Wednesday, July 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికులను బానిసలుగా మార్చే కుట్ర

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర

- Advertisement -

ఐక్య పోరాటాలతో మోడీ విధానాలను తిప్పికొట్టాలి
లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలి : సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

లేబర్‌ కోడ్‌లతో కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే మోడీ సర్కార్‌ యత్నాలను తిప్పికొట్టాలనీ, జులై 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు పిలుపునిచ్చారు. మంగళ వారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మూడు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలు, కార్పొరేట్‌ శక్తులకు లాభాలు చేకూర్చడం కోసం మోడీ సర్కారు పెద్ద పీట వేస్తున్న తీరును విడమర్చి చెప్పారు. కార్మికవర్గంపైనా, రైతులపైనా, గ్రామీణ వ్యవసాయ కూలీలపైనా భారాలు మోపుతున్న తీరును వివరించారు. 8 గంటల పని దినాన్ని 12 గంటల పనిదినంగా మార్చాలని చూస్తోందనీ, వేతనాలు నిర్ణయించే పద్ధతిని ద్వైపాక్షిక చర్చల ద్వారా కాకుండా ఏకపక్షంగా నిర్ణయించే పద్ధతిని తీసుకురాబోతున్నదని విమర్శించారు.

పరిశ్రమలో 51 శాతం ఓట్లు వస్తేనే యూనియన్లకు గుర్తింపునిస్తామనీ, లేనిపక్షంలో అడ్వయిజరీ బోర్డులు వేయిస్తామని కోడ్‌లలో పేర్కొనడం దుర్మార్గమన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ చట్టాల్లో అనేక మార్పులు చేసి యాజమాన్యాల దయా దాక్షిణ్యాలపై కార్మికులు ఆధారపడేలా చేస్తున్న తీరును ఎండగట్టారు. మహిళలను ప్రమాదకర మైన పనుల్లో, రాత్రి వేళల్లో పనులు చేయించ వద్దని గత చట్టాల్లో ఉన్నప్పటికీ నేడు వాటిని రద్దు చేసి గనుల్లో సైతం పని చేయాలనే పద్ధతిని తీసుకురావడాన్ని తప్పుబట్టారు.

సార్వత్రిక సమ్మెకు దేశంలోని 500కుపైగా రైతు సంఘాల జేఏసీ (సంయుక్త కిసాన్‌ మోర్చా) మద్దతు ప్రకటించింద న్నారు. రైతాంగ పోరాటంతో మోడీ సర్కారు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ నేడు జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ముసాయిదా పత్రం ద్వారా రద్దైన చట్టాల్లోని అంశాలనే ముందుకు తెస్తూ రైతాంగంపై దాడి చేస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టే నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నదని చెప్పారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని అనేకసార్లు చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని వాపోయారు. కార్పొరేట్‌ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు వివిధ ట్యాక్స్‌ల పేరుతో రద్దు చేస్తున్న ప్రభుత్వం రైతాంగానికి మాత్రం రుణమాఫీ చేయడానికి చేతులు రావడం లేదని విమర్శించారు.

రాజ్యాంగంలో పొందుపర్చిన సోషలిజం, లౌకికవాదం అనే అంశాలు ఉండకూడదని రాజ్యాంగంపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలతో వ్యవసాయరంగంలో సంక్షోభం నెలకొని గ్రామీణ వ్యవసాయ కార్మికులు పని దినాలు కోల్పోతున్నారని వాపోయారు. ఉపాధి లేక, ఆహారం దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రజా సంఘాల నాయకులు, మేధావులందరూ భాగస్వాములు కావాలని కోరారు. 9న పారిశ్రామిక, పట్టణ ప్రాంతాల్లోని కార్మికులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ రైతులు, కూలీలు నిరసనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, ఎస్వీ. రమ, వీఎస్‌.రావు, కోశాధికారి వంగూరు రాములు, రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -