– 13న సుద్దాల పురస్కారాల ప్రదానోత్సవం
– సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
నవతెలంగాణ – ముషీరాబాద్
పాటలకు ప్రాణమైన తల్లిదండ్రులకు ప్రణామంగా సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితి, జానపద, నృత్య పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో నిర్వహించనున్నట్టు ప్రముఖ సినీ గేయ రచయిత, సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత్రి ఓల్గాకు ప్రముఖ జానపద, సినీ గాయని మధుప్రియకు, ప్రముఖ నర్తకి లాలినిధికి పురస్కారాలు అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి సునంద, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రఘు, సుద్దాల సుధాకర్ తేజ తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. సభ ప్రారంభానికి ముందు నాట్య ప్రదర్శనలు, నృత్య రూపకాలు, చైతన్య కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పారు. తెలంగాణ నేల సాలువాపై పాటలతో విత్తనమైన తన తల్లిదండ్రులు జానకమ్మ-హనుమంతు అని అన్నారు. నాన్న పేరుతో 13 సంవత్సరాలుగా ఇచ్చిన పురస్కారాన్ని, ఈసారి అమ్మ పేరుతో మూడు విభాగాల సాహితీ, జానపద, నృత్య విభాగాల్లో అందజేస్తున్నానని తెలిపారు. పోరాట పాటలకు తన తల్లిదండ్రులు తేనెతీపి నద్ది, ప్రజల గొంతుకగా మారారని అన్నారు. వారి స్ఫూర్తితోనే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞగా కొనసాగిస్తానని, పల్లెపల్లెనా సుద్దాల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు పాటలు ఉద్యమాలకు స్ఫూర్తి అని, గరీబోడు గాయపడితే గండదీపమై వెలిగే జ్వాల అని అన్నారు. వారి కుటుంబం తెలంగాణ సాంస్కృతిక యుద్ధానికి ప్రతీక అని చెప్పారు. జానకమ్మ-హనుమంతుల గానం ప్రజల మస్తిష్కాలను విప్లవ భావాలతో నింపిందని గుర్తు చేశారు. సుద్దాల వంటి యుద్ధకవులను బతికించుకోవాలన్నారు. ఈ ప్రతిభా పురస్కారాలు సుద్దాల గానం నిరంతర ప్రవాహమని అన్నారు. సాహితీ, జానపద, నృత్య ప్రతిభా పురస్కార సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుద్దాల సుధాకర్ తేజ, సుద్దాల నిర్మల, తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
పాటలకు ప్రాణమైన తల్లిదండ్రులకు ప్రణామంగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES