Tuesday, July 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనిమిషా ప్రియా కేసులో కీల‌క మ‌లుపు

నిమిషా ప్రియా కేసులో కీల‌క మ‌లుపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యెమెన్‌లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియా కేసు మరోసారి మలుపు తిరిగింది. ఆమెకు విధించిన ఉరిశిక్షను రద్దు చేశారన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా చెప్పినట్లుగా మంగళవారం విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష యథాతథంగా కొనసాగుతుందనీ, ఇప్పటి వరకు ఉరిశిక్ష రద్దు కాలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం అర్ధరాత్రి భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ మతపరమైన నాయకుడు కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో,యెమెన్‌ అధికారులు నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు.

యెమెన్‌ నుంచి భారత ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు

భారత గ్రాండ్‌ ముఫ్తీ చేసిన విజ్ఞప్తికి స్పందనగా యెమెన్‌లో ప్రసిద్ధ సూఫీ పండితుడు షేక్‌ హబీబ్‌ ఒమర్‌ బిన్‌ హఫీజ్‌ ప్రత్యేకంగా ఒక చర్చల బృందాన్ని నియమించారని తెలిపారు. ఈ బఅందం యెమెన్‌ ప్రభుత్వంతో పాటు, ఇతర అంతర్జాతీయ వేదికలపై కూడా మధ్యవర్తిత్వం చేసినట్లు పేర్కొన్నారు. ఫలితంగా చర్చలు విజయవంతమై, అధికారులు ఉరిశిక్షను ఉపసంహరించేందుకు అంగీకరించారని ఆ కార్యాలయం ప్రకటించింది. అయితే, దీనిపై విదేశాంగ శాఖ వర్గాలు స్పందిస్తూ, కొందరి నుంచి వచ్చిన సమాచారం పూర్తిగా నిరాధారమని చెప్పారు. ఈ వ్యవహారంపై యెమెన్‌ నుంచి భారత ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిమిష ప్రియ కేసు పరిస్థితి తిరిగి ప్రారంభ స్థాయికి వచ్చినట్లయింది.

భారత్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు యెమెన్‌ ప్రభుత్వం సహకారం

ఇక, యెమెన్‌కు చెందిన వ్యక్తి హత్య కేసులో నిమిష ప్రియకు జూలై 16 న ఉరిశిక్ష అమలవ్వాల్సి ఉండగా, చివరి క్షణంలో అక్కడి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ కేసులో బ్లడ్‌ మనీ చెల్లింపు అంశంపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు భారత్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు యెమెన్‌ ప్రభుత్వం సహకరించింది. అయితే, తాము బ్లడ్‌ మనీకి అంగీకరించబోమని బాధిత కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసు ఎలా పరిష్కారమవుతుందనే అంశంపై గందరగోళం కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -