నవతెలంగాణ-హైదరాబాద్: గాజా శాంతి ప్రణాళిక మొదటి దశకు ఇజ్రాయిల్- హమాస్‌లు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ప్రకటించారు. రెండు సంవత్సరాల యుద్ధంలో అతిపెద్ద పురోగతి అయిన శాంతి ప్రణాళిక వివరాలను వెల్లడించారు. యుద్ధాన్ని నిలిపివేయడం, కొంత మంది బందీలను, బదులుగా ఖైదీలను విడుదల చేయాలని ట్రంప్ తెలిపారు. గాజాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం మొదటి దశలోభాగంగా.. 2,000 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ 20మంది జీవించి ఉన్న బందీలను మార్పిడి చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందం అమలు అయిన 72 గంటల్లోగా ఈ మార్పిడి ఉంటుందని పేర్కొన్నాయి. 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయిల్ అరెస్ట్ చేసిన జీవిత ఖైదు విధించబడిన 250 మంది పాలస్తీనియన్లను మరియు 1,700మంది ఇతరులకు బదులుగా బందీల విడుదల ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.
గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఈజిప్ట్ అనుబంధ మీడియా అల్ -కహెరా తెలిపింది. గాజాలో ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రణాళిక మొదటి దశపై ఒప్పందం గురువారం నుండి అమల్లోకి రానుదందని మీడియా తెలిపింది.
కేబినెట్ ఆమోదం తర్వాతే గాజా ఒప్పందం అమలు : ఇజ్రాయిల్
గాజాలో బందీలను విడుదల చేసే ఒప్పందం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కార్యాలయం గురువారం తెలిపింది. సాయంత్రం సమయంలో జరిగే కేబినెట్ సమావేశంలో ఒప్పందం ఆమోదించబడిన తర్వాతే 72 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని నెతన్యాహూ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడికి సంబంధించిన గాజా ఒప్పందం మొదటి దశకు ఇజ్రాయిల్ మరియు హమాస్ అంగీకరించాయని ట్రంప్ వెల్లడించిన తర్వాత నెతన్యాహూ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.