Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంవిద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మార్చి 18న చలో ఢిల్లీ

విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మార్చి 18న చలో ఢిల్లీ

- Advertisement -

సవరణ ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త సమ్మె తప్పదు : ఎన్‌సీసీఓఈఈఈ నిర్ణయం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మార్చి 18న చలో ఢిల్లీ చేపట్టనున్నట్టు నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (ఎన్‌సీసీఓఈఈఈ) వెల్లడించింది. ఈ ఆందోళనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటీకరణ ప్రయత్నాలను వెనక్కి తీసుకోకపోయినా, ముసాయిదా విద్యుత్‌ (సవరణ) బిల్లును ఉపసంహరించుకోకపోయినా విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతారని హెచ్చరించింది. ఆదివారం నాడిక్కడ సీఐటీయూ కేంద్ర కార్యాలయం (బీటీ రణదివే భవన్‌)లో విద్యుత్‌ రంగ ప్రధాన భాగస్వాములైన ఉద్యోగులు, వినియోగదారుల మధ్య విస్తృత ఐక్యత, సమన్వయ చర్యలను నిర్మించడంతో పాటు, విద్యుత్‌ హక్కును, మన దేశ ఇంధన భద్రతను పరిరక్షించేందుకు సమావేశం నిర్వహించారు. దర్శన్‌పాల్‌ సింగ్‌, మోహన్‌ శర్మ, విద్యాసాగర్‌ గిరి అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్‌సీసీఓఈఈఈ, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) జాతీయ నాయకత్వం పాల్గొన్నాయి. దేశంలోని కార్మికులు, రైతాంగంపై జరుగుతున్న దాడులను ఈ సమావేశం తీవ్రంగా పరిగణించింది.

విద్యుత్‌ ప్రయివేటీకరణ, ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటరింగ్‌, ముసాయిదా విద్యుత్‌ (సవరణ) బిల్లుపై చర్చ జరిగింది. పూర్వాంచల్‌, దక్షిణాంచల్‌ విద్యుత్‌ వితరణ నిగమ్‌ లిమిటెడ్‌లను ప్రయివేటీకరించడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న మొండి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అణుశక్తి చట్టం, సివిల్‌ లిబర్టీ ఆఫ్‌ న్యూక్లియర్‌ డ్యామేజ్‌ చట్టానికి సవరణల బిల్లులను ప్రభుత్వం తీసుకురావచ్చని సమావేశంలో నాయకులు చర్చించారు. అణుశక్తి చట్టం, సివిల్‌ లిబర్టీ ఆఫ్‌ న్యూక్లియర్‌ డ్యామేజ్‌ చట్టానికి సంబంధించిన సవరణల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని సంఘాలు నిర్ణయించాయి. విద్యుత్‌ ప్రయివేటీకరణకు, ముసాయిదా విద్యుత్‌ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా జనవరి-ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా భారీ సదస్సులు, ర్యాలీలతో కూడిన ఉమ్మడి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఎన్‌సీసీఓఈఈఈ ఆధ్వర్యంలో విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు మార్చి 18న ఢిల్లీకి మార్చ్‌ నిర్వహించనున్నట్టు, ఈ కార్యక్రమానికి మద్దతుగా పాల్గొనాలని అన్ని కార్మిక, రైతు సంఘాలకు ఎన్‌సీసీఓఈఈఈ విజ్ఞప్తి చేసింది.

డిమాండ్లు

  1. ముసాయిదా విద్యుత్‌ (సవరణ) బిల్లును
    ఉపసంహరించుకోవాలి.
  2. అణుశక్తి చట్టం, సివిల్‌ లిబర్టీ ఆఫ్‌ నూక్లియర్‌
    డ్యామేజ్‌ చట్టానికి ప్రతిపాదిత సవరణలను
    ఉపసంహరించుకోవాలి.
  3. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును
    తక్షణమే నిలిపివేయాలి.
  4. జనరేషన్‌ (ఉత్పత్తి), ట్రాన్స్‌మిషన్‌,డిస్ట్రిబ్యూషన్‌
    రంగాల్లో ముఖ్యంగా చండీఘర్‌, ఢిల్లీ, ఒడిశాలో
    ఉన్న అన్ని ప్రయివేటీకరణ లేదా ఫ్రాంచైజీ
    నమూనాలను ఉపసంహరించుకోవాలి.
  5. ఉత్తరప్రదేశ్‌లో పీవీవీఎన్‌ఎల్‌, డీవీవీఎన్‌ఎల్‌
    ప్రయివేటీకరణ ప్రయత్నాలను తక్షణమే
    నిలిపివేయాలి.
  6. క్రాస్‌-సబ్సిడీ, సార్వత్రిక సేవా బాధ్యతను
    కొనసాగించాలి. రైతులు, వినియోగదారుల
    ఇతర వర్గాలందరి విద్యుత్‌ హక్కును
    పరిరక్షించాలి.
  7. దేశవ్యాప్తంగా విద్యుత్‌ టారిఫ్‌లను తగ్గించడానికి
    నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -