రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ధాన్యం దిగుబడిలో తెలంగాణా రాష్ట్రం అరుదైన రికార్డు నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ల సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతాంగ అనుకూల విధానాలతోటే ఇది సాధ్యపడిందని ఆయన స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ధాన్యం దిగుబడి లో అత్యధికంగా 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తెలంగాణా నిలబడిందని, తాము అధికారంలోకి వచ్చాక సాగు అయిన మూడు పంటలలో ఒక పంట మరో పంటతో పోటీ పడుతూ మూడు పంటలలోను ధాన్యం దిగుబడి లో రికార్డు సృష్టించిందన్నారు. ఈ వానాకాలంలో 148.3 లక్షల దిగుబడి అందుకు తార్కాణమన్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆయన చెప్పారు.22 వేల నుండి 23 వేల కోట్ల వ్యయంతో ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు.
దిగుబడి అయిన మొత్తంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించిందని,అందులో 40 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకాలు ఉన్నాయన్నారు . ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. అందులో కామారెడ్డి, నిజమాబాద్, మెదక్,సిద్దిపేట, నల్లగొండ జిల్లా కేంద్రాలలో ఇప్పటికే 1205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనకై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పై ఈ నెల 16 న హైదరాబాద్ లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులకు పంపించామన్నారు.అక్టోబరు 1 న ప్రారంభంఅయిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జనవరి రెండో వారంలో పూర్తి అవుతాయన్నారు.యాదాద్రి భోనగిరి జిల్లాలో కొనుగోళ్ల అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ రెండు లక్షల 83 వేల 18 ఎకరాల విస్తీర్ణంలో జరిగిన సాగులో 7.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్,శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మందుల సామెల్,పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లు పాల్గొన్నారు.