హైదరాబాదులో సినిమా పరిశ్రమ 125 సంవత్సరాల క్రితమే వేళ్ళూనుకుని సైలెంట్ చిత్రాల కాలంలోనే తనదైన ముద్రతో ఉనికిని నిలుపుకున్నది. 1896 లోనే సైలెంట్ చిత్రాల ప్రదర్శనకు హైదరాబాదు నగరం వేదిక అయింది. ఈ లెక్కన సైలెంట్ సినిమాల కాలంలో బొంబాయి, మద్రాసు నగరాలతో సమాంతరంగా హైదరాబాదుకు చరిత్ర ఉన్నది.
అందరూ చెప్పుకుంటున్నట్లుగా మద్రాసులో తెలుగువాడు రఘుపతి వెంకయ్య 1910లో తొలిసారి సైలెంట్ సినిమాలు ప్రదర్శిస్తే, అంతకు రెండేళ్ల మునుపే అంటే 1908లోనే ఖమ్మం, నిజామాబాద్ నగరాలలో బాబు పి.ఎస్. అనే ఒక సంచార సినీ ప్రదర్శకుడు సైలెంట్ సినిమాలను తన బయోస్కోప్ ఫిలిం కంపెనీ ద్వారా ప్రదర్శించారు. అదే సంవత్సరం 1908లోనే మూసి వరదల చిత్రీకరణ కావచ్చు, ఆ తర్వాత రెండేళ్లకు 1910 లో కల్నల్ విలియమ్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో తన 8 ఎం. ఎం.,16 ఎం.ఎం. ప్రొజెక్టర్లతో సినిమాలు ప్రదర్శించడం కావచ్చు. ఇవన్నీ హైదరాబాద్‌లో సైలెంట్ సినిమాల కాలంలో జరిగిన కీలకమైన ఘట్టాలు, పరిణామాలు.
వీటితోపాటు బొంబాయిలో దాదాసాహెబ్ ఫాల్కే దేశీయమైన తొలి మూగ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ను రూపొందించి 1913లో భారతీయ సినిమాకు పాదులు వేశాడు. వీరితోపాటు చందూలాల్ షా, అర్దేశీర్ ఇరానీ వంటి మరి కొందరు నిర్మాతలు కూడా వెంట వెంటనే సైలెంట్ సినిమాలు తీసి మూకీ యుగాన్ని పరిపుష్టం చేస్తున్న రోజులు అవి. మరోవైపు హైదరాబాదులో 1920లోనే నిజాం కుటుంబం సినిమాలు చూడటానికి నేటి సాలార్జంగ్ మ్యూజియం పక్కనే ఎస్టేట్ టాకీస్ నిర్మాణమైంది (ఇదే ఆ తర్వాత చేతులు మారి స్టేట్ టాకీస్‌గా పిలువబడింది).
ఈ నేపథ్యంలో అప్పటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆహ్వానం మేరకు 1922లో కలకత్తా నుండి ధీరేన్ గంగూలీ హైదరాబాదుకు వచ్చి 1924 వరకు సైలెంట్ సినిమాలు తీసాడు. ఆయన గన్ ఫౌండ్రీలో ఒక స్టూడియోను నిర్మించడమే గాక, తాను తీసిన సినిమాలు ప్రదర్శించడానికి రెండు థియేటర్లను కూడా నిర్మించాడు. ఈ పరిణామాలు హైదరాబాదులోని ఔత్సాహికులైన కళాకారులు ప్రభావితం కావడానికి మూల కారణమైనవి. వీటి ఫలితంగానే హైదరాబాదు నుండి సినిమాలలో నటించడానికి ఈ సైలెంట్ చిత్రాల కాలంలోనే బొంబాయికి వెళ్లినవారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభం అవ్వడానికి ముందు వరకు కూడా 1930లో బొంబాయి వెళ్లి హిందీ సినిమాలలో నటించిన తొలి తెలుగు వాడు ఎల్వీ ప్రసాద్ అన్నదే ప్రచారంలో ఉండింది.
అయితే ఎల్వీ ప్రసాద్ కన్నా ముందే 1928 సంవత్సరంలో బొంబాయికి సినిమాలో నటించడానికి వెళ్లిన తొలి తెలుగువాడు హైదరాబాదుకు చెందిన పైడి జయరాజ్ అనేది చారిత్రిక సత్యం. ఈ విషయాన్ని ఉద్యమ కాలంలో తొలుత ఈ పరిశోధకుడే 2000 సంవత్సరంలోనే వారు మరణించినప్పుడు రాయడం జరిగింది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పైడి జయరాజ్ కన్నా ముందు హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన నాగుల చింత ప్రాంతం నుండి రాంప్యారి అనే కళావంతురాలు మద్రాసు వెళ్లింది. అక్కడ శాస్త్రీయ నత్యం నేర్చుకొని అటు నుండి బొంబాయి వెళ్లి 1927లోనే చందూలాల్ షా కంపెనీ వాళ్ళు తీసిన ‘గుణసుందరి’లో ఆమె తొలిసారిగా నటించింది. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది ఈమె కన్నా ముందుగా వెళ్లిన ఇరువురు నటీమణుల గురించి.
1922 నుండి 8 సైలెంట్ చిత్రాలు తీసిన తర్వాత 1924లో హైదరాబాదులో జరిగిన కొన్ని రాజకీయ కారణాల వలన ధీరేన్ గంగూలీ కలకత్తాకు తిరిగి వెళ్లిపోవడంతో ఇక్కడ సినిమాల నిర్మాణం తాత్కాలికంగా ఆగిపోయింది. ఐతే ప్రజలపై వాటి ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు సరి కదా, ఎందరో ఉత్సాహ వంతులు సినిమాలలో నటించడానికి 1925లోనే బొంబాయి వెళ్లారని మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నవి. చీకటిని చీల్చేకొద్దీ వెలుగు రేఖలు వెలికి వచ్చినట్లు పరిశోధనలు లోతుగా జరిగేకొద్దీ మరిన్ని సరికొత్త విషయాలు వెలుగులోకి రావడం మొదలయ్యింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆంధ్రకు చెందిన ఎల్వీ ప్రసాద్, తెలంగాణకు చెందిన పైడి జయరాజ్ కన్నా మూడేళ్ల ముందుగానే 1925లో హైదరాబాదు స్టేట్ నుండి బొంబాయికి వెళ్లి సైలెంట్ సినిమాలలో నటించారు. అంటే సరిగ్గా నూరేళ్ల క్రితమే 1925లో హైదరాబాద్ స్టేట్‌కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు బొంబాయి వెళ్లి సైలెంట్ చిత్రాల్లో నటించారు. వారే సునాళినీ దేవి, మణాళినీ దేవి. వీరే గాక హైదరాబాద్ స్టేట్ నుండి ఒక సినిమాటోగ్రాఫర్ కూడా బొంబాయికి వెళ్లి నాడియా వారి వాడియా కంపెనీలో చేరి కెమెరామెన్‌గా సైలెంట్ చిత్రాలకు పనిచేశాడు. ఆయనే ఎం.ఏ.రెహమాన్‌గా ప్రసిద్ధి పొందిన మహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్.
సునాళినీ దేవి-మణాళిని దేవి
హైదరాబాదు స్టేట్‌లో ప్రసిద్ధ విద్యాసంస్థ నిజాం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసిన అఘోరనాథ చటోపాధ్యాయ కుమార్తెలే సునాళినీ దేవి, మణాళిని దేవి. అనగా భారత కోకిలగా పేరుందిన సరోజినీదేవికి వీరు స్వయానా చెల్లెళ్ళు. హైదరాబాద్ నగరంలో ఆనాటి సాంస్కతిక కళారంగాలు సరోజినీ నాయుడు కుటుంబం ప్రభావంతో కొత్త గ్రూపును సంతరించుకున్న కాలం అది. నాటి హైదరాబాదులోని కవులు, కళాకారులు, సంగీతకారులు, నటులు, నాటకాలు అన్నీ కూడా తమదైన రూపును సంతరించుకుంటున్న కాలం అది. ఆ సమయంలో సరోజినీ దేవి తమ్ముడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ అతని చెల్లెళ్లు సునాళినీదేవి, మణాళినీదేవి ఇరువురు కూడా ప్రదర్శన కళల పట్ల ప్రభావితమయ్యారు. వీరంతా కూడా అక్క సరోజినీ కొడుకు జయ సూర్య, కూతురు పద్మజానాయులతో కలిసి నాటకాలలో పాల్గొనేవారు. అయితే హరీంద్రనాథ్ చటోపాధ్యాయ తన కళాభిరుచితో కొంతకాలం బొంబాయిలో ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయాలు వీరిని సినిమా రంగం వైపు నడిపించాయి.
బొంబాయిలో హిమాన్షురారు -దేవికరాణిలు సైలెంట్ చిత్రాల తొలి దశకంలో భారతీయ సినిమా వికాసానికి ఎంతైనా కషి చేశారు. వీరు బాంబే టాకీస్ సంస్థను నెలకొల్పకముందే 1925లో నిర్మించిన ‘ది లైట్ ఆఫ్ ఆసియా’ (ఈ సినిమాకు మరో పేరు ‘ప్రేమ్ సన్యాసి’) సైలెంట్ సినిమాలో మన హైదరాబాదీ తారలు సునాళిని, మణాళిని ఇరువురు నటించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ఆర్థికంగా గొప్ప విజయం సాధించి ఇందులో నటించిన హిమాన్ష్ రారు, సీతాదేవి, ఇతర తారలందరికి కూడా గొప్ప పేరు వచ్చింది . ఈ సినిమా జర్మనీలో కూడా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత సునాళిని దేవి మాత్రం బొంబాయిలోనే ఉండిపోయి సినిమాల్లో నటించడం కొనసాగించింది.
టాకీ చిత్రాలు వచ్చిన తర్వాత ఆమె వీర కుణాల్ (1932), హమ్ తుమ్ అవుర్ ఓ(1938), పూజ (1940), మొహబ్బత్ (1943), మహాకవి కాళిదాసు, ఉమంగ్, గాలి (1944), ఫిర్ బి అప్నా హే (1946 ), శాంతి, నౌకా డూబి (1947), షికాయత్, ఆజాదీ కె రాహు పర్ (1948), దిల్ రుబా (1950), బుజిదిల్, మల్హర్ (1951), నౌ బహార్, జల్జలా, తమాషా, కఫీలా (1952), బాప్ బేటి (1954) వంటి పాతిక సినిమాలలో క్యారెక్టర్ పాత్రలను పోషించిందీమె. అయితే లైట్ ఆఫ్ ఆసియా సినిమా తర్వాత మణాళిని దేవి బొంబాయి నుండి మద్రాస్ వెళ్లి అక్కడ ‘షమా’ అన్న అంతర్జాతీయ త్రైమాస పత్రికకు సంపాదకురాలిగా చాలా కాలం పని చేశారు. కళలు, సంస్కతి, నాగరికత వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చే ఈ పత్రిక 1931 వరకు ఆమె సంపాదకత్వంలోనే వెలువడింది. ఆ తర్వాత ఆమె గొప్ప గొప్ప క్లాసిక్స్ అలా తగిన గ్రంథాలను ప్రచురించారు. వాటిలో హరేంద్రనాథ్ చటోపాధ్యాయ రాసిన ‘ద మ్యాజిక్ ట్రీ’, ‘ది పెర్ఫ్యూమ్ ఆఫ్ ఎర్త్’ (1922), సక్కుబాయి (1924), క్రాస్ రోడ్స్ (1934) వంటి జనాదరణ పొందిన ముద్రణలు ఉన్నవి.
సినిమాటోగ్రాఫర్- ఎంఏ రెహమాన్
ఉమ్మడి హైదరాబాద్ స్టేట్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ 1914 మార్చి 14న జన్మించాడు. చిన్నతనంలోనే సినిమాల పట్ల అభిరుచి పెంచుకొని పసితనంలోనే బొంబాయి రైలు ఎక్కి అక్కడి సినిమా ఇండిస్టీలో వాలిపోయాడు. అది మూకీల కాలం. తెలిసీ తెలియని వయసు. అయినా సినిమాల్లో చేరాలని అతని ఉత్సాహం స్టూడియోలన్నిటిని తిరిగేలా చేసింది. చివరికి 1925లో నాడీయా వారి వాడియా మూవీ టోన్ ఫిలిం స్టూడియోస్ లో లైట్ బారుగా రోజుకు రూపాయి కూలీకి చేరడంతో రెహమాన్ సినీ జీవితం మొదలైంది. మూకీల కాలంలో 1929లో తన 19వ ఏటనే విక్టోరియా ఫాతిమా ఫిలిమ్స్ కంపెనీ బ్యానర్ పై ఫాతిమా బేగం స్వయంగా దర్శకత్వం చేసి నిర్మించిన ‘మిలన్ దినార్’ అనే సైలెంట్ సినిమాకు మొదటిసారిగా కెమెరా మెన్‌గా పనిచేశాడు. దాంతో బాలీవుడ్లో పనిచేసిన తొలి తెలంగాణ టెక్నీషియన్ గా ఎం.ఏ. రెహమాన్ చరిత్రకి ఎక్కాడు.
1929లోనే విక్టోరియా ఫాతిమా ఫిలిం కంపెనీ వారికే ‘శకుంతల’ సినిమాకి కెమెరామెన్‌గా పనిచేసిన రెహమాన్ ఆ తర్వాత టాకీల శకంలో పెద్ద పేరు ఉన్న టెక్నికల్ ప్రావీణ్యత గల సినిమాటో గ్రాఫర్‌గా పేరు పొందారు. ఆయన హైదరాబాదు నగరానికి చెందిన టాంజూరు లలితాదేవి అన్న నటిని పెళ్లి చేసుకుని 1940లో మద్రాసుకు వచ్చి భక్తి మాల, భాగ్యలక్ష్మి, గూడవల్లి రామబ్రహ్మం మాయలోకం, శోభనాచల వారి శ్రీ లక్ష్మమ్మ కథ, ఎన్టీ రామారావు తొలిసారిగా తెరపై కనిపించిన ‘మన దేశం’ వంటి చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు. ఆయన ఎన్టీ రామారావుకు సాంకేతిక పరిజ్ఞానం అవగతం చేయడంలో గురువుగా ఉన్నారు.
ఎన్టీ రామారావు నిర్మించిన పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ, పాండురంగ మహత్మ్యం, సీతారామ కళ్యాణం, విరాటపర్వం, ఆయన నటించిన రాజనందిని, రేచుక్క పకటి చుక్క, భీష్మ, నర్తనశాల, దశావతారాలు వంటి చాలా చిత్రాలకు రెహమానే కెమెరామెన్‌గా పనిచేశాడు. ఆయన సేవలకు గుర్తింపుగా 1983లో ఎన్టీ రామారావు రఘుపతి వెంకయ్య అవార్డుతో ఆయనను సన్మానించారు. ఇలా హైదరాబాదు స్టేట్ నుండి బొంబాయి వెళ్లి మూకీ చిత్రాల కాలంలో పనిచేసిన ఎందరో నటీనటులు సాంకేతిక నిపుణులు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. తెలంగాణకు సినిమా చరిత్ర ఏమిటి? అన్న వారందరికీ కూడా సైలెంట్ సినిమాల కాలంలో మన వారు నిర్వహించిన భూమిక ఒక తిరుగులేని సమాధానంగా కనిపిస్తుంది.
(వ్యాసకర్త తెలంగాణ సినీ చరిత్ర పరిశోధకుడు)
హెచ్ రమేష్ బాబు, 7780736386