Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికులను బానిసలుగా మార్చే కుట్ర

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– చర్లపల్లిలోని ఎపిరోక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ”శ్రమశక్తి నీతి-2025 ” పై సెమినార్‌
నవతెలంగాణ – చర్లపల్లి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్‌ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధమైనదని, ఇది కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఎపిరోక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యనిర్వక అధ్యక్షులు జి.రాంబాబు అధ్యక్షతన మంగళవారం ‘శ్రమశక్తి నీతి-2025తో కార్మికవర్గంపై దాడి’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను బలహీనపరిచే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. అక్టోబర్‌ 8న విడుదల చేసిన శ్రమశక్తి నీతి-2025 నూతన లేబర్‌ పాలసీ రాజ్యాంగంలోని సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం వంటి విలువలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే కోట్లాది కార్మికులపై ప్రభావం చూపే ఈ విధానాన్ని యూనియన్లతో చర్చించకుండా, ఏకపక్షంగా అమలు చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. కొత్త పాలసీ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికులపై యజమానుల నియంత్రణను మరింత పెంచి, వేతన హామీలు, పని గంటల పరిమితి, భద్రత వంటి అంశాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థను ప్రయివేటు చేతుల్లోకి అప్పగించడమే ఈ విధానం లక్ష్యమని చెప్పారు. దేశ నిర్మాణంలో కీలకమైన కార్మిక వర్గాన్ని కార్పొరేట్ల లాభం కోసం త్యాగం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. ఈ లేబర్‌ పాలసీని రద్దు చేయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతుందని స్పష్టం చేశారు.

కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలి
ఎపిరోక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌. మణికంఠ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు ఎదురొడ్డి అన్ని యూనియన్లు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. శ్రమశక్తి నీతి 2025 పేరుతో కార్మిక హక్కులను హరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల రక్షణకు ప్రతి ఉద్యోగి చైతన్యంతో ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ సహాయ కార్యదర్శి జీఎస్‌ దుర్గాప్రసాద్‌, కార్యనిర్వాక కార్యదర్శి ఈ.చంద్రశేఖర్‌, ఆఫీస్‌ బేరర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -