నవతెలంగాణ – చందుర్తి: దేశానికి పల్లెలు పట్టు కొమ్మలు అన్నారు మేధావులు. ఆ నానుడి ఇప్పుడు రివర్స్ అయ్యింది. గ్రామాల్లో నూతన భవనాల నిర్మాణం చూస్తే నిజమే కదా అనిపించక మానదు. గ్రామాల్లో పెంకుటిండ్ల ఆనవాళ్లు దిన దినం కోల్పోతున్నాయి. ఒక నాటి గ్రామాలు మారుతున్న తీరుపై నవతెలంగాణ కథనం..
గత నలభై సంవత్సరాలకు, ఇప్పటికి గ్రామీణ వాతావరణంలో చాలా మార్పులు జరిగాయి. మనం పాత కాలాన్ని ఓసారి నెమరువేసుకుంటే ఏ మారుమూల ప్రాంత గ్రామమైనా ఇంతగా అభివృద్ది చెందలేదనే చెప్పాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలా ఊర్లను మండలాలుగా ఏర్పాటు చేయడంతో బిల్డింగ్ ల నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీర్నపల్లి, రుద్రంగి గత నలభై సంవత్సరాలకు ఇప్పటికి రూపురేఖలు భారీగా పెరిగాయి. గతంలో చూస్తే ఏ పల్లెలో చూసిన పూరి గుడిసెలు, పెంకుటిళ్లు, ఛత్రశాల, చుట్టూ భవంతి బోల్ బంగ్లా, అనే పేరుతో పిలువబడే ఇండ్లు కనపడేవి కానీ ఇప్పుడు కాలానుగుణంగా అవి కనుమరుగై పోతున్నాయి.
అంటే నాటికి నేటికీ ఆర్థిక అభివృద్ధి పెరిగిందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఏ గ్రామాల్లో చూసిన నిరక్షరాస్యత ఉండేది. గత ఇరవై సంవత్సరాల వ్యవధిలో ప్రతి ఇంటిలో విద్యావంతుల సంఖ్య పెరిగింది. దీంతో వివిధ రంగాల్లో యువత ఉద్యోగం చేస్తూ పట్టణాల్లో ఉంటున్నారు. మరో వైపు కొందరు ఉపాధి నిమిత్తం గల్ప్ దేశాల్లో భారీ వేతనాలు ఉండగా.. ఆర్థికాభివృద్ధితో ప్రజలు గ్రామాల్లో ఉన్న పాత పెంకుటిండ్లను పూర్తిగా కూల్చివేసి, డుప్లెక్స్ కడుతున్నారు. ఇవి అన్ని సౌకర్యాలతో కూడిన హాంగు, రంగుల భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో 60 శాతం పాత కాలపు ఇండ్లను తొలగించారు. మరో పది సంవత్సరాల్లో పెంకుటిల్లు కనుమరుగవుతాయని పెద్దలు అంటున్నారు. దీంతో గ్రామీణం దాని ఆనవాళ్ళను కోల్పోతోందని తేలకగా అర్థమవుతోంది.