Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిజ్ఞాన వినియోగంతో ఉజ్వల భవిష్యత్‌ పొందాలి

విజ్ఞాన వినియోగంతో ఉజ్వల భవిష్యత్‌ పొందాలి

- Advertisement -

నూతన పరిశోధనలకు
‘కావేరి’ దేశంలోనే ఆదర్శం కావాలి
పరిశోధనా ఫలాలు రైతులకు చేరువ చేయాలి : గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
సిద్దిపేట జిల్లాలోని కావేరి యూనివర్సిటీలో
ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం
నవతెలంగాణ-మర్కుక్‌

జాతీయ ప్రమాణాలతో కూడిన కావేరి విత్తన పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం పాములపర్తి శివారులోని కావేరి విత్తన పరిశోధనా కేంద్రం, వర్గల్‌ మండలం గౌరారం లోని కావేరి విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం గవర్నర్‌ పర్యటించారు. విశ్వవిద్యాలయం సాధించిన పురోగతి, క్షేత్రస్థాయి పరిశోధనలు, అధునాతన వసతులు, ఎంటమాలజీ, పాథాలజీ, బ్రీడింగ్‌, ఫిజియోలజీ ల్యాబ్స్‌ తదితరులను పరిశీలించారు. అలాగే, విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల డ్రోన్‌ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్‌, ఏఆర్‌ అండ్‌ వీఆర్‌ మోడల్స్‌, అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్స్‌ను తిలకించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి వాటి పరిశోధనా ఫలాలను రైతులకు చేరువ చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పరిశోధనా విద్యార్థులు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను పొంది మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. నూతన సాంకేతికతతో అద్భుత వంగడాలు, ఆహార సంపద సృష్టించి దేశ పునర్నిర్మాణంలో కావేరి విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి ఉజ్వల భవిష్యత్తును అందిపుచ్చుకోవాలని తెలిపారు.
టెక్నాలజీ అభివృద్ధితో నిరంతర ఆవిష్కరణలు జరగాలని, దైనందిన జీవితంలో డ్రోన్‌ టెక్నాలజీ ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. అంతేగాకుండా పర్యావరణానికి హాని జరగకుండా సహజ సిద్ధంగా లభించే సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరిగి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను సాధించాలని తెలిపారు. చాన్సలర్‌ జీవీ భాస్కర్‌ రావు, వైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. కావేరి యూనివర్సిటీ అద్భుత పరిశోధనలతో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని హామీ ఇచ్చారు. కావేరి సీడ్స్‌ కంపెనీతో సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగానికి మనోబలం కలిగిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హైమావతి, పోలీస్‌ కమిషనర్‌ విజరు కుమార్‌, ఏసీపీ నర్సింలు, ఆర్డీవో చంద్రకళ, సీఐ మహేందర్‌ రెడ్డి, తహసీల్దార్లు సరిత, రఘువీరా రెడ్డి, కావేరి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ శ్రీనివాసులు, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ హర్ష పొలసాని, అగ్రికల్చరల్‌ డీన్‌ ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, ఇంజనీరింగ్‌ డీన్‌ డాక్టర్‌ కొండా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -