కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ప్రపంచ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలకు వందలు, వేల ఎకరాలు కేటాయిస్తున్నాయి. అందుకోసం వ్యవసాయ భూములు, నివాస స్థలాలను సేకరించడమే కాకుండా.. అడవులనూ అప్పనంగా అప్పగించేస్తున్నాయి. దీంతో పర్యావరణానికి తీవ్ర హాని తలపెడుతున్నాయి. ‘అభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ’ను సమతుల్యత లేకపోవడంతో ఈ పరిస్థితులు దాపురి స్తున్నాయి. నేడు ప్రపంచ టాప్ టెన్ కాలుష్య నగరాల్లో ఐదు నుంచి ఏడు వరకు నగరాలు భారతదేశంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ నగరాల్లో నమోదవుతున్న ఏక్యూఐ స్థాయిలు ప్రజా రోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి.
పారిశ్రామిక కాలుష్యం వల్ల రాజస్థాన్‌లోని బివాడిలో 300 నుంచి 400 మధ్య ఏక్యూఐ నమోదవు తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే శీతాకాలంలో ఏక్యూఐ 400 నుంచి 500 వరకు చేరుకుంటున్నది. వాహనాల పొగ, నిర్మాణ ధూళి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పొగమంచు ఆ నగర గాలిని ప్రమా దకరంగా మారుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్, నోయిడా నగరాల్లో కూడా ఏక్యూఐ తరచూ 250 నుంచి 350 మధ్య ఉంటున్నది. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్ నగరాల్లో వేగవంతమైన పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ కారణంగా ఏక్యూఐ 200 నుంచి 300 మధ్య కొనసాగుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నా.. పాలకులు తగినంత చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా మహమ్మారిలా విస్తరిస్తున్నది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, పిల్లల్లో అస్తమా కేసులు పెరుగుతున్నాయి. నగరాల్లో పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎన్నికల రాజకీయాల్లో పెద్ద అంశాలుగా మారడం లేదు. రోడ్లు, వంతెనలు, పరిశ్రమల అభివృద్ధి గురించి పెద్ద హామీలు వినిపిస్తున్నాయే కానీ.. కాలు ష్యాన్ని ఎలా నియంత్రిస్తామన్న స్పష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదు. రైతు, ఉద్యోగం, కులం, మతం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అసలు సమస్యలు పక్కదారి పడుతు న్నాయి. పర్యావరణం ప్రభావం చూపే అంశంగా రాజకీయ నేతలు భావించడం లేదు. దీన్ని ప్రచారా స్త్రంగా కూడా చూడటం లేదు. పర్యావరణ పరిరక్షణ ఫలితాలు ఐదేళ్లలో కనిపించవు. అవి దీర్ఘకాలంలో మాత్రమే తెలుస్తాయి. అవి ప్రజలను ఎలా ప్రభావితం చేయగలుగుతాయి? ఈప్రశ్నలే పాలకుల నిర్లక్ష్యధోరణికి కారణాలు.
ప్రపంచంలోనే అతి పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాలపై కేంద్ర నిర్ణయాలు, న్యాయస్థానం వాదనలు కొత్త సమస్యలు తీసుకొచ్చాయి. తాజాగా సుప్రీం చెప్పిన అంశాలపై వెనక్కు తగ్గినా కార్పొరేట్ల కన్ను పడింది గనుక వారి వ్యూహాలు కూడా వేరే ఉంటాయి. దీనికి పాలకుల అసమర్థ విధానాలే పర్యావరణ ముప్పుకు అవకాశాన్నిస్తున్నాయి. ఆరావళి పర్వతాలు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో వాతా వరణ సమతుల్యను కాపాడడంలో కీలకపాత్ర పోషి స్తాయి. అయితే గనుల తవ్వకాలు, నిర్మాణ ప్రాజెక్టుల పేరిట ఈ ప్రాంతంలో జరుగుతున్న మార్పులు పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలో పర్యావరణానికి జరుగుతున్న హానిని గుర్తించిన జెన్ జీ (యువత) బయటకు వచ్చి నిరసనలు తెలపడమే కాకుండా ‘సేవ్ ఆరావళి’ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ నిరసన తెలుపుతున్నది. అమలు చేయలేని వాగ్దానాలపై ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ, ‘మీ పిల్లలకు స్వచ్ఛమైన గాలిని, కలుషితం లేని నీటిని అందిస్తాం’ అనే అంశాలు రాజకీయ పార్టీలకు, నాయకులకు కనిపించడం లేదు. అయితే ఐదేళ్ల కాలపరిమితితో ఆలోచించే నేతలకు దీర్ఘకాలిక దృష్టి లేకపోవడం అసలు సమస్య. ప్రజలు కూడా ఆ వైపు ఆలోచించకపోవడం మరో సమస్య. అంతేకాకుండా పారిశ్రామికవేత్తల విరాళాలపై నడిచే రాజకీయ వ్యవస్థ, పర్యావరణ చట్టాలను కఠినతరం చేయడానికి వెనకాడుతున్నది. ప్రజల డిమాండ్లలో మార్పు వస్తేనే.. రాజకీయ పార్టీల ప్రాధాన్యతల్లో మార్పు వస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలతో కూడిన స్పష్టమైన హామీలు ఇచ్చే నేతలు, పార్టీలకు ప్రజలు మద్దతు తెలిపితే.. రాజ కీయ పార్టీలు, నాయకుల్లోనూ మార్పు వచ్చే అవకాశముంటుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణ జరిగి భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. ఓటర్లు ప్రశ్నిస్తేనే రాజకీయాలు మారుతాయి. అయితే పర్యావరణ రూపంలో దేశంలో ముప్పు ముంచు కొస్తున్నది. ఆ మార్పు ఆలస్యమైతే దాని మూల్యం భవిష్యత్తుతరం చెల్లించాల్సి ఉంటుంది.
– మహమ్మద్ ఆరిఫ్
7013147990
ప్రజారోగ్యానికి పరిణమిస్తున్న ముప్పు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



