తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్‌కోటి 350 మంది అనుచరులతో కలిసి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాగృతి అంటేనే పోరాటాల జెండా అని చెప్పారు. అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని తెలిపారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు కేసీఆర్ కిట్‌తో పాటు ఆర్థిక సాయం అందించేవారనీ,. కాంగ్రెస్ వచ్చాక అది బంద్ అయ్యిందని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఇస్తామన్న తులం బంగారం ఇవ్వడం లేదనీ, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు.