Sunday, December 28, 2025
E-PAPER
Homeమానవిఓల్గాకు ఆత్మీయ కానుక

ఓల్గాకు ఆత్మీయ కానుక

- Advertisement -

తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీవాద ఉద్యమానికి చిరస్థాయి చిహ్నంగా నిలిచిన అసాధారణ రచయిత్రి ఓల్గా. ఆమె ప్రతి రచన స్త్రీ మనసు లోతుల్లోకి వెళ్లి పితృస్వామ్య గొలుసులను ధిక్కరిస్తుంది. మానసిక స్వాతంత్య్రానికి, స్వేచ్ఛా చైతన్యానికి జెండా ఎగురవేసింది. సమాజంలో లింగ వివక్షలు, అణచివేతలు ఎదుర్కొంటున్న స్త్రీల గొంతుకను వినిపించింది. సాహిత్యానికి, సామాజిక రాజకీయ చైతన్యానికి మారు పేరుగా ఉన్న ఖమ్మం పట్టణంలో ‘ఖమ్మం స్వేచ్ఛావరణం’ పేర మహిళా స్నేహబృందం ‘ఓల్గా లలిత కళా ఉత్సవం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఓల్గా తీరం పుస్తక ఆవిష్కరణ జరుగుతోంది.

మాట్లాడలేని, వెల్లడించలేని మహిళల మనోగతాలను, వేదనను, బాధలను, దు:ఖాలను, ఉద్వేగాన్ని, ఉద్రేకాలను, ఆవేశాన్ని, ఆకాంక్షలను అనేకానేక ఆలోచనలను ఓల్గాగారు తన గొంతుకలో పలికించారు, ప్రకటించారు. స్త్రీ స్వేచ్ఛావరణ సామూహిక స్వరంగా మోగిన కలం ఆమెది. అక్షరాలను ఆయుధం చేసుకుని తరతరాల ఆధిపత్యాలపై యుద్ధం చేసిన యోధ ఆమె.

స్త్రీవాదానికి బీజం
1970లో ‘విప్లవ రచయితల వేదిక’లో విప్లవ కవిత్వంతో సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు ఓల్గా. తర్వాత స్త్రీవాద దక్పథానికి మలిచారు. ఇది తెలుగు సాహిత్యంలో మొదటి స్త్రీవాద ఉద్యమానికి బీజం వేసింది. ‘స్వేచ్ఛ’ నవల ద్వారా సాహిత్య ప్రపంచాన్ని కదిలించారు. స్త్రీల స్వయం సమర్థత, మానసిక స్వాతంత్య్రం గురించి ధైర్యవంతమైన చర్చలు రేకెత్తించాయి. ‘వాళ్ళు ఆరుగురు’ నాటకం పురుష ఆలోచనా విధానాల్లో మార్పు తీసుకురావడమే కాకుండా, ఆమె రాజకీయ కథలు సమాజంలోని లింగ అసమానతలను సూటిగా ప్రశ్నించాయి.

ఐక్యతకు పిలుపు
ఓల్గా మార్క్సిజం, ఫెమినిజం మధ్య సతుల్యత చూపారు. ”స్త్రీవాదం పురుష వ్యతిరేకం కాదు, పితృస్వామ్యానికి వ్యతిరేకం” అని గట్టిగా ప్రకటించారు. బౌద్ధ సన్యాసినుల నుంచి ఆధునిక స్త్రీవాద ఉద్యమాల వరకు పరిశోధించి, స్త్రీల చరిత్రను పునర్నిర్మించారు. ఆమె ప్రతి రచనా తెలుగు సమాజంలోని స్త్రీ అణచివేతలను బహిర్గతం చేసింది. లైంగిక దాడులు, దైవశాపాలు, కుటుంబ గోడవలు వివాహ వ్యవస్థలు, పితృస్వామ్య రాజకీయాలను ఎత్తి చూపి, సోదరీ సోదరీ ఐక్యతకు శక్తివంతమైన పిలుపునిచ్చారు. ఆమె రచనలు స్త్రీలకు మాత్రమే కాకుండా, పురుషుల్లో కూడా ఆలోచనాత్మక మార్పును తీసుకువచ్చాయి.

విప్లవాత్మక మార్పు
కొందరు విమర్శకులు ఓల్గాను ‘పురుష వ్యతిరేకి’గా, ‘అతిగా ఆలోచనాత్మకమైన’ రచయిత్రిగా చూపిస్తూ దాడులు చేశారు. కానీ ఆమె ఈ విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని, ఆనువాదాలు, వర్క్‌ షాప్‌ లు, సెమినార్ల ద్వారా స్త్రీ సాహిత్య చరిత్రను రూపొందించారు. ఇలా ఆమె పోరాటం తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పుకు కారణమైంది. ఈ రోజుకు కూడా ఆమె రచనలు లింగ సమానత్వ చర్చలకు, స్త్రీవాద ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. తెలుగు స్త్రీవాద సాహిత్యంలో ఆమె మొదటి జెండా. ఓల్గా ఆలోచనలు, రచనలు నేటి తరాన్ని భవిష్యత్‌ సమాజాన్ని మార్చే దిశగా రూపొందాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

చంద్రునికో నూలుపోగు
మన మధ్య మనతోనే వుంటూ మహౌన్నత శిఖరాలకు ఎదిగిన నిత్య సాహిత్య కళా సృజనశీలి ఆమె. కవిత్వం,కథ, నవల, నాటిక, పాట, రూపకం, సినిమా, వ్యాసం, విమర్శ, అధ్యయనం, విశ్లేషణ, రాజకీయ, ఆర్థిక తాత్విక రంగాలలో ఎన్నెన్ని రచనలు, ఆలోచనలు చేసింది. తెలుగు నేలకెంతో గర్వకారణమై నిలిచింది. అంతేకాదు, స్నేహమయిగా అందరి అభిమానాన్ని గెలుచుకున్నది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, అభినందనలు అందుకున్నది. అయినా ప్రశ్న ఆగలేదు. ఆశయ గమనం ఆగలేదు. ఈ సమాజంలో మానవీయ విలువలకోసం నిరంతరం తపిస్తూనే వున్నారు.

అలాంటి ఉన్నత మానవి, స్నేహమయికి మేము చేయగలిగిన చిన్న ఆత్మీయ అభినందన కానుక ఇది. గత యాభైఏండ్లుగా ఓల్గా సాహిత్య విషయాలను, వెలువరించిన పుస్తకాలను పరిచయం చేయటమే ఈ పుస్తక లక్ష్యం. అందుకు ఆయా పుస్తకాల ముందుమాటలను, తన రచన గురించి తానే రాసుకున్న ముందు మాటలను కలిపి ఇక్కడ అందిస్తున్నాం. దీనివల్ల రచనలోని ఉద్దేశ్యం, అంశం, సారం తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇవి అసలు రచనను చదవటానికి ప్రేరణనిస్తుందని భావించాము. కనుక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాము.

  • ఖమ్మం స్వేచ్ఛావరణం బృందం
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -