‘గోల్డెన్ అవర్’లో ప్రాణరక్షణే అంతిమ లక్ష్యం
జనవరి నుంచి అందుబాటులోకి 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు
ఇప్పటికే పనిచేస్తున్న 4… జూన్ నాటికి మరో 18
109 ట్రామా కేర్ సెంటర్లకు ఆమోదం
వచ్చే మూడు నెలల్లో అందుబాటులోకి 80 అంబులెన్స్‌లు
ఎమర్జెన్సీ కేర్‌పై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక ఫోకస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు ఆపదను ఆసరాగా చేసుకుని జరిగే కార్పొరేట్ దోపిడీ నుంచి సామాన్యులను రక్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ హెల్త్ కేర్’ వ్యవస్థలో సమూల మార్పులను క్రమంగా తీసుకొస్తున్నది. గోల్డెన్ అవర్‌లో ప్రాణరక్షణే అంతిమ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నది. కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగినా, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా..ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలకు లక్షలు ధారపోసి, ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోయే దుస్థితి పేద, మధ్యతరగతి వర్గాలకు రాకూడదన్నదే ప్రధాన ఉద్దేశంతో సర్కారు ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే 31 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో బ్లాక్‌ను రూ.28 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తుంది.
ప్రతి కేంద్రంలోనూ 50 పడకలతో ప్రత్యేక బ్లాకు ఏర్పాటు చేయనున్నారు. హై-ఎండ్ ఐసీయూలో 10 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉంటాయి. 6 హెచ్‌డీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఉండనున్నాయి. తక్షణమే సర్జరీలు చేయడానికి 2 ఆపరేషన్ థియేటర్లను సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా నెగటివ్ ప్రెషర్ వ్యవస్థతో కూడిన 24 ఐసోలేషన్ పడకలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. డయాలసిస్, ప్రసూతి సేవలు, సొంత ల్యాబ్, ఆక్సిజన్ ప్లాంట్ వంటివి ఒకే గొడుగు కింద ఉండటంతో మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ క్రిటికల్ కేర్ బ్లాక్‌ల ద్వారా సేవలు అందుతున్నాయి. వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల, జనగామ, వికారాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో సివిల్ పనులు, అత్యాధునిక పరికరాల ఏర్పాటు పూర్తయ్యాయి. జనవరి మొదటి వారంలో ఆ 9 కేంద్రాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ కేంద్రాల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది విధుల్లో చేరేలా చూడాలని మంత్రి రాజనర్సింహ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2026 జూన్ నాటికి మిగతా 18 అందుబాటులోకి రానున్నాయి.
రెఫరల్స్ తగ్గేలా.. గోల్డెన్ అవర్ దక్కేలా..
ఇప్పటిదాకా జిల్లా ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు లేవు. అత్యవసర వైద్యం కోసం రోగులను హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాకు రెఫర్ చేసేవారు. మార్గమధ్యలోనే ‘గోల్డెన్ అవర్’ (అత్యంత విలువైన సమయం) దాటిపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కోకొల్లలు. ప్రమాదం జరిగిన నిమిషం నుంచి పూర్తిస్థాయి చికిత్స అందే వరకు పటిష్టమైన యంత్రాంగం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖను మంత్రి ఆదేశించారు. అందులో భాగంగానే జిల్లా స్థాయిలోనే కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా క్రిటికల్ కేర్ సేవలు అందించేలాగా కసరత్తు చేస్తున్నది. జాతీయ రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో తక్షణ వైద్యం కోసం వందకు పైగా ట్రామా సెంటర్ల ఏర్పాటు చేస్తున్నది.
ఫోన్ చేసిన నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ‘108’ అంబులెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే 200కిపైగా ‘108’ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరో 80 అందుబాటులోకి తీసుకురావాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నది. జిల్లాల్లోనే ఈ బ్లాక్‌లు, ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి తేవడం వల్ల హైదరాబాద్‌లోని ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తే స్థానికంగానే ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశాలు మెరుగవుతాయి. అత్యవసర చికిత్స కోసం కార్పొరేట్, ప్రయవేటు ఆస్పత్రులకు వెళ్తే రోజుకు లక్షల రూపాయలు దారబోయాల్సిన దుస్థితి తగ్గుతుంది. సీసీబీల్లో పైసా ఖర్చు లేకుండా అదే స్థాయి వైద్యం అందుతుంది. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసినట్టు అవుతుంది.



