దాడికి ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాధ్యత వహించాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు
హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్ నిరసన
పలు జిల్లాల్లో సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు, న్యాయవాదుల నిరసనలు
నవతెలంగాణ – ముషీరాబాద్/విలేకరులు
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఇటీవల కాలంలో దేశ యువతలో నింపుతున్న విద్వేషాల ఫలితంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడికి యత్నించారని, ఈ దాడికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని మోడీ పూర్తి బాధ్యత వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడిని ఖండిస్తూ సీపీఐ(ఎం), సీపీఐ, కేవీపీఎస్, తదితర ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం నిరసనలు తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడ్డాడని, ఇది ఆర్‌ఎస్‌ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని అన్నారు.
దళితుడు సీజేఐగా ఉండటాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 ఏండ్ల వేడుకలకు జస్టిస్ గవాయ్ తల్లిని ఆహ్వానించగా ఆమె తిరస్కరించినందుకు, అలాగే యూపీలో బీజేపీ సర్కార్ బుల్డోజర్లతో ఇండ్లను కూల్చి వేస్తుంటే జస్టిస్ గవాయ్ బుల్డోజర్ న్యాయం చెల్లదని.. రాజ్యాంగ న్యాయం చెల్లుతుందని తీర్పునివ్వడం, మరికొన్ని తీర్పుల కారణంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కక్ష పెంచుకొని దాడి చేశాయని అన్నారు. సనాతన ధర్మాన్ని అడ్డుకునే వారందరినీ ప్రతిఘటిస్తామని న్యాయవాది రాకేష్ కిషోర్ అంటున్నాడంటే దాని వెనకాల ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర దాగున్నదని తెలిపారు. ఈ దాడిని ప్రధాని ఖండించడమే కాదు.. పూర్తి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే న్యాయవాది రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దు చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను దేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించి సీజేఐకి అండగా నిలబడాలని కోరారు. అలాగే, ఓయూ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు తీవ్రంగా ఖండిస్తూ కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు. మేడ్చల్ మల్కాజగిరి జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కమలానగర్‌లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు ఎం. ధర్మానాయక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కేవీపీఎస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎం.కృపాసాగర్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. దశరథ్, బి.సుబ్బారావు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసనలు
హనుమకొండ జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని వీఆర్‌ఎస్ హాస్టల్ ముందు పరిశోధక విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. జనగామలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో భారీ నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆమనగల్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కందుకూరులో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపి, సీజేఐపై దాడిని ఖండించారు. వికారాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన, ధర్నా చేపట్టారు. నారాయణపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకొని నిరసన చేశారు. ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో కండ్లకు నల్ల గంతలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాల్వంచలో సీపీఐ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. భద్రాచలంలో ఐలూ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం గుర్జకుంటలో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నల్లరిబ్బన్లు ధరించి కోర్టు గేట్ ముందు నిరసన తెలిపారు. గజ్వేల్‌లో అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కోదాడలోని న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. రామన్నపేట మండల కేంద్రంలోని సీనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రోద్భలంతోనే సీజేఐపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES