Monday, January 5, 2026
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ పేలిన తూటా

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ పేలిన తూటా

- Advertisement -

రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి
సుక్మాలో 12 మంది, బీజాపూర్‌లో ఇద్దరు..భారీగా ఆయుధాలు స్వాధీనం

నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌ అడవులు మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లాయి. సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లోని పచ్చని అడవులు రక్తమోడాయి. రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాల నుంచి భారీగా ఆయుధాలు లభించాయి. ఈ ఏడాదిలో జరిగిన మొదటి భారీ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ ఇదేనని అధికారులు చెప్పారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్‌లోని బసగూడ-తర్రెం అటవీ ప్రాంతం, సుక్మాలోని కొంతా-కిష్టారమ్‌ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారం నిఘా వర్గాల ద్వారా అందింది. అనంతరం జిల్లా రిజర్వ్‌ గార్డు (డీఆర్‌జీ) బృందాలు శనివారం ఉదయం వేర్వేరుగా తమ పరిధిలోని ప్రాంతాల్లో సోదాలు జరిపాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి 12 మంది మావోయిస్టు మృతదేహాలను, బీజాపూర్‌ నుంచి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్‌ ఐజీ సుందర్రాయ్ పట్టిలింగం చెప్పారు. ఘటన ప్రదేశాల నుంచి ఒక ఏకే-47, ఇన్సాస్‌ రైఫిల్‌, సెల్ఫ్‌-లోడింగ్‌ రైఫిల్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.ఎన్‌కౌంటర్‌ జరిగిన రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆపరేషన్‌ వివరాలను మాత్రం వెల్లడించలేదు. పూర్తి వివరాలను ఆపరేషన్‌ ముగిశాక చెప్తామని వివరించారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బందికి ఏమైనా గాయాలయ్యాయా అన్నదానిపై ఎలాంటి సమాచారమూ లేదు. దీని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

256 మంది మావోయిస్టులు మృతి..1650 మంది లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో సుక్మా, బీజాపూర్‌ జిల్లాలు అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ఒకప్పుడు వీటిని మావోయిస్టులకు కంచుకోటగా పిలిచేవారు. ఇప్పుడు అవే జిల్లాల్లో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోవడం, మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోతుండటం గత కొన్ని నెలలుగా జరుగుతున్నది. ముఖ్యంగా 2025లో బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులకు పెద్ద దెబ్బే తగిలిందని అధికారులు అంటున్నారు. ఇక్కడ దాదాపు 256 మంది మావోయిస్టులు మృతిచెందగా, దాదాపు 1650 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని వారు గుర్తు చేస్తున్నారు. దేశంలో మావోయిస్టులను లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయించుకున్నది. ఇందుకోసం ఈ ఏడాది మార్చి 31ని డెడ్‌లైన్‌గా నిర్దేశించుకున్నది. కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా పలు సందర్భాలలో పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ఆపరేషన్‌ కగార్‌తో అడవులను జల్లెడపడుతూ మావోయిస్టులను మట్టుబెడుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -