Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజనింగికేగిన వేగుచుక్క

నింగికేగిన వేగుచుక్క

- Advertisement -

నివాళి
గుజరాత్‌ గేయం పుస్తకావిష్కరణ సభ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన్‌ భవన్లో అంటే 2002 లో మేం కలుసుకున్నాం. అప్పటికి రజిత తెలంగాణలో ఓ పెద్ద రచయిత్రిగా ఎదిగింది. అప్పటికే ఆమె కలం నుండి అనేక కవితా సంపుటాలు, హైకూలు నానీలు దీర్ఘ కవితలు, కథలు వెలువడుతున్నై. ఆమె స్వంత రచనలతో పాటు సామాజిక పరిస్థితులను అనుసరించి అనేక పుస్తకాలకు ఎంతోమంది రచయితలను కూడగట్టుకొని శ్రమించి సంపాదకత్వం వహించింది. కొత్త కొత్త రచయితలకు కవులకు ఆమె ఒక స్ఫూర్తి. ఒక ఉత్సాహం ఒక ధైర్యం. భూమిక బహుళ కొలిమి వంటి పత్రికలలో సంపాదక వర్గ సభ్యురాలు. నవచేతన చేపట్టిన తెలంగాణ రచయితల కథా సంకలనానికి, అమత లత చేపట్టిన కథలే వెతలై సంకలనానికి ఎంతో శ్రద్ధ తీసుకొని తెలంగాణ రచయిత్రులకు దారి దీపమైంది. మలితరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న కాలంలోనే జిగర్‌, ఉద్విగ కవితా సంకలనాలను తీసుకొచ్చింది.
కరోనాకాలంలో ఆమె ఆధ్వర్యంలోనే మేమంతా కలిసి కరోనా కథలు అనే పుస్తక సంకలనాన్ని తీసుకొచ్చినం. ఇప్పుడు సమాజానికి ఏదో సహకరించాలి తోడ్పడాలి అనే తపన కలిగిన రజిత రెండు సంవత్సరాల క్రితం ఇదంతా వ్యవస్థపై ఎంతో మందితో చర్చించి కూడగట్టుకొని కథలు నవలలు అనుభవాలు ఆధారంగా ఓ సంకలనాన్ని తీసుకొచ్చింది. ఆ సంకలనం నిజంగా మాకు ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చింది.
మనలో మనంగా ప్రారంభమై 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికలో ఆమెది చాలా కీలకమైన పాత్ర. ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ అధ్యక్షురాలు గానే ఊపిరి విడిచింది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యవస్థాపక సభ్యురాలు ఒకరైన కాత్యాయని విద్మహే ఇంటినుండే ఆమె అంతిమయాత్ర కొనసాగడం మరో విశేషం.
కేవలం సాహిత్యంతో సమాజాన్ని చైతన్య పరచడమే కాకుండా అనాధ వ్యక్తులకు అనాధ శరణాలయాలకు ఎన్నో దానధర్మాలు చేసేది. కొంతమంది అనాధల చదువు బాధ్యతను తీసుకున్నట్టుగా కూడా గుర్తు.
సీనియర్‌ రచయితలను వారి కుటుంబ సభ్యులను గౌరవించడం ఆమె వ్యక్తిత్వంలో మరో భాగం. యశోద రెడ్డి గారు చనిపోయేంతవరకు ఓ కూతురుగా కొనసాగింది. హైదరాబాద్‌ కు వచ్చిన ప్రతిసారి ముదిగంటి సుజాత రెడ్డి గారిని, దాశరథి రంగాచార్య గారి సతీమణిని కలవడం ఆమెకు ఆనవాయితీ. ఈనెల 18న కూడా శారదా శ్రీనివాసన్‌ గారి బర్త్‌ డే ను ఆమెని నివసిస్తున్న సాకేత్‌ నిలయంలో జరపాలని కుతూహల పడ్డది. పెద్దవాళ్లు కనుమరుగవుతారేమో అనే ఆలోచనతో వాళ్లను తరచుగా కలిసే ప్రయత్నం చేసే రజిత తానే కనుమరుగైపోయింది.
ఓపాట, ఓ రచయిత, ఓ కథకురాలు, ఓ దీనజన బాంధవి, ప్రకతి ప్రేమికురాలు, ఓ ధిక్కార స్వరం
పుటుక నీది
చావు నీది
బతుకంతా దేశానిది అని కాళోజి చెప్పినట్టు నింగిలో వేగుచుక్కగా వెళ్ళిపోయింది. అయినా అవయదానం చేసి వైద్య విద్యార్థులకు పాఠం చెబుతూ, నేత్రదానంతో తాను కోరుకున్న సమాజం కోసం నిరీక్షిస్తూ రజిత మనతోనే ఉంది అన్న ఆశతో నివాళులర్పిస్తూ.
– తిరునగరి దేవకిదేవి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad