Sunday, October 12, 2025
E-PAPER
Homeసమీక్షజాతీయ భావాన్ని ప్రస్పుటించే 'చక్‌ దే'

జాతీయ భావాన్ని ప్రస్పుటించే ‘చక్‌ దే’

- Advertisement -

భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి తెలిపిన ఒక అద్భుత హిందీ మూవీ ‘చక్‌ దే! ఇండియా’. ‘హాకీ’ జాతీయ క్రీడగానే పరిగణింప బడుతోంది. అటువంటి క్రీడ గురించిన అరుదైన చిత్రం ‘చక్‌ దే! ఇండియా’. 2007లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా బాక్సాఫీస్‌లో వసూళ్ల సునామీని సష్టించింది. షిమిత్‌ అమీన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం 10 ఆగస్టు 2007 న విడుదల అయింది. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో శిల్పా శుక్లా, విద్యా మాల్యాడే వంటి అంతగా ప్రసిద్ధి చెందని తారలు నటించారు.

అమ్మాయిలు కలిసికట్టుగా ఆడితే ఏదయినా సాధ్యమే అని నిరూపించి, జీవితం విసిరే ప్రతి సవాల్‌ను స్వీకరించి, ఎదుర్కోవడం ద్వారా విజయవంతమైన టీమ్‌ ఇండియాను తయారు చేయటానికి కోచ్‌ చేసే పోరాటం ప్రేక్షకులను బాగా టచ్‌ చేస్తుంది. ట్రోఫీని అందుకునేటప్పుడు కనిపించే ఆ విజయ గర్వాన్ని, దేశం మొత్తం జేజేలు పలికేప్పుడు వారు పొందే ఆనంద క్షణాలకు విలువ కట్టలేం.
అమ్మాయిల్లో గ్లామర్‌ లేకపోయినా కూడా, హావభావ విన్యాసాల ద్వారా ప్రేక్షకులను తమతో తీసుకు వెళ్తారు.
‘చక్‌ దే! ఇండియా’ బయోపిక్‌ కాదు. అయినా, 2002 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళా జాతీయ జట్టు సాధించిన అద్వితీయ విజయం నుండి ప్రేరణ పొందింది. పాత్రలు కల్పితం అని పేర్కొన్నా కూడా ఈ చిత్రంలో హీరో షారుక్‌ఖాన్‌ పోషించిన కబీర్‌ ఖాన్‌ పాత్ర భారతదేశానికి హాకీక్రీడలో చిరస్మరణీయ విజయాన్ని అందించిన కోచ్‌ ‘మీర్‌ రంజన్‌ నేగి’ని పోలి ఉందని నిర్విదాంశంగా చెప్పవచ్చు. ‘నేగి’ కూడా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలను ఎదుర్కొన్నాడు. హాకీ సన్నివేశాలు ప్రేక్షకులను రెప్ప కొట్టనీయకుండా ఉత్తేజ పరుస్తాయి.
అసలు కథ విషయానికి వస్తే క్లుప్తంగా.. భారత, పాక్‌ హాకీ ప్రపంచ కప్‌ ఫైనల్లో విజయానికి అవసరం అయిన చివరి గోల్‌ను రెప్పపాటులో జార విడుచుకున్న భారత్‌ టీమ్‌ ఓటమి పాలవుతుంది. ఓటమిని స్పోర్టివ్‌గా తీసుకున్న భారత హాకీ కెప్టెన్‌ కబీర్‌ ఖాన్‌, పాక్‌ కెప్టెన్‌ను ఆలింగనం చేసుకుంటాడు. అది అతను అభినందన పూర్వకంగా చేసిన చర్య. అయితే, దానిని నమ్మక ద్రోహంగా, మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా పరిగణింప బడటంతో కబీర్‌ ఖాన్‌, తన తల్లితో ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతాడు.
అయితే సుమారు ఏడు సంవత్సరాల అనంతరం భారత మహిళల జాతీయ ఫీల్డ్‌ హాకీజట్టు కోచ్‌గా అతనికి అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకున్న అతను టీమ్‌ను ఒక గాడిలో పెట్టడానికి చాలా ప్రయాస పడతాడు. మహిళా యువ క్రీడాకారిణుల మధ్య అనేక రకాల స్పర్ధలు, అభిజాత్యం, ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితులు అతడిని కలవర పెడతాయి. వారి మధ్య సఖ్యత కుదిర్చి, ఐక్యంగా ఉంటేనే విజయం సాధించగలమనే పట్టుదలను వారిలో రేకెత్తిస్తాడు. ఎంతో మెలో డ్రామా నడుస్తుంది చిత్రం యావత్తూ. చివరిలో ఆస్ట్రేలియాతో భారత్‌కు జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 3-2 తో భారత యువ హాకీ క్రీడాకారిణులు ట్రోఫీని సాధిస్తారు. ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభిస్తుంది. గెలుపు గీత తొక్కడంలో ఉన్న గొప్పతనాన్ని అందరూ ఆస్వాదిస్తారు. ఇదీ ఈ చిత్ర కథ. క్రీడాస్పూర్తి ఉంటే విజయం అందుకోవడం దుర్లభం కాదని ఈ చిత్రం విశద పరుస్తుంది.
చక్‌ దే! ఇండియా’ తెర హీరో షారుక్‌ఖాన్‌ అత్యద్భుత నటన అందించాడు. ఎంతో గంభీరంగా ఉండి అభిమానుల్ని అలరించాడు. షారుక్‌ఖాన్‌ తాను విద్యను అభ్యసించే సమయంలో హాకీని ఆడేవాడు. అందుకే ఈ చిత్రంలోని పాత్రలో పరకాయ ప్రవేశాన్ని అతి సులువుగా చేశాడు.
సొంత ఎజెండాతో కాకుండా దేశం కోసం ఆడాలని అమ్మాయిలకి తెలియచేయటం, ప్రేమతో ఆడిన అమ్మాయిలు దేశానికి కీర్తి తెచ్చేలా మోటివేట్‌ చేయటం, హాకీ స్టిక్‌ ఎలా పట్టుకోవాలి, బంతిపై ఎలా దష్టి పెట్టాలి వంటివి వివరించే సన్నివేశాల్లో షారుక్‌ ఖాన్‌ నటన అద్భుతమే! నిజానికి ఇటువంటి సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగిస్తాయి. ఈ చిత్రంలో నటించిన పదహారు మంది క్రీడాకారిణుల పాత్రల ఎంపికకు ఆరు నెలల సమయం పట్టింది. మ్యాచ్‌ సన్నివేశాలను అంతర్జాతీయ స్టేడియాల్లో చిత్రీకరించారు.
ముందుగా ఈ చిత్రంలో హీరో పాత్రకు సల్మాన్‌ఖాన్‌ అని అనుకున్నారు. అయితే, దర్శకునితో విబేధాల కారణంగా అతను తప్పుకున్నాడు. అయితే, షారుక్‌ఖాన్‌ను ఎంపిక చేసినా కూడా అతను ముందుగా తిరస్కరించి, తర్వాత ఆమోదించాడు. గతంలో షారుక్‌ నటించిన పాత్రల స్టైల్‌కు ఈ చిత్రం విభిన్నంగా ఉంటుంది.
55వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ కలిగిన చిత్రంగా నిలిచింది. భారతీయ సినిమాల్లో క్రీడల నేపథ్యంలో చిత్రీకరించిన మంచి సినిమా ఇది. మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ చిత్రం క్రీడలలో లింగ సమానత్వాన్ని చాటి చెపుతుంది. అబ్‌ తక్‌ చప్పన్‌ తర్వాత దర్శకుని రెండవ చిత్రం ఇది.
టైటిల్‌ ట్రాక్‌ ‘చక్‌ దే! ఇండియా’ విస్తత ప్రజాదరణ పొందింది. భారత దేశంలోని క్రీడా కార్యక్రమాల్లో అనధికార గీతంగా మారింది.
17 ఆగస్టు 2016 న స్వాతంత్య్ర దినోత్సవ చలన చిత్రోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీ లో ‘చక్‌ దే! ఇండియా’ ను ప్రదర్శించారు.
బాలీవుడ్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అత్యంత ఉద్వేగభరిత చిత్రాల్లో ఇది ఒకటి. అరుదైన మరో గొప్పతనం ఈ చిత్రం గర్ల్‌ పవర్‌ ను చూపెట్టింది. భారత దేశంలో క్రికెట్‌ కున్న జనాదరణ హాకీ క్రీడకు లేకపోయినా, ఈ చిత్రం తర్వాత హాకీ విశిష్టత తెలిసింది. ప్రతి సన్నివేశం విలువైనది. అందుకే ఆద్యంతమూ ఈ చిత్రంలో లీనం అవుతాడు ప్రేక్షకుడు.

  • పంతంగి
    శ్రీనివాస రావు,
    9182203351
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -