కుల, మతాంతర వివాహితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి
అలాంటి వివాహాలు చేసుకునే వారికి అండగా ఉంటాం
చయాన్-2025 జాతీయ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి
కులాంతర వివాహితులపై దాడి రాజ్యాంగ విరుద్ధం : హైకోర్టు జడ్జి(రిటైర్డ్) రాధారాణి
కులాలను బట్టి గౌరవించే రోజులు పోవాలి : జడ్జి (రిటైర్డ్) రజిని
వన భోజనాలు..కుల భోజనాలుగా మారడం ఆందోళనకరం : విమలక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన దేశంలో కుల రహిత సమాజం రావాలనీ, ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచే ఉద్యమాలకు, పోరాటాలకు తమ పార్టీ ఎల్లప్ఫుడూ అండగా ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హామీనిచ్చారు. కుల, మతాంతర వివాహాలు చేసుకునే వారి కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలనీ, వారికి రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 20కిపైగా సంఘాలు, సంస్థల భాగస్వామ్యంతో కూడిన ‘చయాన్-2025’ జాతీయ సభను కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు ఎమ్.డీ. జావిద్, ప్రధాన కార్యదర్శి డీ.ఎల్.కృష్ణ చంద్ అధ్యక్షతన రెండు సెషన్లలో నిర్వహించారు. సభకు ముందు ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి ఎస్‌వీకే వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ..కులాన్ని బట్టి మనుషులను గౌరవించే ధోరణి సమాజంలో ఇంకా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
మనుధర్మం కొనసాగాలనీ, కుల వ్యవస్థ బలపడాలని కోరుకునే వారు నేడు కేంద్రంలో పాలకులుగా ఉన్నారనీ, వారు వచ్చాక దాడులు మరింత తీవ్రం అయ్యాయని చెప్పారు. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు, గౌరవం వంటివి కల్పించినప్పటికీ ఆచరణలో వాటిని అమలు కాకుండా పాలకులు చూస్తున్నారని విమర్శించారు. కులాంతర వివాహాలు చేసుకునే వారిపై దాడులు జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వివాహాలు చేసుకునేవారికి సీపీఐ(ఎం)గా రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు. హైకోర్టు జడ్జి(రిటైర్డ్) రాధారాణి మాట్లాడుతూ..జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందనీ, రాజ్యాంగం సమానత్వ, జీవించే హక్కులను ప్రసాదించిన విషయాన్ని గుర్తుచేశారు. కులాంతర వివాహితులకు అనుకూలంగా వచ్చిన పలు కోర్టు తీర్పులను ప్రస్తావించారు. అలాంటి వివాహాలు చేసుకునేవారిపై సొంతింటి వారి నుంచీ, సమాజం నుంచీ దాడులు ఎదురుకావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావిధానం, మీడియా పాత్ర మారాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
జస్టిస్(రిటైర్డ్) రజిని మాట్లాడుతూ.. మనుధర్మం సమానత్వాన్ని నిషేధించిందనీ, ఎక్కువ మంది దాని ప్రభావానికి లోనై కులాంతర వివాహాలు చేసుకునే వారిపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కులాలను బట్టి కాకుండా గుణాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించే రోజులు రావాలని ఆకాంక్షించారు. పిల్లల్లో చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ భావజాలాన్ని జొప్పించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షులు విమలక్క మాట్లాడుతూ..వనభోజనాలు కాస్త నేడు కుల భోజనాలుగా మారడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన బతుకమ్మ ద్వారా కులవ్యవస్థపై చేస్తున్న పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా ‘ప్రేమ కరువాయే’ సాంగ్‌ను ఆవిష్కరించి పాడారు. కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు టి. స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ…భారతీయ సమాజం కులాల దుర్గంధంలో కూరుకుపోయిందని విమర్శించారు.
కులాంతర వివాహాలు చేసుకునే జంటల్లో ఒకరికి కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ఉద్యోగం ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కుల, మతాంతర వివాహాలు చేసుకునే వారిని ఆదర్శ భారతీయులుగా గుర్తించి వారికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. కులం, మతం పేరును అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగే వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్‌ఎన్‌ఎస్ జాతీయ అధ్యక్షులు బైరి నరేశ్ మాట్లాడుతూ..మనుధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేవారు ప్రతి చిన్న విషయాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనీ, అదే మెరుగైన సమాజం కోరుకునేవారిలో మాత్రం ఐక్యత లోపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. మార్క్స్, అంబేద్కర్‌లను చదివితే మన దేశంలో సామాజిక, ఆర్థిక ఐక్య పోరాటాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది అర్థమవుతుందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సరైనరీతిలో వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆచరణకు నోచుకోని చట్టాలు ఎన్ని ఉన్నా వృథానే అని అభిప్రాయపడ్డారు.
కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు ఎమ్‌డీ. జావిద్ మాట్లాడుతూ..ఒకప్పుడు ఉత్తర భారతంలో కుల దురంహకార దాడులు ఎక్కువగా ఉండేవనీ, ఇటీవల తెలంగాణలో కూడా 140 కుల దురంహకార హత్యలు జరగడం ఆందోళనకరమని చెప్పారు. కొన్ని సంఘాలు, సంస్థల కలయిక ‘చయాన్’ ను ఏర్పాటు చేసి కుల దురంహకార దాడులకు గురైన బాధితుల పక్షాన పోరాడుతున్నామన్నారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారిపై దాడులు చేయడాన్ని, చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాంటి వివాహాలు చేసుకునే వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇండియా లవ్ ప్రాజెక్టు నిర్వాహకులు ప్రియా రమణి అధ్యక్షతన రైట్ టూ చాయిస్ అనే అంశంపైనా, సీనియర్ జర్నలిస్టు కె.సజయ అధ్యక్షతన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ అంశంపైనా చర్చా వేదికలు నిర్వహించారు. ఈ సభలో కుల నిర్మూలన సంఘం గౌరవాధ్యక్షులు గుత్తా జ్యోత్స్న, జేవీవీ జాతీయ అధ్యక్షులు ఎన్.స్వరాజ్య లక్ష్మి, ఎమ్‌వీవీ జాతీయ సంయుక్త కార్యదర్శి డి.హనుమంతరావు, ధనక్ కో-పౌండర్ అసిఫ్ ఇక్బాల్, ఎమ్‌ఎస్‌ఎమ్ అధ్యక్షులు షంషుద్దీన్ తంబోలి, విశాఖ ఆర్గనైజేషన్ నిర్వాహకులు మీనా, మాధవ భార్గరే, పాల్గొన్నారు.



