భారత ప్రజాస్వామ్య ఆత్మను ప్రతిబింబించే న్యాయక్షేత్రం మన సుప్రీంకోర్టు. అక్కడి తీర్పులు, వ్యాఖ్యలు దేశానికి దిశానిర్దేశం చేస్తాయి. అలాంటి ప్రదేశంలో ఏకంగా ప్రధాన న్యాయమూర్తి మీదే దాడికి పూనుకోవడమంటే.. అది మనదేశ ప్రజాస్వామ్య హృదయాన్ని గాయపరచడమే. రాకేశ్ కిశోర్ అనే న్యాయవాది చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పై బూటు విసరడానికి యత్నించడం కేవలం వ్యక్తిగత ఆవేశం మాత్రమే కాదు, అది నేరుగా ఈ దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రతపై, రాజ్యాంగ విలువలపై చేసిన రాజకీయ దాడి. సోమవారం జరిగిన ఈ అమానుషాన్ని ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ మానసికతకు ప్రతిబింబంగానే అర్థం చేసుకోవాలి. ఇది యాదృచ్ఛికం ఎంతమాత్రమూ కాదు. దేశంలో స్వతంత్ర సంస్థలను క్రమంగా బలహీనపరిచే ఒక రాజకీయ ధోరణి గత కొన్నేళ్లుగా ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. మన ప్రజాస్వామ్యపు ప్రతి స్తంభాన్నీ బీటలువార్చే ప్రయత్నాలు ఒక విధానంగా అమలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు, తీర్పులు పాలకవర్గాల్లో అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. అదే అసహనం ఇప్పుడు ఇలాంటి అఘాయిత్యాలకు దారితీస్తోంది.
నాటి గాడ్సే నుంచి నేటి రాకేశ్ కిశోర్ వరకు ఇదే రీతి, ఇదే నీతి. ఇవి ‘వ్యక్తిగత అసహనాలు’ కాదు, ‘వ్యవస్థీకృత అసహనాలు’. ఈ ఘటనల వెనుక ఒక మతమౌఢ్యపు చీకటి ఉంది. అది ఈ దేశ లౌకికవాద హృదయంపై దాడి చేస్తోంది. ”సనాతన ధర్మాన్ని అవమానించారు” అనే వాదనతో హింసకు న్యాయం చెయ్యడం, నాడు గాంధీ హత్య నుంచి నేడు జస్టిస్ గవాయ్ పై దాడి వరకు సాగుతున్న మనువాద పథానికి మరో ముసుగు మాత్రమే. న్యాయమూర్తుల నిర్ణయాలు మతప్రసక్తిలో కాక, రాజ్యాంగంలో ఉన్న చట్టాల్లో ఉంటాయని గుర్తించడం ఈ వర్గాలకు ఇష్టం ఉండదు. అందుకే వారు చట్టాలతో పాటు న్యాయమూర్తులనూ శత్రువులుగా చూస్తున్నారు. ఇదే ధోరణి ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులోకి దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనం, మతోన్మాదం, ‘ధర్మరక్షణ’ పేరుతో నడుస్తున్న హిస్టీరియాకు ఈ ఘటన ఒక స్పష్టమైన సంకేతం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన లౌకికవాద హామీని సవాలు చేసే చర్య ఇది. న్యాయస్థానం ధర్మసభ కాదు. అది రాజ్యాంగబద్ధమైన న్యాయసభ. కానీ ఇక్కడ మతభావాల మోత మోగించాలనే ప్రయత్నం మహా ప్రమాదకరమైనది. నిజానికి ఖజురహో దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ట్ఠపై సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన విషయాన్ని మాత్రమే సూచించాయి.
”ఆర్కియాలజికల్ సైట్, ఏఎస్‌ఐ అనుమతి అవసరం” అన్న సారాంశాన్ని ”విష్ణువుపై దూషణ”గా చూపించి సోషల్ మీడియాలో విద్వేష ప్రచారం నడిపించారు. ఆ ప్రచారం ఇప్పుడు కోర్టు నడిబొడ్డుకు చేరి, ప్రధాన న్యాయమూర్తి పైకే బూటు విసిరేంత ధిక్కారానికి దారితీసింది. ఒక ఆర్కియాలజికల్ సైట్‌లో పున:ప్రతిష్టపై అభిప్రాయం వ్యక్తం చేయడం పూర్తిగా న్యాయపరమైనది. కానీ దాన్ని ”సనాతనంపై దాడి”గా చిత్రీకరించడం ఫాసిస్టు మానసికత లక్షణం. భిన్నాభిప్రాయాలు వ్వక్తమయినప్పుడల్లా వాటిని ‘దేశద్రోహం’, ‘జాతి వ్యతిరేకత’గా దూషించే నాయకుల ధోరణే ఈ చర్యకు పాల్పడిన రాకేశ్ కిశోర్ లాంటి వారి మానసిక స్థితికి కారణం. న్యాయమూర్తుల తీర్పులు మతపరమైన అనుకూలతలతో ఉండాలన్న ఇలాంటి ఆలోచనలు మన దేశ లౌకిక స్వభావానికే పెనుసవాలు. ”సనాతన ధర్మం” పేరిట రాజ్యాంగాన్ని చిన్నచూపు చూడడం, లౌకికతను దూషించడం, న్యాయస్థానాలపై మతపరమైన ఉన్మాదాన్ని ప్రదర్శించడం… ఇవన్నీ ఒకే శ్రేణికి చెందిన రాజకీయ యత్నాలు. గత కొంతకాలంగా పాలకవర్గం తాలూకు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలలోనే ఆ మానసిక స్థితి పుట్టి పెరుగుతోంది.
ఇలాంటి సందర్భాల్లో మౌనం ఈ మనువాదులకు మద్దతే అవుతుంది. న్యాయవ్యవస్థను బలహీనపరచే ప్రయత్నాలకు రాజకీయ ప్రోత్సాహం దొరకడం అత్యంత ప్రమాదకరం. దేశంలో చట్టపరమైన నిర్ణయాలకన్నా మతపరమైన హుకూములు పైచేయి సాధించాలనే దిశగా కొందరు వ్యవస్థీకృతంగా కదులుతున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అది ఈ దేశ మనుగడకే ప్రమాదకరం. ఇక ఈ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి గవాయ్ చూపిన స్థైర్యం ప్రశంసనీయం. ”ఇలాంటి సంఘటనలతో మేం ప్రభావితమవ్వం” అని ఆయన చెప్పిన మాటలు.. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిధ్వనింపజేశాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణమే స్పందించి నిందిత న్యాయవాదిని సస్పెండ్ చేయడం సరైన మొదటి అడుగు. కానీ ఆ అడుగు అక్కడే ఆగిపోవద్దు. కేవలం వ్యక్తిని శిక్షించడం కాదు, అతన్ని ఈ చర్యకు ప్రేరేపించిన భావజాలాన్ని నిర్మూలించే చర్యలు తీసుకోవాలి. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలవాలి అంటే.. ఇలాంటి దాడులను కఠినంగా ఎదుర్కోవాలి. న్యాయం, లౌకికత, ప్రజాస్వామ్యం మన చేతుల్లోంచి జారిపోకుండా కాపాడుకోకపోతే, భవిష్యత్తులో కోర్టుతీర్పులు చట్టం ఆధారంగా కాక, మతం ఆధారంగా వెలువడే రోజులు దాపురిస్తాయి.
న్యాయానికి గాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES