నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. అక్కడ జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఉరిశిక్షణ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
గతంలో వాయిదా వేసిన నిమిష ప్రియ మరణ శిక్షను రద్దు చేశారు. యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మరణ శిక్షను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించారని అబూబకర్ కార్యాలయం తన ప్రకటనలో వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి యెమెన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు వెల్లడికాలేదని, దీనిని నిర్ధారిస్తూ భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ అత్యున్నత సమావేశంలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.
నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది.