ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ప్రభావం ఆ రోజుంతా మనం చేసే పనిపై ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఉదయం హడావుడిలో ఏదో ఒకటి తిన్నామా ఆఫీస్‌కి పోయామా అన్నట్టు గడిపేస్తుంటారు. అలాకాకుండా మంచి అల్పాహారం తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, పిల్లలకే కాదు మీ కోసం కూడా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవాలి. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు మీకోసం…
పాలక్ పెసరట్టు
కావాల్సిన పదార్థాలు: ముప్పావు కప్పు – పెసర్లు, మూడు టేబుల్‌స్పూన్లు – బియ్యం, గుప్పెడు – కొత్తిమీర, పెద్ద కట్ట పాలకూర – ఒకటి, కొద్దిగా – కరివేపాకు, రెండు అంగుళాల ముక్క – అల్లం, టీస్పూన్ – జీలకర్ర(ఆప్షనల్), మూడు – పచ్చిమిర్చి, రుచికి తగినంత – ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు – కొద్దిగా, నూనె లేదా నెయ్యి – కొద్దిగా.
తయారీ విధానం: ప్రొటీన్స్ పుష్కలంగా ఉండే పాలక్ పెసరట్టు కోసం ముందుగా ఒక బౌల్‌లో పెసర్లు, బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. అందులో తగినన్ని నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసర్లు, బియ్యం, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టి కొద్దిగా నీళ్లను చిలకరించుకొని పాన్‌ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. ఆపై పెసరట్టు మీద కొద్దిగా ఉల్లి తరుగు వేసి చేతితో కాస్త ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకొని చక్కగా కాలనివ్వాలి. రెండో వైపునకు తిప్పి ఉల్లిగడ్డ తరుగు కాస్త మెత్తబడే వరకు కాల్చుకోవాలి. చక్కగా కాలిందనుకున్నాక సర్వ్ చేసుకుంటే చాలు. ఈ దోశను అల్లం చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
గోధుమ ఇడ్లీలు
కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ – కప్పు, నెయ్యి – టేబుల్‌స్పూను, ఆవాలు – అర టీస్పూను, శనగపప్పు – టీస్పూను, మినప్పప్పు – టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, జీడిపప్పు పలుకులు – పది, ఇంగువ – చిటికెడు, ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు, అల్లం తరుగు – టేబుల్ స్పూను, పచ్చిమిర్చి – రెండు, కరివేపాకు – కొద్దిగా, క్యారెట్ తురుము – టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు – కొద్దిగా, పెరుగు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీరు – ముప్పావు కప్పు, బేకింగ్ సోడా – అర టీస్పూను.
తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి గోధుమ రవ్వ వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఇంగువ వేసి ఎర్రగా వేయించుకోవాలి. తాలింపు మిశ్రమం బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము వేసి మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి గోధుమ రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు అందులోకే కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. అనంతరం కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. రవ్వ నానిన తర్వాత బేకింగ్ సోడా, మరో పావు కప్పు నీళ్లు పోసి కలుపుకుంటే ఇడ్లీలు వేసుకునేందుకు పిండి రెడీ అయినట్లే.
స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి తగినన్ని నీళ్లు పోసుకుని మరిగించాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్ మీద తడిపిన కాటన్ క్లాత్ వేసుకుని గోధుమ రవ్వను వేసుకోవాలి. ఈ ప్లేట్స్‌ను ఇడ్లీ పాత్రలో ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఓ రెండు నిమిషాల తర్వాత ప్లేట్‌లోకి వేసి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
గంగాళం ఉప్మా
కావాల్సిన పదార్థాలు: నెయ్యి – టేబుల్ స్పూను, జీడిపప్పులు – గుప్పెడు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – అర టీస్పూను, జీలకర్ర- అర టీస్పూను, శనగపప్పు- అర టీస్పూను, మినపప్పు – అర టీస్పూను, ఎండుమిర్చి – రెండు, పచ్చిమిర్చి – రెండు, అల్లం తరుగు – కొద్దిగా, ఉల్లిగడ్డ – ఒకటి, కరివేపాకు – రెండు రెమ్మలు, బియ్యం రవ్వ – కప్పు, నీళ్లు – ఆరు కప్పులు, ఉప్పు – రుచికి తగినంత, కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, కొత్తిమీర, ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత అందులోకి జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లోకి నూనె వేసి పల్లీలు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శగనపప్పు వేసి వేయించాలి. పల్లీలు, తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి మరో నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. ఇక్కడ ఉల్లిగడ్డను మరీ ఫ్రై అయ్యేటట్లు వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత కరివేపాకు తరుగు వేసి ఫ్రై చేసిన ఆరు కప్పుల నీరు పోసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మంటను సిమ్‌లో పెట్టి బియ్యం రవ్వను కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. రవ్వ ఉడుకుతున్నప్పుడు మంటను తగ్గించి మూత పెట్టి పూర్తిగా ఉడికించాలి. రవ్వ ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు, కొద్దిగా నెయ్యి, ఫ్రై చేసిన జీడిపప్పులు వేసి కలిపి దింపేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన గంగాళం ఉప్మా రెడీ.
ఎగ్ కారం దోశ
కావాల్సిన పదార్థాలు: కప్పు – మినపపప్పు, రెండున్నర కప్పులు – బియ్యం, అరకప్పు – అటుకులు, టీ స్పూను – మెంతులు, మూడు టీ స్పూన్లు – నూనె, అర టీ స్పూను – ఆవాలు, అర టీ స్పూను – జీలకర్ర, గుడ్డు – ఒకటి, టీ స్పూను – నెయ్యి, చిటికెడు – ఉప్పు, చిటికెడు – మిరియాల పొడి, కొద్దిగా – ఉల్లిగడ్డ తరుగు, కొద్దిగా – కొత్తిమీర.
స్పైసీ గార్లిక్ చట్నీ కోసం: ఎండుమిర్చి – ఇరవై, వెల్లుల్లి రెబ్బలు – పన్నెండు, చిన్న ఉల్లిగడ్డ – 15, కల్లుప్పు – టీ స్పూను, చింతపండు – ఉసిరికాయంత.
తయారు చేసే విధానం: ముందుగా మినపపప్పు, బియ్యం, అటుకులు, మెంతులు అన్నింటిని ఒకసారి శుభ్రంగా కడిగి, వేర్వేరు గిన్నెల్లో విడివిడిగా సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటన్నింటిలోని నీటిని వడకట్టుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి కనీసం 12 గంటలపాటు పులియబెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. మరోవైపు స్పైసీ గార్లిక్ చట్నీ కోసం మిక్సీ జార్‌లో ఎర్రమిర్చి, వెల్లుల్లి, చిన్న ఉల్లిగడ్డలు, కల్లుప్పు, చింతపండు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. స్టౌ పైన పెనం పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న దోశ పిండిని వేసి అంచుల్లో నెయ్యి వేయాలి. ఆ తర్వాత దోశపై ముందుగా రెడీ చేసుకున్న స్పైసీ గార్లిక్ చట్నీని వేసి, ఓ గుడ్డును కొట్టి చుట్టూరా కలపాలి. అలాగే ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, నెయ్యి వేసి దోశను కాల్చాలి. దోశ ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు కూడా వేయిస్తే టేస్టీ ఎగ్ దోశ రెడీ.