ప్రేమకథలు కాని తెలుగు సినిమాలు చాలా తక్కువ. ప్రతి సినిమా ఇద్దరు ప్రేమికుల చుట్టూ అల్లుకునేదే కదా! విషాద సుఖాంతాలే కాక, ఎన్నో ఎన్నో మలుపులు, మెరుపులు కోకొల్లలు. ఊహలు, మోహాలు, వన్‌సైడ్, మల్టీసైడ్ ప్రేమలు, డ్యూయెట్లు, ఫైట్లు అబ్బో.. ఇంకా ఐటెం సాంగ్సూ, ఊహించని క్లైమాక్సు ఒక్కటేమిటి?.. అన్నన్ని ఉన్నా ఇప్పటి సినిమాలు హృదయాన్ని ఇసుమంతా కదిలించవు. అసలు అక్కడిదాక వెళ్ళనే వెళ్ళవు. అంతేకాక వాస్తవిక జీవితపు ఏ పార్శ్వమూ ఏ మాత్రమూ కనిపించదు.
అలాంటి సినిమాలకు భిన్నంగా.. ఒక ప్రత్యామ్నాయ సినిమాను తెలుగు తెరకెక్కించారు అక్కినేని కుటుంబరావు. అదే, ”ఓ మంచి ప్రేమకథ”.
ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కథ, మాటలు, పాటలు అందించగా, కుటుంబరావు దర్శకత్వం వహించగా, పోపూరు హిమాంశు నిర్మించారు. ఈటీవీ విన్‌లో విడుదలైంది.
రోజూ మనం వింటున్న కథే. మన ఇండ్లలోనూ జరుగుతున్న కథే. ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్న వ్యథే. అలాంటి వస్తువునే తీసుకుని చాలా గొప్పగా చర్చించి, పరిష్కరించి ప్రేమకథను చేశారు రచయిత్రి. సినిమాలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయని సాధారణంగా అంటుంటారు. ప్రతిబింబించటమే కాక ప్రతి కూలంగా, విపరీతంగానూ మారింది, అది వేరే విషయం.
కానీ ఈ సినిమా సమాజంలో సమస్యగా మారిన అంశాన్ని తీసుకుని, శాస్త్రీయంగా విశ్లేషించి, సృజనాత్మకంగా తీర్చిన చిత్రం ఇది. పెట్టుబడిదారీ సమాజంలో సాంకేతికత విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. అందులో ఐటి, సాఫ్ట్‌వేర్ రంగం పెరిగిపోయిన సందర్భంలో మధ్య తరగతి సమూహాలు వీటిని బాగా అందిపుచ్చుకుని ఎదిగారు.
ఈ ఎదుగుదలలో ఒత్తిడిలో కుంగుబాటూ ఎదిగింది. పెట్టుబడికి లాభం తప్ప మరే సంబంధమూ ఉండదు. అది మనుషుల శరీరాలను, మనుషుల మధ్య మానవీయ సంబంధాలనూ అన్నిటినీ ధ్వంసం చేస్తుంది.
ఆ విధ్వంసంలో మనమంతా ఉంటాం. అందులోంచి వచ్చిన ఒక సమస్య.. తల్లిదండ్రులు ముసలి వాళ్లయ్యాక వారిని చూసుకోవడం. ప్రేమను పంచి, పెంచిన వారిని చివరి మజిలిలో ప్రేమగా చూసుకోవడం ఇపుడంతటా మాయమైపోయింది. ఉద్యోగం పేరుతో విదేశమో, వేరే రాష్ట్రమో వెళతారు.
భార్యాభర్తలూ ఉద్యోగం చేయటమూ అవసరమవుద్ది. ఒక్క తల్లిదండ్రులనే కాదు, పిల్లలనూ చూసుకోవడమూ మానేసారు. ఈ విషయాలన్నిటినీ చాలా హృద్యంగా దృశ్యమానం చేశారు.
పనుల్లో పడి, సంపాదనల్లో పడి, ఒత్తిళ్ళలో పైపైకి పోవాలనే ఆరాటంలోపడి పోగొట్టుకుంటున్నదేమిటి?. జీవితంలో మిగలాల్సిన మధురమైన జ్ఞాపకాలకు అవకాశం ఇస్తున్నామా?, ఎవరినో చూసుకోవడం కాదు, మనకు మనం మిగులు తున్నామా?.. ఇవీ ప్రశ్నలు.
సమూహపు మానవ సంబంధాల్లోంచే మనుషులుగా రూపుదిద్దు కున్నాము. కానీ మనల్ని మనమే కోల్పోతూ ఒంటరిగా మిగులుతున్న తీరును ఈ ప్రేమకథలో ఎంతో సున్నితంగా స్పష్టంగా ఎరుకపరుస్తారు. విషయం మనల్ని వెన్నాడుతున్నదే కావచ్చు. చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది. కథాంశానికి సంబంధించిన సన్నివేశాలలో సంభాషణలు మనల్ని వెన్నాడుతూ ఉంటాయి.
అనేకానేక మానసిక సమస్యలకు, డిప్రెషన్స్‌కు డాక్టర్స్ సైతం ప్రిస్కైబ్ చేసింది ప్రేమ ఒక్కటే. అది మందుల షాపులో దొరికేదికాదు. లవ్ పిల్స్ ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. అన్ని డిఫీసియెన్సీలలాగే ‘లవ్ డిఫిసియెన్సీ’ ఒకటని రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. పిల్లల్ని కని పెంచడానికి కంపెనీలు సెలవులు ఇస్తాయి. అవి కూడా పోరాడే సాధించుకున్నారు.
మరి తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి సెలవులెందుకు ఇవ్వరు? అనే ప్రశ్నలకు ఒక అవగాహనతో సమాధానాన్ని సంభాషణల్లో నడిపించడం ఓల్గాకే సాధ్యపడింది.
ఈ చిన్న సినిమాలోనే స్త్రీ, పురుష సంబంధాల గురించి, కుల సమస్యను గురించి, ఆత్మగౌరవాల గురించి కూడా సినిమా చర్చిస్తుంది.
ఇందులో తల్లిలా ప్రధాన పోషించిన రోహిణి అట్టంగడి చాలా అద్భుతంగా నటించారు. కూతురు సుజాతగా పాత్ర పోషించిన ప్రముఖ నటి రోహిణి నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. సముద్రఖని పాత్రలో ఒదిగిపోయారు. అందరూ చాలా సహజంగా నటించారు. సంగీతం బాగుంది. కథను తెరకెక్కించిన దర్శకులు కుటుంబరావు అనవసర సన్నివేశాలకు తావివ్వకుండా కథను బాగా నడిపించడంలో విజయం సాధించారు. అయితే కథలో భాగంగా కొంత హాస్యాన్ని జోడిస్తే బాగుండనిపిస్తుంది. ఉన్నత అభిరుచిగల పాఠకులకు ఉత్తమ చిత్రమిది. అంతేకాక ఉత్తమ పాఠక అభిరుచులను పెంచే చిత్రం కూడా. ప్రజలందరూ చూడాల్సిన చిత్రం ”ఒక మంచి ప్రేమకథ”.
- కె.ఆనందాచారి