Thursday, December 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివందేళ్ల దేశ ప్రతిష్ట: ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు

వందేళ్ల దేశ ప్రతిష్ట: ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు

- Advertisement -

సామాన్యపౌరులు మతాన్ని వాస్తవమని అనుకుంటారు. విజ్ఞతగల పౌరులు అదొక అబద్దమని తెలుసుకుంటారు. పాలకులు తెలివిగా తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం వాడుకుంటారు.
-సినేక, రోమన్‌ తత్త్వవేత్త (4 బిసిఇ-65 సి.ఇ) ఆరెస్సెస్‌ వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం పదకొండేండ్లుగా అధికారంలో కొనసాగుతూ వస్తోంది. మూడోసారి స్వతహాగా బలం లేకపోయినా రెండు పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది.మరోవైపు ఆరెస్సెస్‌ సంస్థ ప్రారంభమై వంద సంవత్సరాలైందని వారు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. తమ వల్ల ఈ దేశానికి ఏమి మేలు జరిగిందన్న ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణంలో ఆ ఒక్కటి తప్ప వారు మిగతా పనులన్నీ చేస్తున్నారు. ఈ దేశ ప్రతిష్ట పెరిగిందా? దిగజారిందా? – అని మరోవైపు ఈ దేశ ప్రజలు తీవ్రంగా ‘చారు పె చర్చా’- చేసుకుంటున్నారు. తమ ఖాతాలోకి రావల్సిన పదిహేను లక్షల రూపాయలు ఇంకా రాలేదేమని ఎదురు చూస్తున్నారు. వాటిని కూడా చోర్‌ చౌకీదార్‌ దోచేశాడని రూఢిగా తెలుసుకుం టున్నారు.

పక్కన పాకిస్తాన్‌ ముస్లిం రాజ్యంగా విడిపోయినప్పుడే, నాటి హిందూ మహాసభ సభ్యులు దీన్ని హిందూ రాజ్యం చేయాలనుకున్నారు. ప్రతిసారీ బ్రిటీష్‌ పాలకులకు క్షమాపణలు చెపుతూ బయట పడుతూ వచ్చిన విషయం కావాలనే మరిచిపోయినట్టు నటిస్తారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా, బ్రిటీష్‌ వారికి గూఢచారులుగా పనిచేస్తూ, భజన చేసిన విషయం దాచి పెడతారు. దేశంలోని నాటి యువతీయువ కుల్ని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా అడ్డుకున్న విషయం బయటికి రానీయరు. వాస్తవాలు ఎంతదాచినా దాగవు కదా? నాటి చరిత్రకారులు విషయాలన్నీ గ్రంథస్తం చేస్తూనే వచ్చారు. వాటిని ఎవరూ మార్చలేరు. మార్చ గలమని అనుకునేవారు అవివేకులై ఉంటారు. లేదా అహంభావులై ఉంటారు. పదకొండేండ్లుగా అధికారంలో ఉన్నా, ఈ దేశపు సెక్యులర్‌ స్వభావాన్ని మార్చలేకపోయారు. వైజ్ఞానిక స్పృహతో ముందుకుపోతున్న దేశాన్ని, తమ సనాతన సిద్ధాంతంతో మూడు వేల ఏండ్ల కిందికి తీసుకుపోవాలని తహతహ లాడుతున్నారు. అయినా స్ప్రింగ్‌ యాక్షన్‌ లాగా దేశం తన సెక్యులర్‌ స్వభావంలోకి తిరిగి వస్తూనే ఉంది. ”మన జాతి వాళ్లు మంచి వాళ్లు. ఇతర జాతుల వాళ్లు చెడ్డవాళ్లు అనే సిద్ధాంతాన్ని నమ్మి, అందుకు అనుగుణంగా ప్రవర్తించే వారు ఆలోచన లేని తక్కువ స్థాయి మనుషుల కింద లెక్క” – అని అన్నారు రామ్‌ ధారీ సింగ్‌ దినకర్‌, ప్రసిద్ధ హిందీ కవి.

గడియారం, మొబైల్‌, బంగారి గొలుసు, లేదా డబ్బు దొంగిలించేవాడు అతిసాధారణమైన దొంగవుతాడు. అదే విద్య, ఆరోగ్యం, ఆహారం మొత్తానికి మొత్తంగా ప్రజల భవిష్యత్తును దొంగిలించేవాడు మామూలు దొంగ ఎలా అవుతాడు? అతడు రాజకీయాల్లో చేరి అక్రమంగా ఓట్లు కూడా దొంగిలించి, అధికారం హస్త-గతం చేసుకున్నవాడైతే అలాంటి వారినేమి చేయాలో ఈ దేశప్రజలకు తెలుసు. ఇది పోలీసుస్టేషన్‌లో రిపోర్టు చేసే కేసుకాదు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాల్సిన కేసు- మన దేశంలో 780 భాషలున్నాయి. ఎవరైనా సరే ఒకవ్యక్తి అన్ని భాషలు మాట్లాడలేడు, అర్ధం చేసుకోలేడు. కానీ, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అన్ని భాషలలో తిట్లు తింటూ ఉంటాడు. ఈయనను మించిన ఆచంట మల్లన్న ఇంకొకడు ఉన్నాడు. ఆయనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ప్రపంచ భాషలన్నిటా తిట్లు తింటుంటాడు.చదువు ఇద్దరికీ లేదు. ఇద్దరివీ మూర్ఖపు నిర్ణయాలు. విదేశీ విధానమంటూ ఏదీ లేదు. తనకు ఇంకా నోబెల్‌ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వడం లేదూ? అని ఉడుక్కుంటూ ఉంటాడు – ట్రంప్‌. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుణ్ణయ్యానన్న తృప్తి లేదు. నోబెల్‌ రాలేదని మారాం చేస్తున్నాడంటే- తన పదవి కన్నా నోబెల్‌ శాంతి బహుమతే గొప్పదని ఆయనకు ఆయనే ఒప్పుకుంటున్నారు కదా?

ఇక మన దేశ నాయకుడు తనకు తానే విశ్యగురువునని ప్రకటించుకుని, ప్రపంచ దేశాలు తిరుగుతుంటాడు. తనకు తల్లితో బయలాజికల్‌ రిలేషన్‌ లేదని, ఆ దేవుడే నేరుగా తనని ఈ దేశపు కార్పొరేట్ల బాగుకోసం పనిచేయమని పంపించాడనీ చెప్పకనే చెపుతుంటాడు. బైడెన్‌ అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఈయన వెళితే, ” వెల్కం టు క్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఇండియా’- అన్న హోర్డింగ్లు వైట్‌హౌస్‌ ముందే ప్రదర్శిం చారు. అంతర్జాతీయ మీడియా ఆ విషయాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేసింది. ఇటీవల యు.కె.ప్రధాని ఈయనతో చేయి కలపడానికి ఇష్టపడక చేయి వెనక్కి తీసుకున్నాడు. మొహమాటంగా నవ్వుతూ ఈ విశ్వగురువే బ్రిటన్‌ ప్రధాని చేయి లాక్కుని షేక్‌ హ్యాండిచ్చి, బలవంతంగా మీదపడి కౌగలించుకుని, ఏడవలేక నవ్వుతూ వచ్చాడు. అంతర్జాతీయ మీడియాలోనే కాదు, ఈ దృశ్యం మన ఇండియన్‌ మీడియాలో కూడా కనిపించింది. దేశ ప్రతిష్ట ఇంతగా దిగజార్చడం స్వాతంత్య్రం లభించిన తర్వాత ఇప్పుడే జరిగింది. ఇంతమంది దేశ ప్రధానుల్లో ఎవరికైనా ‘ఓట్‌ చోర్‌-చౌకీదార్‌” – అనే బిరుదు లభించిందా? ఇదిగో ఇప్పుడే మన కండ్లముందు కనిపిస్తోంది! ఎవరికైనా మురికి బట్టలు వేసుకుంటే చిన్నతనంగా, నామోషీగా అనిపిస్తుంది కదా? మరి మురికి ఆలోచనలు, మురికి మాటలు, మురికి పెత్తనాలు, విద్వేష ప్రసంగాలు చేస్తున్నవారు, వారి గురించి వారు ఆలోచించుకోరా? ఇలాంటి వారు ఎన్ని రెట్లు సిగ్గుపడాలీ?
దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏడులక్షల ముప్పయి రెండు వేల మంది దేశం కోసం తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా హిందూ మహాసభ/ ఆరెస్సెస్‌/ జన సంఫ్‌ుకు సంబంధించిన వారు లేరు. (వీరంతా నేటి బీజేపీ వారి పూర్వీకులు) అందుకే కాబోలు తామే అగ్రశ్రేణి దేశభక్తులమని ప్రతిక్షణం టముకు వేసుకుంటూ ఉంటారు. ఇటీవల బీహార్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ మన అగ్రనేత ఇలా సెలవిచ్చారట! ”మిత్రోఁ నేను బీహార్‌ వాడినే. నా చిన్నప్పుడు పెద్ద వరద వస్తే అందులో కొట్టుకుపోయి గుజరాత్‌లో తేలాను. అంతే !! నేను ఇక్కడివాడినే నమ్మండి. నా పార్టీకి ఓట్లేసి గెలిపించండి. మిమ్మల్ని ఉద్దరించే అవకాశమివ్వండి. నాది గ్యారెంటీ!” -బీహార్‌ ప్రజలు ఒక్కొక్కరుగా ఉన్నచోట కండ్లు తిరిగి పడిపోయారట! వాష్‌ రూంలోకి వెళ్లే దాకా ఫొటో షూట్‌ చేయించుకునే వ్యక్తి-డిగ్రీ తీయించుకునే సమయంలో ఫొటో తీయించుకోడని ఎవరైనా ఎలా అనుకుంటారు- చెప్పండి! అని అన్నాడొక పెద్దమనిషి. నిజమేకదా? ఇంతకూ, మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది కదా? చిన్న జిల్లా స్థాయి పరిపాలన సాగించడానికి ఐఏయస్‌- వంటి కఠినమైన పరీక్షలు రాసి, తగిన శిక్షణ పొంది ఉద్యోగం చేయాల్సి ఉంటుంది కదా? అదే మనం దేశ పరిపాలన కోసం చదువురాని అవివేకుల్ని, ఓట్లు దొంగిలించే కుట్రదారుల్ని అనుమతిస్తున్నాం. ఇక అభివృద్ధి, వికాసం ఎలా సాధ్యమవుతుంది? విద్వేష రాజకీయాలు అగ్గి రాజేస్తున్న చోట దేశ ప్రజలు సమభావంతో ఎలా ఉండగలరూ? డాక్టరు ప్రిస్క్రిప్షన్‌ మెడికల్‌ షాపు వారికి అర్థమైనట్టు- ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న వికాసం కేవలం అంధభక్తులకే అర్థమవుతుందట!
షహీద్‌ భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష తప్పించడానికి ప్రయత్నించి విఫలమైన వారు ముస్లింలు. ఉరిశిక్ష పడాల్సిందేనని శతవిధాల ప్రయత్నించి సఫలమైనవారు హిందూ పండిత పురోహితులు. దీనితో ఎవరికైనా సులభంగానే అర్థమవుతుంది. దేశభక్తులెవరో, దేశద్రోహులెవరో. దేశభక్తి గురించి ఇప్పుడు ఊదరగొట్టే వాళ్లు కూడా అప్పటి హిందు పండితుల వారసులే లేదా వారి ఆలోచనా ధోరణికి వారసులు! అది కాకుండా తెలంగాణ విషయానికి వస్తే- తెలంగాణా ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసే నాటికి, అంటే 1948 సెప్టెంబర్‌ 17 నాటికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) నిషేధించబడి ఉంది. భారతీయ సమాజంలో ద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తుందని ఆనాటి పండిట్‌ నెహ్రూ ప్రభుత్వం ఆ సంస్థను బ్యాన్‌ చేసింది. అది కూడా గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన సర్దార్‌ పటేల్‌, నెహ్రూ మంత్రి వర్గంలో హోమ్‌మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆ నిషేధం అమల్లోకి వచ్చింది. ఆ నిజాన్ని దాచిపెట్టి, అధికారంలో ఉన్నాం గనక, ఏది చెప్పినా చెల్లుబాటవుతుందనుకుని పాపం బీజేపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తుంటారు. ప్రపంచంలో అత్యధిక స్లాబులతో ఈ దేశ ప్రజల్ని పీల్చి పిప్పిచేసిందెవరు నాయనా? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొఘలులా? బ్రిటీష్‌ వారా? నిన్నటి కాంగ్రెస్‌ ప్రభుత్వమా? లేక నేటి బీజేపీ ప్రభుత్వమా? ఒక్కసారి లెక్కలు తీయండి-అని అంటున్నారు. ఇలాంటి విషయాలు అర్థం చేసుకోలేరేమో గానీ, అంధ భక్తులకు మెదడే ఉండదని మనం ఎంతమాత్రమూ అనుకోగూడదు. ఎందుకంటే- మీరు ‘చోర్‌’ అని అన్నారనుకోండి. అంతే. ఈ దేశభక్తులకు అర్థమైపోతుంది.. మీరు చౌకీదార్‌ గురించి మాట్లాడుతున్నారని!
2014కు ముందు గో మాంసం ఎగుమతి చేసే దేశాల్లో మన భారతదేశం తొమ్మిదో స్థానంలో ఉండేది. తర్వాత గోమాత పుత్రులే అధికారంలోకి వచ్చారు. వచ్చి ఏం చేశారూ? గో మాంస ఎగుమతుల్ని విపరీతంగా పెంచారు. దాంతో భారతదేశం రెండోస్థానానికి వచ్చింది. పవిత్ర గోమాతకు భజనలు చేసే ఈ అంధభక్తులు, ఈ దేశ ప్రజలచే గోమూత్రం తాగించి, గోవుపేడ తినిపించి, అధిక సంఖ్యాకుల్ని మానసికంగా బానిసలుగా చేసి, వారి విచక్షణా జ్ఞానాన్ని నాశనం చేయాలని కంకణబద్ధులయ్యారు. అయితే దేశంలోని యువతరం మోసాన్ని గ్రహిస్తున్నారు. ‘ఓట్‌చోరి’తో అక్రమంగా అధికారం చేజిక్కించుకున్న వారి కుట్రల్ని ఎక్కడికక్కడ బట్టబయలు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉంటే బీజేపీ వారి మరో పెద్దకుట్ర బహిర్గతమైంది. మన రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని బీజేపీ నేతలు సుబ్రహ్మణ్యస్వామి, బలరామ్‌ సింగ్‌, అడ్వొకేట్‌ అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన భారత సర్వోన్నత స్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ- ఆ పిటిషన్‌ను కొట్టేసింది – ”రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న లౌకిక, సామ్యవాద పదాలను తొలగించడం కుదరదని” -తేల్చి చెప్పింది. సోషలిజం, సెక్యులరిజం అనేవి దేశ ఉన్నతికి దోహదపడే అంశాలని సుప్రీంకోర్టు బెంచ్‌ తీర్పు చెప్పింది.బీజేపీ దేశభక్తుల తెలివితేటలు ఈ విధంగా ఉంటాయన్నమాట! సెక్యులర్‌ – అనే పదానికి కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు కూడా చేస్తుంటారు. సెక్యులర్‌- అంటే అన్ని మతాలనూ సమానంగా చూడమని కాదు – మతాలకు అతీతంగా లేదా మత రహితంగా నడుచుకొమ్మని.

అధికార బీజేపీకి దాసోహమని, ఓట్లో చోరీ విషయాన్ని దాచిపెడుతున్న ఎలక్షన్‌ కమిషన్‌ కూడా ఒక తప్పుడు పనిచేసింది. ”తమ విషయంలో జోక్యం చేసుకోవద్దని” ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టుకు లేఖ రాసింది!ఎంత హాస్యాస్పదం? అలా రాయకూడదు కదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించిన ఎలక్షన్‌ కమిషన్‌ను రక్షణశాఖలో పని చేసిన రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ అనుపమ ఆచార్య తీవ్రంగా దుయ్యబట్టడమే కాదు, దేశ ప్రజలకు ఎలక్షన్‌ కమిషన్‌ కుట్రను స్పష్టంగా తెలియజేశారు. ”ఎన్నికల కమిషన్‌- సుప్రీంకోర్టు అధికారాల్ని సవాలు చేయడం – ప్రజాస్వామ్యానికి విఘాతం!” అని అన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న ఆరెస్సెస్‌-బీజేపీలకు ఇంకా ఈ ఉత్సవాలు అవసరమా? ముందు దేశ ప్రజల ముందు చెంపలేసుకుని క్షమాపణలు చెప్పుకోవాలి కదా?

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -