Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుణ పంపిణీ లక్ష్యాలను సాధించాలి

రుణ పంపిణీ లక్ష్యాలను సాధించాలి

- Advertisement -

జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్
గైర్హాజరైన బ్యాంకర్ల తీరుపై అసహనం వ్యక్తం
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, వచ్చే సీజన్ లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు, రైస్ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు గురించి ఆరా తీశారు. ఈ సమావేశానికి పలువురు బ్యాంకర్లు గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

కీలక సమావేశానికి బ్యాంకర్లు రానప్పుడు, సమావేశం నిర్వహించి ప్రయోజనం ఏమిటని సంబంధిత అధికారులను నిలదీశారు. గైర్హాజర్ అయిన బ్యాంకర్ల గురించి మినిట్స్ బుక్ లో పొందుపరిచి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. ఇకపై జరిగే జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాలకు అన్ని బ్యాంకులకు చెందిన ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల లక్ష్యాన్ని అధిగమించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని అన్నారు. పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని అన్నారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ, వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు.  

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను అర్హత కలిగిన రైస్ మిల్లర్లకు వెంటదివెంట బ్యాంకు గ్యారంటీలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. కొత్త రైస్ మిల్లర్లకు కూడా ప్రాపర్టీ మార్ట్ గేజ్ చేసుకుని బ్యాంక్ గ్యారంటీ అందించాలని అన్నారు. రైతు ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం అయినందున మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ విషయంలో బ్యాంకర్లు చొరవ చుపాలన్నారు.

వ్యవసాయ శాఖతో పాటు డీ.ఆర్.డీ.ఏ, మెప్మా, పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయము చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు. పీ.ఎం స్వనిధి కింద అర్హులైన వారికి రుణాలు అందించాలని, స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సునీల్, డీఆర్డీఓ సాయాగౌడ్, నాబార్డు డీడీఎం ప్రవీణ్ కుమార్, ఆర్బీఐ ఎల్.డీ.ఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -