యూఎస్‌లో పెరిగిన నిరుద్యోగ రేటు
– నాలుగేండ్ల గరిష్టానికి చేరిక
– జులైలో 4.3 శాతానికి ఎగబాకిన వైనం
– దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
– ట్రంప్ విధానాలే కారణం : ఆర్థిక నిపుణులు
వాషింగ్టన్ : ట్రంప్ విధానాల ఎఫెక్ట్ అమెరికా మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నది. అక్కడ ఆగస్టులో ఉద్యోగ వృద్ధి గణనీయ స్థాయిలో బలహీనపడింది. నిరుద్యోగ రేటు దాదాపు నాలుగేండ్ల గరిష్టానికి చేరుకున్నది. ఇది జులైలో 4.3 శాతంగా నమోదైంది. లేబర్ మార్కెట్ బలహీనంగా మారిందనీ, దీంతో వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించే పరిస్థితి ఫెడరల్ రిజర్వ్‌కు ఏర్పడిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగున్నరేండ్లలో తొలిసారిగా జూన్‌లో ఉద్యోగాలను కోల్పోయిందని లేబర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ నివేదిక వివరించింది. ఈ పరిస్థితి దేశంలో ఆర్థిక స్తబ్దతకు దారి తీయొచ్చనే భయాలను రేకెత్తిస్తున్నది.
ఏప్రిల్ నుంచి ఉద్యోగవృద్ధిలో మందగమనం
అమెరికాలో ఉద్యోగ వృద్ధి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మందగించింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు, వలసదారులపై అణచివేత చర్యలు, పబ్లిక్ వర్కర్లపై కాల్పులు వంటి కారణాలు ఈ పరిస్థితులకు దారి తీశాయని వారు చెప్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచుకు తీసుకెళ్తున్నదని ఎఫ్‌డబ్ల్యూడీబాండ్స్ ముఖ్య ఆర్థికవేత్త క్రిస్టోఫర్ రూప్కే అన్నారు. కంపెనీలు నియామకాలు జరపటంలేవనీ, ఇందుకు వాషింగ్టన్ (ట్రంప్) ఆర్థిక ఎజెండా కారణమని అన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించే ఒకే ఒక్క ఔషధం ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించటమేనని తెలిపారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్‌ఎస్) విభాగం ప్రకారం.. జులైలో వ్యవసాయేతర ఉద్యోగాలు (పేరోల్స్) 79వేలు పెరగాయి. గతనెలలో ఇది 22వేలుగా మాత్రమే నమోదు కావటం గమనార్హం. అయితే గతంలో నిర్వహించిన ఓ సర్వేలో ఆర్థికవేత్తలు పేరోల్స్ పెరుగుదల 75వేల వరకు ఉంటుందని చెప్పగా.. అది 22వేల వరకే నమోదు కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. జూన్‌లో పేరోల్స్ 13వేలు తగ్గాయి. డిసెంబర్, 2020 తర్వాత ఉద్యోగాలు ఈ విధంగా పడిపోవటం ఇదే తొలిసారి. కాగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ వృద్ధి లేకపోవటంతో బీఎల్‌ఎస్ కమిషనర్ ఎరికా మెక్‌ఎంటార్‌ఫెర్‌కు ట్రంప్ ఉద్వాసన పలికారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె మానిప్యులేట్ చేస్తోందని ట్రంప్ ఆమెపై ఆరోపణలు గుప్పించారు. అయితే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటంలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఎంప్లాయిమెంట్ రిపోర్ట్‌పై నేరుగా స్పందించని ట్రంప్.. ఎప్పటిలాగే అధిక రుణ వ్యయాల విషయంలో ఫెడ్ చైర్మెన్ జెరోమ్ పావెల్‌పై తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. పావెల్ చాలా కాలం క్రితమే రేట్లను తగ్గించి ఉండాల్సిందనీ, ఎప్పటిలాగే ఆయన చాలా ఆలస్యం చేశాడని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. పలు దేశాలపై టారిఫ్ వార్‌కు దిగిన ట్రంప్ విధానాలతో దేశ సగటు టారిఫ్ రేటు 1934 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నది. అయితే ఇది అధిక ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తించిందని నిపుణులు చెప్తున్నారు. కాగా సవరించిన డేటా ద్వారా ఆగస్టులో ఉద్యోగాల సంఖ్యను ఎక్కువగా చేసి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయినప్పటికీ అమెరికాలో ఉద్యోగ వృద్ధి గణనీయంగా తగ్గిందని అంటున్నారు. గతమూడు నెలల్లో సగటున నెలకు 29వేల ఉద్యోగాల చొప్పున నమోదు కాగా.. ఇది గతేడాది ఇదే సమయానికి 82వేలుగా ఉన్నదని వారు గుర్తు చేస్తున్నారు.