Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్టీలు లేకున్నా.. అక్కడ రిజర్వేషన్‌

ఎస్టీలు లేకున్నా.. అక్కడ రిజర్వేషన్‌

- Advertisement -

పోటీకి అభ్యర్థులు కరువు
ఆ గ్రామాల్లో ఎన్నికలు లేనట్టే
రొటేషన్‌ పద్ధతిలోనే చేశామంటున్న అధికారులు
ఎస్సీ రిజర్వు కాని గ్రామాలు అనేకం


నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఏజెన్సీ ప్రాంతం అంతా ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి వస్తుంది.. ఇక్కడ నాడు మావోయిస్టుల పేరుతో అభివృద్ది జరగలేదు. నేడు ఏజెన్సీ పేరుతో రిజర్వేషన్లను ప్రకటించిన తీరు ఎన్నికలు జరగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీలోని కొన్ని గ్రామాల్లో ఎస్టీలు తప్ప ఇతర సామాజిక తరగతికి చెందిన వారు పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. అమ్రబాద్‌ ఒకటి మినహా మిగిలిన 19 గ్రామపంచాయితీలు ఏజెన్సీలోనే కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎస్టీలు లేకున్నా.. ఏజెన్సీ ఏరియా కావడంతో గిరిజనులకే కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఈ గ్రామాల్లో అభ్యర్థులు లేక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవు. ప్రత్యేక పాలనలో గ్రామాల అభివృద్ది కుంటుపడే అవకాశాలు ఉన్నాయని, వీటి స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

అమ్రబాద్‌ మండలంలోని కల్మలోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్‌నగర్‌ను ఎస్టీలకు కేటాయించారు. ఇక్కడ ఒక ఎస్టీ కూడా లేడు. వీటితో పాటు మైదాన ప్రాంతాల్లో సైతం ఇప్పటి వరకు ఒక సారైనా ఎస్టీగా కేటాయించని గ్రామాలు ఉన్నాయి. రొటేషన్‌ పద్ధతిలో ఈ గ్రామాలకు అవకాశం కల్పించవచ్చు కదా? అని పలువురు సూచిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించే ఐదో షెడ్యూల్‌పై ఎవరికీ అభ్యంతరం లేదు. ఎస్టీలు అధికంగా ఉన్న వాటిని వారికి కేటాయించాల్సిందే. కానీ?ఎస్టీలు లేని గ్రామపంచాయతీలను ఎస్టీలకు కేటాయించి గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 15 ఏండ్లుగా వార్డు మెంబర్లతోనే సరిపెడుతున్నారు.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో నూటికి నూరు శాతం రిజర్వేషన్లు కల్పించరాదనే ఆదేశాలను ఇక్కడ అధికారులు పాటించడం లేదు. బల్మూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో 99శాతం ఎస్టీలు ఉంటే అక్కడ సర్పంచ్‌ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. కొల్లాపూర్‌ మండలం అంబగిరిలో 99శాతం ఎస్టీలు ఉంటే అక్కడా జనరల్‌కు కేటాయించారు. ఇక ఎస్సీ, ఎస్టీలు అత్యధికంగా ఉన్న వంగూరు, బల్మూరు మండల జడ్పీటీసీలను జనరల్‌కు కేటాయించారు. తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు ఎస్సీకి కేటాయించలేదు. బీసీ జనరల్‌ అయ్యింది. అధికారులు చెబుతున్నట్టుగా రొటేషన్‌ పద్ధతి అయితే ఇక్కడ కూడా ఎస్సీలకు రావాలి కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్‌ ఎన్నికల కోసం 2018 నాటి రిజర్వేషన్లను తీసుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.

ఏజెన్సీల్లో కుంటుపడుతున్న అభివృద్ధి
నల్లమల ఏజెన్సీలో మూడు దశాబ్దాల పాటు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తాగునీరు, రోడ్డు సౌకర్యం, ఆవాసాలు ఇలా ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ నల్లమలలో అప్పాపూర్‌, లక్ష్మిపల్లి, సార్లపల్లికి రహదారి వ్యవస్థ లేదు. తాగునీరు లేక చెలిమలు, బుగ్గల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారంటే అభివృద్ధిలో ఎంత వెనకబడి ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల ఎన్నికలు నిలిచిపోతే అభివృద్ధి కుంటుబడుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న చెంచులు, దళితులు, గిరిజనులు, బీసీల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న నిబంధనలను తొలగించి ఎన్నికలు జరపాలని కోరుతున్నారు.

రొటేషన్‌ పద్ధతి వల్ల అలా జరిగింది
99శాతం గిరిజనేతరులు ఉన్న దగ్గర ఎస్టీలకు రావడం జరిగింది. ఇది కేవలం రొటేషన్‌ పద్ధతి వల్లనే జరిగింది. అధికారుల తప్పిదమేమీ లేదు. ముఖ్యంగా అనేక చోట్ల అన్యాయం జరిగిందని కొందరు వాదిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఎంపికలో పారదర్శకత పాటించాం. ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగలేదు.
బాదావత్‌ సంతోష్‌, కలెక్టర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -