నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) 12 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం జెఎంఎం ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ పాండే మీడియాకు వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీగా ఉన్న జెఎంఎం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్ ఇటీవల బీహార్‌లో జరిగిన సమావేశంలో ఇండియా బ్లాక్ నేతలతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. చివరికి 12 స్థానాల్లో జెఎంఎం పోటీ చేయాలనే ఉద్దేశాన్ని ఇండియా బ్లాక్ నేతలకు ఆయన తెలియజేశారు.
అయితే సీట్ల పంపకాల ఒప్పందాలపై ఒకటి లేదా రెండు రోజుల్లో ఖరారు అవుతుంది’ అని పాండే అన్నారు. బీహార్ – జార్ఖండ్ సరిహద్దు జిల్లాలైన తారాపూర్, కటోరియా, మణిహరి, ఝాఝా, పిర్‌పైంటి, ఠాకూర్‌గంజ్, బంకా, రూపాలి, చకై, జమాల్‌పూర్, బన్‌మంఖి, రాంనగర్ స్థానాల్లో జెఎంఎం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని పాండే తెలిపారు.
కాగా, బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో 243 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఎన్నికల లెక్కింపు జరగనుంది.