నవతెలంగాణ – హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించాడు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జూన్ 4న జరిగిన ఈ దుర్ఘటన జీవితంలో మర్చిపోలేనిదని, ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన రోజు విషాదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆర్‌సీబీ అధికారిక వెబ్‌సైట్‌లో విరాట్ ఒక ప్రకటన విడుదల చేశాడు.
“జూన్ 4న జరిగిన ఘటన లాంటి హృదయవిదారక సంఘటనకు మానసికంగా సిద్ధమవడం ఎవరికీ సాధ్యం కాదు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే గొప్పగా నిలవాల్సిన క్షణం, విషాదంగా ముగిసింది. ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం, గాయపడిన అభిమానుల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వారి నష్టం ఇప్పుడు మా కథలో ఒక భాగం. మేమంతా కలిసి బాధ్యతతో, గౌరవంతో ముందుకు సాగుతాం” అని కోహ్లీ తన ప్రకటనలో పేర్కొన్నాడు.