ప్రపంచ ఆదివాసుల దినోత్సవం
ఆగస్టు 9న జరుపుకుంటాం. ఆదివాసులనే మూలవాసులు అని కూడా పిలుస్తాం. ఇది పండుగ కాదు, ఆదివాసుల హక్కులను కాపాడుతామని మరోమారు ప్రమాణం చేసే రోజు. 1982లో ఐక్యరాజ్య సమితిలో ఆదివాసుల స్థితిగతులను తెలుసుకుని, వారి హక్కులను పరిరక్షించేందుకు, వారిని అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి జరిగిన మొదటి సమావేశం జరిగిన రోజు.
2025, ఆగస్టు 9వ తేదీ నుండి సంవత్సరం పాటు జరగబోయే ఈ వార్షికోత్సవాల సమయంలో ‘ఆదివాసుల హక్కులను కాపాడుట, అభివృద్ధికి కృషి చేయట’ అనే నినాదాన్ని అవలంభించాలని నిర్ణయించారు. దీనిలో ఆదివాసి యువకుల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తూ వారికి హక్కులను తెలియజేయడం ముఖ్యమైనది. మన తెలంగాణలో ఆదివాసి గిరిజన సంఘం జులై ఆఖరువారంలో ఇదే అంశాలపై 29- 31 తారీఖులలో రాష్ట్రస్థాయి యువక్యాడర్ శిక్షణా తరగతులు నిర్వహించడం చాలా సమంజసం, సంతోషదాయకం.
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 476 మిలియన్ల ఆదివాసులు వున్నారని ఒక అంచనా. వీరు 90 దేశాలలో నివశిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరు 6.2 శాతం వుంటారు. 5000 వరకు ఆదివాసీ జాతులు వున్నారు. 7 వేల వరకు భాషలు మాట్లాడుతారు. అన్నీ మౌఖిక భాషలే.
బయటి ప్రపంచంతో సంబంధాలు లేని సమయంలో వీరికి ప్రత్యేక ప్రతిపత్తి వుంది. భూమి, అడవి, నీరు మొదలైనవి సామాజిక ఆస్తులు. ప్రత్యేకమైన సంస్తృతి, ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వపరిపాలన లాంటివి వీరి ప్రత్యేకతలు. చాలా ఆదివాసి తెగలకు తమదైన భాష, నమ్మకాలు, ప్రకృతి విజ్ఞానం వున్నాయి. ఇవన్నీ తరతరాలుగా మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి అందించబడుతున్నాయి. ప్రకృతితో సహజీవనం వీరి సంస్కృతిలో ప్రత్యేక భాగం. మానవుడు, ప్రకృతి సంబంధాలు, జీవన విధానాలు సక్రమ మార్గంలో నడిచేందుకు ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే అందరికోసం, అందరూ పనిచేసే విధానం వారిది. లాభాపేక్ష లేకుండా, వున్నదాన్ని అందరూ పంచుకునే వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఖండాలలో ఆదివాసుల వ్యస్థలు అన్నీ ఇదే విధంగా వుండేవి. పోడు వ్యవసాయం అటవీ ఫల సేకరణ, వేట మొదలైన వ్యవసాయ పూర్వ జీవన విధానాలు ప్రదానంగా వుండేవి. మారుతున్న కాలంలో ప్రపంచ ఆదివాసులు ముఖ్యంగా మూడు ఇబ్బందులకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 1. తమ జీవన వనరులు, ముఖ్యంగా అడవి భూమిపై హక్కులు కోల్పోవడం, 2. రాజకీయంగా బలం లేకపోవడం, 3. సామాజిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం.
ఉత్తర అమెరికాలో చాలామంది ఆదివాసులు వున్నారు. వీరిని ఇంతకముందు ‘రెడ్ ఇండియన్లు’ అని పిలిచేవారు. ఇప్పుడు అమెరికన్ ఆదివాసి ఇండియన్లు (అమెరికన్ నేటివ్ ఇండియన్స్) అని పిలుస్తున్నారు. తెల్లవాళ్లు ఉత్తర అమెరికాను ఆక్రమించుకున్న తరువాత ఆదివాసులకు ‘రిజర్వేషన్లు’ (ప్రత్యేకించబడిన ప్రాంతాలకు పరిమితం చేశారు. వారు బయటకు రాకూడదు. రావాలనుకున్నా ప్రత్యేకమైన పర్మిట్లు కావాలి. ఎన్ని రోజుల్లో తిరిగి రావాలో కూడా ఆ పర్మిట్లలో రాసి వుంటుంది. ప్రపంచంలో అతి పురాతనమైన ప్రజాస్వామ్యం అని చెప్పుకునే అమెరికాలో 1924 (ఇండియన్ సిటిజన్‌షిప్ యాక్ట్, 1924) వరకు పౌరసత్వ హక్కులేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు చాలా కాలం వరకు పౌరసత్వ హక్కులు కల్పించలేదు.
వలస రాజ్య పాలనలో దక్షిణాఫ్రికా ప్రజలు ఎన్ని బాధలు అనుభవించారో అందరికీ తెలిసిందే. ఆదివాసులను ఓడలలో ఎత్తుకుపోయి, బానిసలుగా మార్చిన చరిత్ర అమెరికా, చరిత్రలో ముఖ్యమైన భాగం. ఆస్ట్రేలియాలో అయితే తెల్లవాళ్లు మొట్టమొదటిసారి ఆదివాసులను చూసినప్పుడు భయపడి కాల్పులు జరిపితే చాలామంది ఆదివాసులు చనిపోయారని చరిత్ర తెలుపుతోంది. వీరి వల్ల ఆదివాసులకు సుఖవ్యాధులు సంక్రమిస్తే ఎన్నో జాతులు అంతరించి పోయాయి. దీనిని ‘నాగరికుల బహుమానం’ అనిపిస్తున్నారు.
కొద్దికాలం క్రితం ఒక పోలీసు అధికారి అతితెలివి ప్రదర్శించి ఆదివాసి పిల్లలందరినీ ట్రక్కులలోఎక్కించి తీసుకుపోయి నైవాసిక పాఠశాలలో చేర్పించాడు. సెలవుల్లో ఇంటికి పంపలేదు. పిల్లల తల్లిదండ్రుల వివరాలు, వారి గ్రామాల వివరాలు నమోదు చేయలేదు. దానితో పిల్లలు పదవ తరగతి పూర్తైన తరువాత తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటే ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో కొందరు కోర్టులకు ఆశ్రయించి ‘మా తల్లిదండ్రుల గ్రామాలు తెలపండి’ అని కోరారు. ప్రభుత్వం వద్ద వివరాలు లేవని కోర్టుకు తెలపడం జరిగింది. ఇటువంటి దుర్మార్గాలు చాలా జరిగాయి. ఇప్పటికీ జాతి విలక్షణ, జాత్యహంకారం చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇక మన దేశంలో పరిస్థితి చూద్దాం.
మనం సామాన్యంగా గిరిజనులు, ఆదివాసీలు, మూలవాసులు అని పిలిచే తరగతులను రాజ్యాంగ పరంగా షెడ్యూల్ తెగలు అని పిలుస్తారు. రాజ్యాంగం ఆర్టికల్ 366 (25) ప్రకారం ఆదివాసులు, వారి సమూహం లేక వారిలో ఒక భాగాన్ని షెడ్యూల్ తెగలుగా పేర్కొంటారు. రాజ్యాంగంలోని 342 ఆర్టికల్‌లో సంక్రమించిన అధికారం ప్రకారం రాష్ట్రపతి షెడ్యూల్ తెగల నుంచి ప్రకటిస్తారు. ఏదైనా తెగను ఈ జాబితాలో చేర్చడం కాని, తీసేయడం కాని చేయడానికి పార్లమెంట్‌కే అధికారం వుంది. అయితే ఈ జాబితా రాష్ట్రాల వారీగా ప్రచురించబడుతుంది. ఒకే పేరున్న తెగ రెండు రాష్ట్రాలలో నివసిస్తున్నవారిని ప్రకటించిన రాష్ట్రంలోనే షెడ్యూల్ తెగలుగా గుర్తించబడతారు. ముఖ్యంగా స్థానిక రిజర్వేషన్లు, పంచాయితీ నుండి పార్లమెంటు వరకు, విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయా రాష్ట్రాల వారే అర్హులు.
705 షెడ్యూలు తెగలు వివిధ రాష్ట్రాలలో నివశిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తమ వార్షిక రిపోర్టుల్లో తెలిపారు. రాజ్యాంగంలో షెడ్యూలు తెగలను గుర్తించే విధి విధానాలను పేర్కొనలేదు. అయితే తరువాతి కాలంలో లోకూర్ కమిటీ రిపోర్టు ఆధారంగా షెడ్యూల్ తెగల లక్షణాలను పేర్కొంది. ఇవి 1. పురాతన నాగరికత లక్షణాలు, 2. ప్రత్యేకమైన సంస్కృతి, 3. బయటి వారితో కలవడానికి ఇష్టపడకపోవడం, 4. వారి ఆవాసాలు ప్రత్యేకమైన ప్రాంతాలకు పరిమితం కావడం, 5. వెనుకబాటుతనం.
అయితే ఈ లక్షణాలలో కొన్ని ఇప్పుడు లేవు. విద్య, ఉద్యోగం, రాజకీయ అవకాశాలు మెరుగుపడంతో బయటి వారితో కలవడం ఎక్కువ అయింది. బయటివారి వేషభాషలను నేర్చుకోవడం ఎక్కువ అయింది. అలాగే నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించడం, రవాణా సౌకర్యాలు, మార్కెట్ అభివృద్ధి లాంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే ప్రత్యేక ప్రాంతాలు, మూల సంస్కృతిలో కొన్ని విషయాలను వీరి సంస్కృలో చేర్చుకోవడం అనేది ‘సంస్కృతుల కలయిక’ వల్ల జరుగుతున్న పరిణామం. దీనివల్ల గిరిజనుల జీవన విధానాలకు చాలా చెడు జరుగుతోంది. వివరాలు తరువాతి పేరాలలో పేర్కొనబడతాయి.
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ( ఆరువాత జనాభా లెక్కలు తీయలేదు) పదికోట్ల నలభైమూడు లక్షల (10.43 కోట్లు) షెడ్యూలు తెగల జనాభా వుంది. ఇది దేశ జనాభాలో 8.60 శాతం. ఎక్కువ జనాభా మధ్యభారత దేశంలో ఉంది. మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలలో ఎక్కువ జనాభా వున్నారు. ఒడిస్సా రాష్ట్రంలో ఎక్కువ (62) షెడ్యూల్ తెగలు వున్నాయి. తెలంగాణలో 32 షెడ్యూల్ తెగలు వున్నాయి. భిల్, గోండు, సంతాల్, ఒరాన్ వంటి షెడ్యూల్ తెగలు అత్యంత ఎక్కువ జనాభా కలిగి వివిధ రాష్ట్రాలలో నివశిస్తున్నారు. షెడ్యూల్ తెగలు ఎక్కువగా నివశించే ప్రాంతాలను ఆరవ షెడ్యూల్‌గా రాష్ట్రపతి ప్రకటించారు.
705 షెడ్యూల్ తెగలలో 75 తెగలను అత్యంత వెనుకబడిన తెగలుగా (పి.వి.టి.జి.)గా గుర్తింపబడ్డారు. 1. వ్యవసాయ పూర్వ జీవన విధానంలో (అంటే పోడు వ్యవసాయం, అటవీ ఫల సేకరణ, వేట లాంటి వృత్తులు, 2. తరిగిపోతున్న లేక పెరుగుదల లేని జనాభా, 3. అతి తక్కువ అక్షరాస్యత, 4. ఉన్నదానితోనే సరిపెట్టుకునే ఆర్థిక విధానం. అయితే వీరిలోనూ కొన్ని మార్పులు వస్తున్నాయి. కాని వెనుకబాటు తనం పోలేదు. అదేకాకుండా వీరు ఎక్కువగా నివశించే ప్రాంతాలు వివిధ రకాలైన ఆక్రమణలకు గురవుతున్నాయి.
అక్షరాస్యతలో వెనుకబాటుతనం:
దేశంలో అక్షరాస్యత విషయంలో షెడ్యూల్ తెగలు అత్యంత వెనుకబాటుతనంలో వున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత 73 శాతం వుంటే గిరిజనుల్లో 59 శాతం మాత్రమే వుంది. దానిలో కూడా స్త్రీల అక్షరాస్యత 49.4 శాతం మాత్రమే వుంది. దీనిలో కూడా ప్రాంతాల వారీగా, తెగల వారీగా తేడాలున్నాయి. గుడ్డిలో మెల్ల అన్నట్టు షెడ్యూల్ తెగలలో అక్షరాస్యత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూనే వస్తోంది. 1961లో 8.53 శాతం వున్న అక్షరాస్యత, 2011 నాటికి 59 శాతం వరకు పెరిగింది. పాఠశాల విద్య అభివృద్ధి చెందడంలో దీనికి ప్రధాన కారణం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య నూరుశాతంగా వుంటోంది. కానీ ఐదవతరగతి లోపే విద్య ఆపేసే విద్యార్థుల శాతం 30 శాతం వరకు వుంది. పదవ తరగతి పూర్తిచేసినవారు 38 శాతం మాత్రమే. ఇది సరిచేయడమే కాక నాణ్యమైన విద్యను అందించవలసిన అవసరం వుంది.
గిరిజనుల మాతృభాషలు చాలా వున్నాయి. ఇంట్లో భాష, ప్రాథమిక విద్య బడిలో భాష ఒకటే వుండాలని రాజ్యాంగం చెబుతోంది. బయటి నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బడికి రాకపోవడం, షెడ్యూల్ తెగల భాష రాకపోవడం, స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల సంవత్సరంలో చాలా భాగం పాఠశాలలు మూతపడ్డాయి. జీతాల సమయంలో మాత్రం ప్రత్యక్షం అయ్యేవారు. 1986వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని సమీక్షించి స్థానిక గిరిజనులనే ఉపాధ్యాయులుగా నియమించాని నిర్ణయించింది. పదవ తరగతి వరకు, ఆపైన చదువుకున్న గిరిజన స్త్రీ, పురుషులను ఉపాధ్యాయులుగా 100 శాతం నియమించి వారిని ఉపాధ్యాయ శిక్షణకు పంపాలని నిర్ణయించింది. దీనితో కొన్ని వేలమందికి ఉపాధి లభించడమే కాక గిరిజన ఆవాసాల్లో చాలా వాటికి ప్రాథమిక పాఠశాలలు వచ్చాయి. గత నలభై సంవత్సరాలుగా చాలామంది విద్యావంతులుగా తయారయ్యారు. అయితే 100 శాతం రిజర్వేషన్ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో మళ్లీ తిరోగమనం మొదలైంది. దీనికి పరిష్కారం కనుక్కోవడంలో చాలా జాప్యం జరుగుతోంది. ఇది చాలా బాధాకరం.
అనారోగ్యం, అకాల మరణాలు :
తల్లీ పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువ. బరువు తక్కువ పిల్లలు 54.5 శాతం వుంటారని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే- 3 లో తెలిపింది. దాంట్లో అతి తక్కువ బరువు వున్న వాళ్లు 24.9 శాతం. అందువల్లనే పసిపాపలమరణాలు (ఐ.ఎం.ఆర్) 62.1 శాతం వుంది. పసితనంలో పెళ్ళిళ్లు, దాని పరిణామం తల్లుల మరణాలు ఎక్కువవుతాయి. సమగ్ర శిశుఅభివృద్ధి పథకం దశాబ్దాలుగా అమలులో వున్నా ఈ పరిస్థితి ఉండడం శోచనీయం.
మారమూల గ్రామాల్లో వైద్యసౌకర్యం లేక రోగులను డోలీలు, మంచాలపై మోసుకుని తీసుకెళ్లే పరిస్థితి మనం చూస్తూనే వున్నాం. గర్భిణీలను వాగులు దాటించలేక అంబులెన్సులు వెళ్లే సౌకర్యం లేక చనిపోయిన పరిస్థితి కూడా అందరికీ తెలుసు.
భూమి బదలాయింపు సమస్య :
గిరిజన ప్రాంతాల్లో అటవీ భూమి, వ్యవసాయ భూమి, అటవీ ఫలసాయం జీవనాధారాలు. భూమి బదలాయింపు నిరోధక చట్టం (1/70) లాంటివి అమలు కాకపోవడం వల్ల 50శాతం భూమి గిరిజనులు కోల్పోయారు. అటవీ హక్కుల చట్టం అమలులో లోపాల వల్ల పరిస్థితి మరీ జటిలమైంది. చిన్నతరహా అటవీ సంపద సేకరించిన వారికి సరైన ధర చెల్లించక పోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. ఇదికాక మార్కెట్లలో దళారీల దోపిడీ చాలా ఎక్కువ. వాణిజ్య పంటలు, పండ్ల తోటల పెంపకం వల్ల వచ్చే లాభాలు వడ్డీ వ్యాపారులకే వెళ్తున్నాయి. సంస్థాగత రుణాలు అందక పోవడమే దీనికి ముఖ్యకారణం. 1813లో నిరంప పోరాటం నుంచి కొమరం భీం, ఇంద్రవెల్లి పోరాటాల వరకు గత 200 సంవత్సరాలుగా గిరిజనులు పోరాటాలు చేస్తున్నారు. రాజ్యాంగం, చట్టాలు రక్షణలు కల్పిస్తున్నా, ఆచరణలో లోపం ప్రధానలోపం.
స్వపరిపాలన :
తరతరాలుగా గిరిజనులలో స్థానిక స్వపరిపాలన వుంది. గ్రామ పంచాయితీ వనరుల నిర్వహణ వంటి పటిష్ట వ్యవస్థ నీరసపడిపోయింది. స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీల పరంగా జరగడంతో గిరిజన సమాజంతో చీలికలు వచ్చాయి. స్థానిక స్వపరిపాలన పునరుద్ధరించాలని ఉద్దేశంతో పీసాచట్టం తేబడింది. దాని అమలు అంతంత మాత్రమే.
నిరాశ్రయులు :
గిరిజన ప్రాంతాల్లోనే వివిధ వనరులు వున్నాయి. అందువల్ల బయటివారి దోపిడీకి ఆస్కారం పెరిగింది. గిరిజనుల్లో నిరాశ్రయులు పెరుగుతున్నారు. మధ్యతరహా, పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల ముంపుకు గురయ్యేది గిరిజన ఆవాసాలే. పోలవరం లాంటి ప్రాజెక్టుల వల్ల 275 గిరిజన గ్రామాలు ముంపుకు గురికాబోతున్నాయి. లక్షల ఎకరాల భూమి, విలువైన అడవి జంతువులు ముంపుకు గురవుతున్నాయి. ఇది కాక భూగర్భ వనరులైన బొగ్గు, బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన గ్రామాలు తరలిపోవలసిన పరిస్థితి వస్తోంది. అభయారణ్యాలు, పర్యాటక ప్రాజెక్టుల వల్ల గిరిజనుల స్వతంత్ర జీవనం దెబ్బతింటోంది. ఈ పరిస్థితులన్నీ క్రోడీకరించుకుంటే గిరిజనుల జీవనం అస్తవ్యస్థంగా తయారవుతున్న విషయం స్పష్టమౌతుంది. దీనిని సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వం, గిరిజన సమాజంపై వుంది.
డా|| వి.ఎన్.వి.కె.శాస్త్రి,
9849413635