భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఉత్సవాలలో గణేశ్ చతుర్థి ఒకటి. ఈ పండుగకు జాతీయ చైతన్యాన్ని కలిపి, ప్రజల్లో ఐక్యతను పెంచిన ఘనత స్వాతంత్య్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ గారిదే.
ఒకప్పుడు వినాయకుడి ఉత్సవాలు ఇళ్లలోనే జరుపుకునే వారు, కానీ బాల గంగాధర్ తిలక్ గారు వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించడం ప్రారంభించి, ప్రజలను ఏకం చేయడానికి, బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా జాతీయవాద భావాలను ప్రోత్సహించడానికి ఈ పండగను ఉపయోగించుకున్నారు. ఆయన 1893లో గణపతి ఉత్సవాలను, 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించి, ఈ పండగలను సామాజిక, రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చారు.
బ్రిటిష్ పాలన సమయంలో, ప్రజలు గుంపులుగా కూడడం, సమావేశాలు నిర్వహించడం నిషిద్ధం అయిన కాలంలో, తిలక్ గారు గణేశ్ ఉత్సవాన్ని ప్రజల ఉమ్మడి ఉత్సవంగా మార్చారు. 1893లో పుణేలో మొట్టమొదటిసారి పెద్ద స్థాయిలో గణేశ్ పూజలు నిర్వహించి, దైవ భక్తితో పాటు దీనిని ఒక సామాజిక ఉద్యమంగా మారుస్తూ దేశభక్తిని ప్రజల్లో నాటారు.
ఆ ఉత్సవాల్లో నాటకాలు, ప్రవచనలు, దేశభక్తి గీతాలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించి, స్వాతంత్య్ర పోరాటానికి గణేశ్ ఉత్సవాన్ని మద్దతుగా మార్చారు. ఈ చర్య వలన ప్రజలలో ఐక్యత, చైతన్యం, దేశప్రేమ పెరిగింది. అంత వ్యతిరేకత ఉన్న సమయంల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలిగిన తిలక్ గారి ధైర్యం, దూరదష్టి మనకు ప్రేరణగా నిలుస్తోంది.
దేశభక్తి అంటే కేవలం దేశం కోసం సైనికునిలా యుద్ధం చేయడం మాత్రమే కాదు, దేశ ఆర్థికాభివద్ధికి అడ్డుపడే విద్రోహ శక్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం కూడా దేశభక్తి ముఖ్య ఉద్దేశం .
అందువల్ల నేటి తరం యువత, గణేశ్ చతుర్థిని కేవలం ఆధ్యాత్మిక ఉత్సవంగా మాత్రమే కాక, దేశభక్తికి చిహ్నంగా గుర్తించాలి. గణేశ్ ఉత్సవం మన సంస్కతి, మన చరిత్ర, మన ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భంలో మనం దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా మనసులో నిలుపుకోవాలి.
డా||ఎర్ర కనకరాజు,
అహ్మదిపూర్
భక్తి, ఐక్యత, దేశభక్తి కలిసిన పండుగ
- Advertisement -
- Advertisement -