కొన్ని సినిమాలు దేశ సంస్కతిలో భాగం అవుతాయి. కొన్ని ప్రపంచదేశాల ప్రజలందరికీ దగ్గరయి, సరిహద్దులను చెరిపేస్తాయి. అసలు ఆ సినిమాలు అంతగా ఎలా జనంలోకి వెళ్లాయో ఆ సినీవర్గ నిపుణులకే ఒకో సందర్భంలో అర్ధం కాదు. అలాంటి ఓ గొప్ప ప్రజాదరణ పొందిన మ్యూజికల్ ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’. ఈ చిత్ర కథకు మారియా వాన్ ట్రాప్ రాసిన ‘ది స్టోరి ఆఫ్ ది ట్రాప్ ఫామిలీ సింగర్స్’ అనే పుస్తకం ఆధారం. అది ఆమె కుటుంబ కథ. 1949లో ఆమె భర్త జార్జ్ వాన్ ట్రాప్ మరణం తర్వాత ఆమె ఈ పుస్తకం ప్రచురించారు. 1956లో, జర్మన్ నిర్మాత వోల్ఫ్‌గ్యాంగ్ లీబెనినర్ ఈ చిత్ర హక్కులను వి9,000కి కొనుగోలు చేశారు. అలా ‘ది ట్రాప్ ఫ్యామిలీ’ అక్టోబర్ 9, 1956న పశ్చిమ జర్మనీలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. రెండు సంవత్సరాల తర్వాత, లైబెనినర్ ‘ది ట్రాప్ ఫ్యామిలీ ఇన్ అమెరికా’ అనే సీక్వెల్‌కు దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు యుద్ధానంతర సంవత్సరాల్లో పశ్చిమ జర్మనీలో అత్యంత విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. యూరప్, దక్షిణ అమెరికా అంతటా ఈ చిత్రం అభిమానులను సంపాదించింది.
1956లో, పారమౌంట్ పిక్చర్స్ యునైటెడ్ స్టేట్స్ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేసింది. మొదట ఆడ్రీ హెప్బర్న్ ముఖ్యపాత్రగా ఈ సినిమా తీయాలనుకున్నారు. విన్సెంట్ జె. డొనెహ్యూ ఈ కథను మేరీ మార్టిన్ కోసం ఒక రంగస్థల సంగీత నాటకంగా ప్రతిపాదించాడు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ స్టేజ్ మ్యూజికల్ నవంబర్ 16, 1959న న్యూయార్క్ నగరంలోని లంట్-ఫాంటన్నే థియేటర్‌లో ప్రారంభమై, బ్రాడ్‌వేలో 1,443 ప్రదర్శనలు జరుపుకుంది. ఉత్తమ సంగీతంతో సహా ఆరు టోనీ అవార్డులు ఈ నాటకానికి లభించాయి. జూన్ 1960లో, ట్వంటీయత్ సెంచరీ-ఫాక్స్ ఈ స్టేజ్ మ్యూజికల్ హక్కులను కొనుగోలు చేసింది.
అలా 1965లో అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రంగా ”ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్” రిలీజ్ అయింది. ఎర్నెస్ట్ లెమాన్ స్క్రీన్ ప్లే రాస్తే, రాబర్ట్ వైజ్ నిర్మించి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలీ ఆండ్రూస్, క్రిస్టోఫర్ ప్లమ్మర్, రిచర్డ్ హేడెన్, పెగ్గీ వుడ్, చార్మియన్ కార్, ఎలియనోర్ పార్కర్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌లో చిత్ర కథ నడుస్తుంది. జార్జ్ వాన్ ట్రాప్ ఏడుగురు పిల్లల తండ్రి. భార్య మరణం తర్వాత పిల్ల్లలను క్రమశిక్షణతో పెంచడానికి కష్టపడుతూ ఉంటాడు. పిల్లల శతి మించిన అల్లరి వారిని ఏ దారిలోకి నెడుతుందో అన్నది అతని భయం. ఈ పిల్లలకు గవర్నెస్ గా ఉండడానికి సమీప నన్నరీ నుండి మారియా అనే యువతి వస్తుంది. ఈమె అనాధ. సిస్టర్ల మధ్యనే పెరుగుతుంది. ప్రకతి, పాట ఆమె బలహీనతలను. నన్‌గా మారి జీవించాలన్నది ఆమె ఆశయం. కాని అంత చిన్న వయసులో ప్రపంచం చూడకుండా ఆమె ఆ నన్నరీలో ఉండిపోవడం మంచిది కాదని ఆమెను ఉద్యోగం చేయమని ప్రోత్సహిస్తారు అక్కడి మథర్‌లు. అలా మారియా వాన్ ట్రాప్ పిల్లలకు గవర్నెస్‌గా ఆ ఇంట్లో చేరుతుంది. ముందు పిల్లలు ఆమెను భయపెట్టి పంపేయాలని చూస్తారు. కాని ఆమె ఓపిక, పిల్లలతో కలిసిపోయే నేర్పు ఆమెను వారికి దగ్గర చేస్తాయి. పిల్లలు తండ్రి అతి క్రమ శిక్షణ క్రింద నలిగిపోతున్నారని, తండ్రిని ఆకర్షించడానికే అల్లరిని ఆయుధంగా మార్చుకున్నారని మారియా అర్ధం చేసుకుంటుంది.
పిల్లలకు నత్యం, సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిలో ఆమె నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ఒంటరిగా ఉన్న కేప్టెన్ ను వివాహం చేసుకోవాలని ధనిక యువతులు ప్రయత్నిస్తూ ఉంటారు. కేప్టెన్ వారితో స్నేహం చేస్తాడు కాని మానసికంగా వారితో కలవలేక నలిగిపోతూ ఉంటాడు. క్రమంగా అతని మనసులోనూ మారియా చోటు సంపాదించుకుంటుంది. భార్య మరణం తర్వాత సంగీతాన్ని మరచిపోయిన కేప్టేన్ జీవితంలోనూ మారియా కారణంగా పాట ప్రవేశిస్తుంది. టీనేజ్ లోకి అడుగుపెడుతున్న కేప్టెన్ పెద్ద కూతురు జీవితంలో తప్పటడుగు వేయకుండా, పిల్లలు ఆట పాటలతో చదువు నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి విషయంలోనూ మారియా శ్రద్ద తీసుకుని పిల్లలలను క్రమమైన మార్గంలోకి నడిపిస్తుంది.
పిల్లలకు ఆస్ట్రియా సాంప్రదాయ నత్యాన్ని నేర్పిస్తున్న మారియాని చూసిన కేప్టెన్ ఆమెతో కలిసి నత్యం చేస్తాడు. ఆ దగ్గరితనంలో కేప్టేన్ పై తనకున్న ప్రేమ మారియాకు అర్ధం అవుతుంది. కాని అతన్ని వివాహం ఓ ధనవంతురాలైన బారొనెస్‌తో నిర్ణయించబడుతుంది. జార్జ్ చేసుకోబోయే బారొనెస్ అదే ఇంటికి విందుకి వస్తుంది. ఆమె మారియా కేప్టేన్‌ల మధ్య చిగురిస్తున్న ప్రేమను గమనిస్తుంది. మారియా ఆ ఇల్లు వదిలేలా ప్రేరేపిస్తుంది. అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా నన్నరీ చేరిన మారియా మాత్రం కేప్టెన్‌ను మర్చిపోలేకపోతుంది. తన మనసు చెప్పిన దారిలో నడవమని అక్కడి సిస్టర్లు ఆమెను మళ్ళీ వాన్ ట్రాప్ ఇంటికే పంపిస్తారు. మారియా ఆ ఇంటికి రాగానే పిల్లలు, కేప్టెన్ కళ్లల్లో ఉత్సాహాన్ని చూసిన బారోనెస్ ఎంగేజ్మెంట్‌ను రద్దు చేసుకుని వెళ్ళిపోతుంది. వాన్ ట్రాప్ మారియా వివాహం చేసుకుంటారు.
కేప్టేన్ వాన్ ట్రాప్ నాజీ వ్యతిరేకి. జర్మనీ ఆ చుట్టు పక్కల దేశాలు హిట్లర్ ప్రభావంలో మునిగి ఉంటాయి. వాన్ ట్రాప్ నాజి వ్యతిరేక భావాలు ఆ దేశ అధికారులందరికీ తెలుసు. ఆస్ట్రియా నాజీల చేతిలోకి వచ్చాక వాన్ ట్రాప్ కుటుంబాన్ని ఊరు దాటనివ్వకుండా తమ నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు నాజీ అధికారులు. వాన్ ట్రాప్ పిల్లలందరూ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి ఆస్ట్రియా లోని సంగీత ఉత్సవాలలో పాడడానికి అవకాశం ఇస్తాడు వాన్ ట్రాప్ మిత్రుడు. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ ప్రదర్శన తరవాత దేశం వదిలి పారిపోతుంది వాన్ ట్రాప్ కుటుంబం. కొండలలో దాక్కుని ఎన్నో మైళ్ళు నడుస్తూ వాళ్లు స్విట్జర్ లాండ్ చేరుకుంటారు.
నిజానికి ఈ సినిమాకు పాటలు, నత్యాలే అందం. పిల్లలతొ కలిసి మారియా గానం చేసిన జానపద బాణీల గీతాలు, తోలు బొమ్మలాటలు, సాంప్రదాయ నత్యాలు ఆస్ట్రియా జీవిన సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసాయి.
ఈ చిత్రం మొదట్లో సినీ విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకున్నా, వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎంతో ప్రజాదరణ పొందింది, 29 దేశాలలో మునుపటి బాక్స్-ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ నాలుగున్నర సంవత్సరాల పాటు ఒకే థియేటర్‌లో ప్రదర్శించబడింది. అలాగే రెండు విజయవంతమైన పునఃవిడుదలతో చరిత్ర సష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వి286 మిలియన్ల వసూళ్లను సంపాదించిన ఘన కీర్తి దీని సొంతం.
‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడుతో సహా ఐదు అకాడమీ అవార్డులను అందుకుంది. ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, అత్యుత్తమ దర్శకత్వ సాధనకు డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు, ఉత్తమ రచనా అమెరికన్ సంగీతానికి రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డును కూడా ఈ చిత్రాన్ని వరించాయి. హాలీవుడ్ చరిత్రలో ఈ చిత్రం అన్ని కాలాలలోనూ గొప్ప చిత్రాలలో ఒకటిగా నేటికీ పరిగణించబడుతుంది. 1998లో, అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (Aఖీ×) ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌ను అన్ని కాలాలలోనూ 55వ గొప్ప అమెరికన్ చిత్రంగానూ, నాల్గవ గొప్ప చలనచిత్ర సంగీత చిత్రంగానూ జాబితాలో చేర్చింది. 2001లో, యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ చిత్రాన్ని నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో సంరక్షణ కోసం ఎంపిక చేసింది.
నిజానికి ఈ సినిమాలో నటించడం, జార్జ్ వాన్ ట్రాప్‌గా నటించిన కిస్టఫర్ ప్లమ్మర్‌కు అస్సలు ఇష్టం లేదు. ఇది లాజిక్ లేని చెత్త సినిమా అని అతను సినిమా పూర్తి అయ్యేదాకా అంటూనే ఉన్నాడట. ఇది ఎందుకు అంత పెద్ద హిట్‌గా నిలిచి అన్ని తరాలకు నచ్చిందో తనెకెప్పుడు అర్ధం కాలేదని అతను ఎన్నో సార్లు చెప్పాడు కూడా. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు థియేటర్ ఆర్టిస్టులు అయి ఉండాలన్నది దర్శకుల అభిప్రాయం. అలాగే సినిమా అంతకు ముందు వేల ప్రదర్శనలు ఇచ్చిన నాటక శైలికి భిన్నంగా ఉండాలనీ ఆయన భావించారు. ఈ సినిమాలో నటించబోయే ముందు జూలీ ఆండ్రూస్, క్రిస్టఫర్ ప్లమ్మర్ల గురించి సినిమా రంగానికి పెద్దగా తెలీదు. అది ఈ సినిమా విషయంలో వారికి అక్కరకు వచ్చింది అంటారు. అందమైన ప్రకతి, చిన్న పిల్లల అమాయకత్వం, మంద్రమైన సంగీతం, సాంప్రదాయ జీవనం ఎప్పటికీ జనాలని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కలగలసి ఉన్న సినిమా ”ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్”. అందుకే ఇది అన్ని తరాల ప్రేక్షకులని ఇప్పటిదాకా అలరిస్తూనే ఉంది.
నిజ జీవితంలో మారియా ఏడుగురి పిల్లల కోసం కాక స్కార్లెట్ ఫీవర్‌తో బాధపడుతున్న మారియా ఫ్రాన్జిస్కాని చూసుకోవడం కోసమే ఆ ఇంటికి వస్తుంది. జీవితంలో నిలకడ కోసం, అవసరం కోసం మాత్రమే తాను వాన్‌ట్రాప్‌ని పెళ్లి చేసుకున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు రక్షణ, అతనికి భార్య కావలసి మాట్లాడుకుని తాము దంపతులు అయ్యామని, కాని అతనితో జీవిస్తూ అతన్ని ప్రేమించడం నేర్చుకున్నానని, మారియా నిజాయితీగా ఒప్పుకుంది. నిజానికి తాను కేప్టేన్ కన్నా పిల్లలకు ఎక్కువ ఆకర్షితురాలినయ్యానని, వారి కోసమే ఈ వివాహం చేసుకున్నానని చెప్పింది. జార్జ్ ని పెళ్ళి చేసుకున్నాక ఈమె ముగ్గురు పిల్లల తల్లి కూడా అయింది.
ఈమె రాసుకున్న కుటుంబ కథను అందమైన ప్రేమ కథగా సినీ దర్శకులు రాబర్ట్ వైజ్ మార్చారు. నిజ జీవితంలో వాన్ ట్రాప్ సినిమాలో చూపించినంత ధనవంతుడు కాదు. కాని నిజంగా నాజీలను వ్యతిరేకించాడు. అందుకే అన్నీ పోగొట్టుకుని రైలులో ఈ కుటుంబం ఇటలీ పారిపోవలసి వచ్చింది. సినిమాలో మాత్రం వీరంతా పర్వతాల నడుమ నడుచుకుంటూ దేశం వదిలారని చూపించారు దర్శకులు. గ్రేట్ డిప్రెషన్‌లో ఆస్థి అంతా పోగొట్టుకుని మొత్తం కుటుంబం తమ గాన ప్రదర్శనలతో డబ్బు సంపాదించుకుంటూ కొన్నాళ్లు గడిపారు. దర్శకులు ఈ కథను కొంటూ తాను దీన్ని ఒక మంచి డ్రామాగా మార్చబోతున్నానని, వారి కుటుంబంపై డాక్యుమెంటరీలా కాక ఓ అందమైన ప్రేమ కథగా దాన్నితీర్చబోతున్నానని మారియా దగ్గర అనుమతి తీసుకున్నారు. ఆస్ట్రియాలో ఇప్పటికీ ఈ సినిమా షఉట్ చేసిన స్థలాలన్నిటిని చూపించే టూర్ ఉంది. ఆ దేశం వెళ్లిన చాలా మంది యాత్రికులు ముందు ఈ టూర్ ఎంచుకుంటారు.
”ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్” చిత్రం సౌండ్‌ట్రాక్ కు, రోడ్జర్స్, హామర్‌స్టెయిన్ సంగీతం, సాహిత్యాన్ని అందించారు. ఇది 1965లో =జA విక్టర్ ద్వారా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడైంది. సంగీత చరిత్రలో అత్యంత విజయవంతమైన సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌లలో ఇది ఒకటి. ఈ సౌండ్‌ట్రాక్ ను జర్మన్, ఇటాలియన్, స్పానిష్ , ఫ్రెంచ్ భాషలలోనూ విడుదల చేసారు. యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి రెండు వారాల్లోనే 500,000 కాపీలు అమ్ముడై ఇది చరిత్ర సష్టించింది. జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు ఫిన్లాండ్‌లో 10,000 యూనిట్లకు పైగా అమ్ముడైన మొదటి ఆల్బమ్‌గా రికార్డుకెక్కింది. ఇందులో పాటలన్నీ నటులే పాడుకున్నారు. జూలీ ఆండ్రూస్, పిల్లల పాత్రల్లో నటించిన చిన్నారులందరూ వారి సంగీత ప్రతిభ కారణంగనే ఈ సినిమాకు ఎన్నికయ్యారు. క్రిస్టఫర్ ప్లమ్మర్ సొంతంగా పాడుకున్నా అతనికి మాత్రం పాటలో బిల్ లీ ప్లేబాక్ అందించారు. ఈ సినిమా జర్మనీ ఆస్ట్రియా ప్రజలకు అంతగా నచ్చలేదు. ఈ అమెరికన్ చిత్రం కంటే జర్మన్ భాషలో వచ్చిన మొదటి చిత్రాలకే ఆ దేశంలో నేటికీ ఆదరణ ఎక్కువ.
ప్రపంచ సినీ అభిమానులు ఏకగ్రీవంగా ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ఇంగ్లీష్ భాషలో వచ్చిన అత్యుత్తమ చిత్రం అని ఒప్పుకుంటారు. ఈ కథ ప్రభావంతో ఎన్నో ఇతర భాషా చిత్రాలు వచ్చాయి. హిందీలో ‘పరిచరు’, తెలుగులో వచ్చిన ‘రావుగారిల్లు’ ఈ సినిమాకు భారతీయులిచ్చిన నివాళిగా చెప్పుకోవచ్చు. ‘డో రే మే’, ‘ది లోన్లీ గోట్ హడ్’, ‘మారియా’, ‘ఐయామ్ సిక్స్టీన్’, ‘మై ఫేవరేట్ థింగ్స్’, లాంటి పాటలు నేటీ జెన్ జీలనూ ఆకర్షిస్తున్నాయి.
– పి.జ్యోతి,
98853 84740



