Saturday, December 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిభయభరిత గణతంత్రం.. నిరంకుశ కుతంత్రం…

భయభరిత గణతంత్రం.. నిరంకుశ కుతంత్రం…

- Advertisement -

సుసంపన్నమైన ప్రపంచ సాహిత్య సముదాయంలో జాతర పాటలు, కీర్తనలూ, జోలపాటలూ సగర్వంగా ఒక ప్రత్యేక స్థానం ఆక్రమిస్తున్నాయి. లూయిస్‌ కారల్‌ తను కట్టిన ఈ తరహా సోదిసుద్దులతో వ్యంగ్యం జత చేసి ఓ ప్రత్యేక సారసత్వం సమకూర్చిపెట్టాడు. మన దేశాన్నే తీసుకుంటే అత్యంత ప్రతిభావంతుడైన సాంస్కృతిక మూర్తి, సినీ స్రష్ట సత్యజిత్‌రే తండ్రి అయిన సుకుమార్‌ రే తన పల్లెపదాల సుద్దులతో విలక్షణ వరవడి జోడించారు. అధికారం అంటే ఎలా వుంటుందో ఆ పదాల్లో ఒకటి అపహాస్యం కుమ్మరించేలా చెబుతుంది. పాలకులు హాస్యమంటే ఎందు కంతగా వణికిపోతారని ఆ పదునైన పల్లవి ప్రశ్నిస్తుంది. వారెందుకు ఎప్పుడూ ఉద్రిక్తంగా భయంతో బిక్కుబిక్కు మంటూ వుంటారు?

సరిగ్గా అదే ప్రశ్న ఇప్పటి మోడీ సర్కారుకు కూడా వర్తింపచేయొచ్చు. దిగుమతి చేసుకునే వాటితో సహా స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిదారులందరికీ జారీ చేసిన ఒక ఉత్తర్వు గురించి డిసెంబర్‌ 3న ప్రభుత్వం ప్రముఖంగా సమా చారం విడుదల చేసింది. అన్నిటినీ అదుపులో వుంచుకోవాలనే ఉన్మాద మనస్తత్వం నిండిన ఉత్తర్వు అది. కచ్చితంగా చెప్పాలంటే భారతీయ మార్కెట్లలో విక్రయించే సాధనాలన్నింటిలో ‘సంచార్‌ సాథీ’ అనే ప్రభుత్వ ప్రాయోజిత యాప్‌ వేసుకోవాలని ఆ ఉత్తర్వు ఆదేశించింది. ఇప్పటికే వాడకంలో వున్న మొబైళ్లలో కూడా దాన్ని వేసుకోవాల్సిందేనని చెప్పడం ద్వారా ఇందులో ఎలాంటి వివక్ష లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ సరికొత్త చర్య వెనక లక్ష్యమేమిటో కూడా ప్రభుత్వం విశదీకరించింది. సైబర్‌ నేరస్తుల మోసాల బారినుంచి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను కాపాడటానికే దీన్ని తీసుకొచ్చానని చెబుతున్నది. ఉదార నియంత మాదిరిగా చూపించిన ఈ వైఖరిని ఎవరూ పెద్దగా పట్టించుకోవలసింది కాదు.

పెగాసస్‌ నుంచి సాథీ వరకూ
దీనిపై అన్ని వైపుల నుంచీ ప్రతికూలత, నిరసన వ్యక్తమవడం ముందే చెప్పదగిన విషయం. ప్రజల వాస్తవ జీవితానుభవం నుంచే ఈ ప్రతిస్పందన వచ్చింది. అంతేగాక వ్యక్తిగత గోప్యత కల్పించే రాజ్యాంగ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. అసమ్మతిని కాలరాచే ఆయుధంగా ఇది మార్చబడుతుంది. భీమా కోరెగావ్‌ హింసాకాండ విచారణ సందర్భంలో అనేకమంది విద్యావేత్తలు, న్యాయవాదులు, కార్యకర్తలు, మేధావులను నిర్బంధంలోకి నెట్టిన సందర్భంలోనే ఈ ధోరణి నిరూపితమైంది. హింసాకాండను ప్రేరేపించారన్న ఆరోపణను ఎదుర్కొంటున్న వారి లాప్‌ టాప్‌లు, ఇతర డిజిటల్‌ సాధనాలలో అనుమానాస్పదమైన పత్రాలను జొప్పించా రనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ వైరస్‌ ఆ పరికరాలలో జొప్పించబడటంతో ఆ యంత్రాలలోని డేటా మారిపోయింది. కల్పిత ఆరోపణలకు గురైన వారిని ఏళ్ల తరబడి జైళ్లలో వుంచేందుకు దాన్నే పోలీసులు సాక్ష్యంగా చూపిస్తూ వచ్చారు. వారందరికీ ఆ తర్వాత బెయిల్‌ వచ్చింది. అంటే అలాంటి వాటి ఆధారంగా మోపబడిన కేసు గట్టిగా నిలబడేది కాదని స్పష్టం అవుతోంది.

అదే విధంగా నిఘా కోసం ఒక ఆయుధంగా పెగాసస్‌ స్పైవేర్‌ జొప్పించడంలోనూ అలాంటి దురుద్దేశపూరిత లక్షణాలే చూశాం. దాన్ని ప్రభుత్వమే వినియోగించాలి తప్ప బయటివారికి బదలాయించడం జరగబోదని హామీఇవ్వడం ఒక షరతుతోనే ఈ స్పైవేర్‌ అమ్ముతారు. మా మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా తమ లక్ష్యంగా చేసుకున్న వారి పరికరాలలో ఈ స్పైవేర్‌ను నిజంగా జొప్పించారని కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించాయి. దీనిపై విచారణ జరపడంతో ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు నిరూపితమయ్యాయి. అయితే ఇందుకు పాల్పడిన సంస్థ ఏమిటో సుప్రీంకోర్టు పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి దుర్మార్గమైన మారణకాండ సంస్కృతికి ఇజ్రాయిల్‌ పేరుమోసింది. దాని భద్రత నిఘా సంబంధిత పరికరాలు వాటితో ముడిపడి వున్నాయి. ఇటీవల గాజాలో జరిగిదాన్ని బట్టి ఇదే వెల్లడైంది. సహజంగానే అన్ని స్మార్ట్‌ఫోన్‌ పరికరాలలో సంచార్‌ సాథీ యాప్‌ను వేయడం తప్పనిసరి అని ఆదేశాలు వెలువడినప్పడు ఈ ప్రస్తావనలన్నీ కళ్ల ముందు కదలాడాయి.

కార్పొరేట్ల భయంతోనే..
అయితే ప్రభుత్వం వెనక్కు తగ్గి అమ్మకానికి ముందే స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను వేయడం తప్పనిసరంటూ పట్టుపట్టబోమని ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టయింది. అయితే దీనిపై తొందరపడి సంబరపడడం అర్థరహితమే అవుతుంది. యాపిల్‌, శాంసంగ్‌, గూగుల్‌ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి గట్టి ప్రతిఘటన వచ్చినందునే ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ప్రభుత్వ ఆంక్షలకు లొంగడానికి అవి నిరాకరించాయి. ఈ దేశ ప్రజలు, అస మ్మతి తెల్పడానికి వారికి గల హక్కు ఇవేవీ ప్రభుత్వానికి పట్టవు. గ్లోబల్‌ సాంకేతిక కార్పొరేట్ల బెదిరింపుల వల్లనే వాటి బలమైన ఒత్తిడితో ఈ ఫలితం వచ్చింది.

భయం, అభద్రత కలిగించే ధోరణి ప్రభుత్వంలో కొనసాగుతున్నంత వరకూ ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే వుంటాయి. ఇది ఫాసిస్టు క్రీడల్లో అంతర్భా గంగానే వుంటుంది. ప్రజల సమిష్టి ఆలోచనలను నియంత్రిం చేందుకు ఇటీవలి కాలంలో జరిగిన ప్రయత్నాల కథలతో పాటు ప్రజల ప్రతిఘటన సంకేతాలు కూడా కనిపిస్తూనే వున్నాయి. ఎన్నికల సంఘాన్ని రంగంలోకి దించడం ఇందులో భాగమే. ఓటు వేసేందుకుగల సార్వత్రిక హక్కును కూడా హుళక్కి చేసే ఈ తరహా కళంకిత ప్రయత్నాలు గతంలో ఎన్నడూ చూసివుండము. నిస్సందేహంగా ఇలాంటివి రాబోయే రోజులలో ఇంకా పెరుగుతాయి.

పొంచిన ముప్పు
ప్రజాస్వామిక హక్కులను భారీ ఎత్తున దెబ్బ తీయవచ్చునని ప్రభుత్వమే అందించిన వాస్తవ సాక్ష్యాలతో స్పష్టమవుతున్నది. ఆయుధాలుగా మార్చిన ఉపా వంటి కర్కోటక శాసనాల నిబంధనలను ప్రయోగిస్తే చాలు. ఉపా కింద 2019-2023 మధ్య 335 మంది నిందితులకు శిక్షలు పడ్డాయని పార్లమెంటులో ప్రభుత్వం డిసెంబరు 2న ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తున్నది. ఇదే కాలంలో అరెస్టు చేయబడిన వారి సంఖ్య 10,440 వుంది. జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్‌.సి.ఆర్‌.బి) సమకూర్చిన వివరాల ప్రకారం రాష్ట్రాల వారీగా చూస్తే ఇందులో అత్యధికులు జమ్ముకాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లలో అరెస్టయ్యారు. అంటే బలవంతంగా తమ ఆదేశాలకు తల వంచేలా చేసుకోవడానికి, అధికార వ్యవస్థకు పూర్తిగా లొంగిపోయేలా నిర్బంధించేందుకు ఇదంతా జరుగుతున్నదని అర్థమవుతూనే వుంది.

సంచార్‌ సాథీ నుంచి ఉపా వరకూ సందేశం ఏమిటో సుస్పష్టం. సజీవమైన మన రిపబ్లిక్‌ రాజ్యాంగ జీవ నాడిని ఆపేసేందుకు నయా ఫాసిస్టు లక్షణాలతో ఈ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైపోయింది. ఇది, అసమ్మతి హక్కు కీలకంగా ఆ రాజ్యాంగం కల్పిస్తున్న మానవ హక్కులు కాలరాచివేస్తున్నది. ఒక దేశంగా ప్రజలుగా ఇవి మనకు ఎంతో అమూల్యమైనవే. ఒక్కుమ్మడిగా అందరం కలిసి బలమైన ప్రతిఘటన చేయగలిగితేనే మన హక్కులు కాపాడుకోగలుగుతాము.
(డిసెంబరు 10 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -