Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజహృదయ కంపనల హృద్యమైన చిత్రణ

హృదయ కంపనల హృద్యమైన చిత్రణ

- Advertisement -

విజయచంద్ర కొత్త కవితా సంపుటి ‘ఓంకార’ ఆకట్టుకుంది. భాషను సెకండరీ చేసి, భావాలకే పెద్దపీట వేశాడు కవి. ఆ భావాలు కూడా కొన్ని అరుదైనవి. అంటే, మనం చదివే ఎన్నో కవితలలో కనిపించే భావాల వంటివి కావన్న మాట. సరళమైన భాషకు సహజత్వం తోడైంది. డిక్షన్‌లో చాలా వరకు అనుకరణ లేదు. ఓ వంద కవితా సంపుటులను చదివి ఒరిజినాలిటీ, ఆర్ద్రత లేని కవిత్వం రాసే రకం కవి కాదు ఈయన.
ముఖ్యంగా ఇందులోని కొన్ని కవితా వస్తువులు ఈయనను ఇతర కవుల నుండి వేరు చేస్తాయి. అవి అరుదైనవి, సార్వజనీనతను (universalityని) కలిగి ఉన్నవి. కర్రీ ఫ్రై, కునేగా మరికొళందు సెంటు, డిసెంబర్‌ చలి, క్రిస్మస్‌, పది నిమిషాలే మొదలైన కొన్నిటిని ఉదాహరణలుగా చూపవచ్చు. వీటిలోని వస్తువులలో కొత్తదనముంది. ఇవి అరిగిపోయిన కవితా వస్తువులు కావు.
నాకనిపిస్తుంది/ మనందరిలో ఒక జాగిలం/ సదా దాగి ఉంటుంది
వాసన పసిగట్టి/ ఎంత దూరమైనా వెంబడిస్తుంది
మనం వెతుక్కోవాలి/ మనవారి కోసం
అది క్షణభంగుర ఆనందం/ కోసమైనా/ శాశ్వత సహచర్యం/ కోసమైనా వెతుకులాట తప్పదు (కునేగా మరికొళందు సెంటు, పేజీలు 81,82)
అమూర్త అంశాలను (abర్‌తీaష్‌ వఅ్‌ఱ్‌ఱవర ను) వస్తువులుగా స్వీకరించడం సాధారణత్వం నుండి దూరంగా జరగడానికి సమానం అనవచ్చునేమో. ఐతే, అది మాత్రమే సరిపోదు. ఎంచుకున్న సబ్జెక్ట్‌ కు ఊహల ద్వారా, డిక్షన్‌ ద్వారా న్యాయం చేకూర్చాలి. ఈ విషంలో ఈ కవి సఫలమయ్యాడు.
మాటల పొదుపు ఈ కవిలోని మరొక మంచి అంశం. ఈ కవితను పరిశీలించండి:
కిటికీలు/ తలుపులు/ నిద్రపోతూ/ ఉష్‌/ లేపకు/ ఏమి గాలి/ ఏమి గాలి/ పగబట్టినట్టు/ మంచు భూతం/ పళ్ళు/ పటపటలాడించి/ కొరికేస్తూ/ దారంతా/ అగోచరం/ తలపై తుంపర్లు/ గజ గజ/ వణుకు / యువకుడిని/ ముసలివాడిలా/ మార్చే/ అజాత్య భీతి/ ఉండుండి/ దూరం నుంచి/ పాము బుస / మెదడును చుట్టేస్తూ/ కాలరును/ ఎగరేస్తూ ధనుర్మాసపు గాలి
ఈ చలి ప్రియురాలైతే/ ఎంత బాగుణ్ణు/ గొణుక్కున్నాడొక
నవ యువకుడు
జివాన్‌ నామ్‌ డుంగ్‌ అనే నేపాలీ కవి రాసిన ‘మళ్ళీ హిమపాతం’కు ఈ సమీక్షకుడు చేసిన అనువాదం గుర్తుకు వచ్చింది, ఈ కవితను చదివితే. క్రిస్మస్‌ కవితలో కూడా ఇటువంటి మంచి లక్షణాలే ఉన్నాయి. పది నిమిషాలే అన్న కవితలో మంచి భావుకత కనిపిస్తుంది.
ఆకులు ఆకులతో/ సంభాషించుకొనే/ మనోహర దశ్యం
ప్రాకతిక బంధనం/ అగ్యాత సీమల్లో/ ఆనందాన్ని/ తట్టిలేపుతుంది (పేజీ 153)
పియానో అమ్మాయి కవితలో పాఠకుని ఊహశక్తిని పరీక్షకు పెట్టడం బాగుంది. డైరీ కవితలులో మొదటిది విలక్షణంగా ఉంది. చింతపండు వాసన చూసినప్పుడల్లా/ అడివి వాసన గుప్పుమంటుంది, అంటాడు కవి. రుతువు కవితలో ‘దేశం వికలాంగుల సీమగా మారింది/ నేడిది మరణ శయ్య,’ అనే పంక్తులలో వాడిమీ వేడిమీ చోటు చేసుకున్నాయి. ఆః అనే కవితలో నాస్టాల్జియా తాలూకు మెలాంకలీ ద్యోతకమైంది. కవులు పిచ్చివాళ్ళు/ నాలా గతించిన జ్ఞాపకాల కోసం/ రోడ్ల వెంబడి తిరుగుతారు, అని లోపలి దుఃఖాన్ని బయటకు తోడుతాడు కవి. పుస్తకం చివరన ఉన్న ఐదు అనువాద కవితలు కూడా బాగున్నాయి.
ఈ కవి కొన్ని పదాలలోని సంయుక్తాక్షరాలను తన ఇష్టానికి అనుగుణంగా మార్చి రాయడం మనం గమనించవచ్చు. త్రుణమూలాలు, క్రుశించడం, విగ్యప్తులు, మ్రుగ్యం, గ్యాపకాలు, సంజ్యలు, జ్యానులు లాంటివి ఉదాహరణలు. ఇవి కవి ప్రయోగించిన ఉద్దేశపూర్వక వ్యత్యాసాలు(intentional variations). కానీ, చమత్కారాన్ని వెలయిస్తూ స్వాతంత్య్రంకు బదులు స్వాహతంత్రం అని రాయడాన్ని తప్పు పట్టలేం. నిజానికి అది బాగుంది.
తెలుగు దేశపు సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ మాతభాష మీద మమకారాన్ని వదులుకోక, సాహితీరంగంలో నిరంతరం కషి చేసే ఇటువంటివారందరూ అభినందనీయులే. ఎందుకంటే, మరో రాష్ట్రపు భాషను రోజూ వింటుంటారు వీళ్లు. అది తమను కబళించకుండా ప్రతిఘటించాలి.
భవిష్యత్తులో విజయచంద్ర ఇలాగే మరిన్ని మంచి రచనలు చేసి విజయం సాధించాలని ఆశిస్తున్నాను.

– ఎలనాగ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad