– శిధిలావస్థలో పశువైద్య కేంద్రాలు
– కనీస సదుపాయాలు కూ నోచుకోని సిబ్బంది
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధారం అవుతున్నా, పశువైద్య సిబ్బంది కొరతతో పశుసంపద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సకాలంలో చికిత్సలు అందక, పశువులు విలవిల లాడుతున్నాయి. వినాయకపురం, నారాయణపురం పశు వైద్యులు డాక్టర్ స్వప్న, డాక్టర్ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం, మండలంలో అశ్వారావుపేట లో పశువైద్య ఏరియా ఆసుపత్రి, వినాయకపురం, నారాయణపురం లో ప్రాధమిక పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో అచ్యుతాపురం, నారం వారిగూడెం, సున్నం బట్టి, గుమ్మడివల్లి ప్రాంతాల్లో నాలుగు పశువైద్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం 47 గ్రామాల్లో పశుసంపద ఉన్నాయి.
ప్రస్తుతం మండలంలో తెల్ల పశువులు 9,127, నల్ల పశువులు 5,432, గొర్రెలు 8,519, మేకలు 10,670, మొత్తం 33,748 పశువులు ఉన్నాయి. అదనంగా 22 వేల పైచిలుకు కోళ్లు ఉండగా, మొత్తం పశుసంపద సంఖ్య 55,835 దాటింది.
అయితే ఇంత పెద్ద పశుసంపద కు తగినంత సిబ్బంది లేరు. ప్రతి ప్రాధమిక పశువైద్య కేంద్రంలో ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్), ఒక లైవ్ స్టాక్ అసిస్టెంట్ (ఎల్ఎస్ఏ), ఒక సహాయకుడు ఉండాలి. కానీ ప్రస్తుతం అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో ఒకే ఏహెచ్ఏడీ, వినాయకపురం, నారాయణపురం లో ఒక్కో వీఏఎస్ మాత్రమే ఉన్నారు. సబ్ సెంటర్ల లో ఒక్కో ఎల్ఎస్ఏ తోనే పని నడుస్తోంది.
పాత భవనాలు – విద్యుత్ లేక చీకటిలో సేవ
పశువైద్య కేంద్రాల భవనాలు 25 ఏళ్ల క్రితం నిర్మించబడ్డ వి. మరమ్మత్తులు చేయకపోవడంతో శిధిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతుండగా, వినాయకపురం పశువైద్య కేంద్రంలో విద్యుత్ సదుపాయం కూడా లేదు. దీంతో సిబ్బంది చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. కనీస మరమ్మత్తులు చేయాలని, అవసరమైన సదుపాయాలు కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు.
మందుల కొరతతో రోగాలు విస్తరణ
గొర్రెలు, మేకలకు నత్తలు నివారణ కోసం గత రెండేళ్లుగా మందులు సరఫరా కాలేదు. దీంతో జీవాలు రోగాల బారిన పడుతున్నాయని పశువైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ జీవన విధానానికి పాడిపరిశ్రమ అవసరం
వ్యవసాయానికి తోడుగా పాడిపరిశ్రమ అభివృద్ధి చెందితేనే గ్రామీణ జీవనవిధానం విరాజిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వాలు పశుసంపద కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.