గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం హర్షణీయం : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బడ్జెటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ బడ్జెట్ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో రూపుదిద్దుకున్నదిగా పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని అభివర్ణించారు. గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా నిలిచే పంచాయతీరాజ్ శాఖకు అత్యధిక కేటాయింపులు చేయడం ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, 2 లక్షల కొత్త ఫించన్ల మంజూరు నిర్ణయం హర్షణీయమని తెలిపారు. దీని ద్వారా వద్ధులు, వికలాంగులు, విధవలు వంటి బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు భద్రత కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని సీతక్క అన్నారు. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ బడ్జెట్ కీలకంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.



