Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌ను జైలుకు పంపే కుట్ర

కేసీఆర్‌ను జైలుకు పంపే కుట్ర

- Advertisement -

ప్రభాకర్‌రావును వేధిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం
ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టబద్ధమే : బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ సీఎం కేసీఆర్‌ సహా, కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర సీనియర్‌ నాయకులను జైలుకు పంపాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తోందని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్‌ఎస్‌కు అడ్డుకట్ట వేయాలని చూస్తోందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఇంటెలిజెన్స్‌ అధికారిగా గుర్తింపు పొందిన ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావును ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ1గా చేశారని చెప్పారు. చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడం ఆయన చేసిన పాపమా?అని ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల పేర్లు చెప్పాలంటూ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నదని వివరించారు. ఆయనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతోపాటు చాలా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. 350 మంది సాక్షులను జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణ చేసినా ఏమీ తేలలేదని అన్నారు.

మళ్లీ నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. ఫోన్‌ట్యాపింగ్‌ చట్టబద్ధమేనని అన్నారు. ఇప్పుడు మంత్రుల ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాపింగ్‌ చేయడం లేదా?అని ప్రశ్నించారు. ప్రతీకార పాలనలో పోలీసులు పావులుగా మారొద్దని కోరారు. ప్రభాకర్‌రావు పిల్లలు, వారి బంధువులు, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పుకోసం పోలీసు అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం సరైంది కాదన్నారు. మహిళా ఐఏఎస్‌ అధికారిని ఓ మంత్రి వేధిస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని చెప్పారు. పోలీసులు ఆ మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు అసభ్యకర రీతిలో వేధించే స్థాయికి పరిపాలన దిగజారిందన్నారు. ఏపీ నీటిని తరలించుకుపోతున్నా సీఎం, మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు కె కిషోర్‌గౌడ్‌, వాసు దేవరెడ్డి, తుంగ బాలు, మొహిసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -