కుళ్ళు బుద్ధి తోటి ఆయన మీద దాడి చేశారన్నారు.
కావున ఈ దేశం అందరిదీ ఈ దేశంలో లౌకిక దేశం లౌకిక భారత రాజ్యాంగం ద్వారా నడుస్తున్నటువంటి ఈ దేశంలో కొంతమంది భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచేలాగా నేడు వ్యవహరించడం మంచిది కాదన్నారు. సిజేఐ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. దాడి చేసిన ఆ లాయర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జీవితాంతం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకులు లంక రాఘవులు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల, ఆర్ సురేందర్, ఎన్ స్వామి, నాయకులు అగ్గిమల్ల స్వామి, ఆరిఫా బేగం, కే ఆశన్న, నగేష్, దేవిదాస్ పాల్గొన్నారు.